Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఆంధ్రా ఉద్యోగులకు పోస్టింగ్స్‌ ఇవ్వకపోతే జైలుకే- కేసీఆర్‌ సర్కార్‌కు సుప్రీం లాస్ట్‌ వార్నింగ్‌

ఏపీ విభజన తర్వాత తెలంగాణకు వచ్చిన ఉద్యోగులకు కేసీఆర్‌ ప్రభుత్వం పోస్టింగ్స్‌ ఇవ్వకుండా కాలయాపన వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇవాళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్‌ ఉద్యోగుల విభజనకు సంబంధించి జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తెలంగాణ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ నుంచి రిలీవ్‌ అయిన 84 మంది విద్యుత్‌ ఉద్యోగులకు తక్షణమే పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏపీ-తెలంగాణ విభజన సందర్భంగా జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ నివేదిక ఇచ్చింది. దాని ప్రకారమే ఉద్యోగుల విభజన జరిగింది. అయితే ఈ నివేదిక ప్రకారం తెలంగాణకు వచ్చిన 84 మంది విద్యుత్‌ ఉద్యోగులకు పోస్టింగ్స్‌ ఇచ్చేందుకు కేసీఆర్‌ సర్కార్‌ కొంతకాలంగా నిరాకరిస్తూ వస్తోంది. దీంతో వారు తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశించినా తెలంగాణ సర్కార్‌ వెనక్కి తగ్గలేదు. దీంతో ఇవాళ మరోసారి ఇదే అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేసీఆర్‌ సర్కార్‌ కు ఈ విషయంలో చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. 2 వారాల్లోగా జస్టిస్‌ ధర్మాధికారి నివేదికను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నివేదిక అమలు అయ్యిందా?, లేదా? అన్న విషయంపై ఈ నెల 31న మరోమారు సమీక్ష చేపట్టనున్నట్లు తెలిపింది. ఇవాళ విచారణ సందర్భంగా ఏపీ విద్యుత్‌ ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయంపై సుప్రీంకోర్టుకు మొరపెట్టుకున్నారు. కోర్టుల ఆదేశాలను తెలంగాణ సర్కారు అమలు చేయడం లేదని ఈ సందర్భంగా ఉద్యోగులు ధర్మాసనానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉద్దేశపూర్వకంగానే కోర్టుల ఆదేశాలు ఉల్లంఘించారంటూ తెలంగాణ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కోర్టు ధిక్కరణ కింద విద్యుత్‌ శాఖ అధికారులకు జైలు శిక్షే పరిష్కారమని వ్యాఖ్యానించింది. 84 మంది ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు చివరి అవకాశం ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img