Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆఖరిక్షణంలో మార్పులా ?

అధికార దుర్వినియోగం తగదు
‘నీట్‌’ మార్పులపై కేంద్రానికి సుప్రీంకోర్టు మొట్టికాయలు

న్యూదిల్లీ : జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష` పోస్టు గ్రాడ్యుయేట్‌ సూపర్‌ స్పెషాలిటీ 2021 (నీట్‌ ఎస్‌ఎస్‌ 2021) పరీక్షా విధానంలో ఆఖరి నిమిషంలో మార్పులు చేయడం ఏమిటంటూ కేంద్రప్రభుత్వాన్ని సర్వోన్నత న్యాయస్థానం సోమవారం నిలదీసింది. కేంద్రప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది. మెడిసిన్‌లోని ఓ బ్రాంచ్‌కు అనుకూలంగా ఈ మార్పులు చేశారంటూ దుయ్యబట్టింది. వీళ్లు యువ వైద్యులు, ఫుట్‌బాలర్లు కాదంటూ అసహనం వ్యక్తం చేసింది. సున్నితత్వంలేని బ్యూరోక్రాట్ల దయకు యువ వైద్యులను వదిలేయరాదని జస్టిస్‌ డీవై చంద్రచూద్‌ అన్నారు. కేంద్రంతో పాటు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ (ఎన్‌బీఈ), నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)పై అసహనం వ్యక్తంచేశారు. నీట్‌ పీజీ సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష నవంబరు 13 14 తేదీల్లో జరగాల్సి ఉంది. ఈ పరీక్ష తేదీలను జులై 23న ప్రకటించారు. విధానంలో మార్పు గురించి ఆగస్టు 31న ప్రకటన వెలువడిరది. విద్యావిధానం (స్టడీ ప్యాట్రన్‌) పరీక్షా విధానానికి అనుగుణంగా ఉండాలని జస్టిస్‌ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు. చివరి నిమిషంలో పరీక్షా విధానాన్ని మారిస్తే విద్యార్థులు గందరగోళానికి గురవుతారన్నారు. ఈ మార్పు చేసేందుకు అంత తొందర ఏమిటి? ఈ ఏడాదే చేయాల్సిన అవసరం ఏమిటి? పరీక్షలకు నోటిఫికేషన్‌ ఇచ్చిన తర్వాత మార్పు ఎందుకు? అని కేంద్రాన్ని జస్టిస్‌ చంద్రచూడ్‌ ప్రశ్నించారు. ఇటువంటి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు నెలల తరబడి శ్రమిస్తారని, అధికారం ఉందికదా అని ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తారా అని కేంద్రానికి ధర్మాసనం మొట్టికాయలు వేసింది. ఈ వ్యవహారంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో సంప్రదింపులు జరిపి తగు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఒక మెడిసిన్‌ బ్రాంచ్‌కు సానుకూలంగా చివరి నిమిషంలో ఈ మార్పులు జరిగినట్లు ఆరోపిస్తూ 40 మందికిపైగా వైద్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కాగా, మూడేళ్లుగా ఒకటే విధానం అమల్లో ఉంటే.. ఆకస్మికంగా పరీక్షలకు ముందు విధానాన్ని మార్చారని, ఇది మెడిసిన్‌లోని ఓ విభాగం వారి కోసమే జరిగిందని పిటిషనర్లు ఆరోపించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img