Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆగిన రైలు

కట్టలు తెంచుకున్న అన్నదాత ఆగ్రహం
లఖింపూర్‌ఖేరీ ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా రైల్‌రోకోలు
184 ప్రాంతాల్లో 6 గంటలపాటు స్తంభించిన రైల్వేవ్యవస్థ
160కిపైగా రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లోనూ ఆందోళనలు

న్యూదిల్లీ : అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకోవడంతో కేంద్ర ప్రభుత్వానికి అనూహ్యంగా ఎదురుదెబ్బ తగిలింది. లఖింపూర్‌`ఖేరీ ఘటనకు నిరసనగా సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) ఇచ్చిన పిలుపు మేరకు సోమవారంనాడు దేశవ్యాప్తంగా రైల్‌రోకో కార్యక్రమాలు జరిగాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ రైతుసంఘాలు ఈ ఆందోళనకు మద్దతునివ్వడంతో రైల్వేవ్యవస్థ అతలాకుతలమైంది. 184 ప్రదేశాల్లో 6 గంటలకు పైగా రైతులు, వారి మద్దతుదారులు ‘రైల్‌రోకో’ నిర్వహించారు. దీంతో 160కిపైగా రౖెెళ్ల రాకపోకలు స్తంభించాయి. ఇటీవల కాలంలో అతిపెద్ద రైల్‌రోకో కార్యక్రమం ఇదే కావడం విశేషం. సోమవారంనాడు 63 రైళ్లను మార్గమధ్యంలోనే ఆపివేయగా, మరో 43 రైళ్లను పూర్తిగా రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారిమళ్లించాల్సి వచ్చింది. దీని ఫలితంగా ఇంకో 50 రైళ్ల షెడ్యూల్స్‌ను మార్చాల్సి వచ్చిందని రైల్వేశాఖ ముఖ్య పౌరసంబంధాల అధికారి ప్రకటించారు. రైల్‌రోకో ఆందోళన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ఎస్‌కెఎం కృతజ్ఞతలు తెలిపింది.
సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన పోరు మరింత ఉధృతమైంది. నల్ల చట్టాలను రద్దు చేయాలన్న ఏకైక డిమాడుతో గత పది నెలలకు పైగా శాంతియుతంగా రైతులు సాగిస్తున్న పోరాటాలను పట్టించుకోకపోగా కేంద్ర పెద్దల సహకారంతో ఏకంగా వాహనాలతో దాడి చేసి అన్నదాతల ఉసురు తీసిన లఖింపూర్‌ ఖేరీ ఘటనతో రైతుల ఆగ్రహం పెల్లుబికింది. ఆ మారణహోమానికి కారణమైన నిందితుడు ఆశిష్‌ మిశ్రా తండ్రి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను తొలగించాలని డిమాండు చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులో భాగంగా దేశ వ్యాప్తంగా సోమవారం చేపట్టిన ఆరు గంటల రైల్‌ రోకో కార్యక్రమం విజయవంతమైంది. ఇందులో భాగంగా పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, దిల్లీ, యూపీ, బీహార్‌ సహా ఉత్తరాదిలోని అనేక ప్రాంతాల్లో రైతులు సోమవారం రైలు పట్టాలపై బైఠాయించి రాకపోకలను అడ్డుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లోనూ రైల్‌రోకోలు విజయవంతమయ్యాయి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు నిర్వహించిన రైల్‌ రోకో కారణంగా అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ఈ సందర్భంగా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న రైతు సంఘం నేతలు మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మూడు సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. లఖింపూర్‌ ఖేరీ కేసులో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ తమ నిరసనలు కొనసాగిస్తామని బీకేయూ మీడియా ఇన్‌ఛార్జ్‌ ధర్మేంద్ర మాలిక్‌ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఆగిన 60 రైళ్లు
ఆరు గంటల రైల్‌ రోకో పిలుపులో భాగంగా ఉత్తర రైల్వే జోన్‌లోని 184 ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. వివిధ స్టేషన్‌లలో 60కి పైగా రైళ్లును అన్నదాతలు అడ్డుకున్నారు. రాజస్థాన్‌, హర్యానాలోని కొన్ని విభాగాలలో 18 రైళ్లు రద్దు చేశారు. 10 రైళ్లను పాక్షికంగా రద్దు చేయడంతో పాటు రైతుల నిరసనల కారణంగా అనేక రైళ్లను దారి మళ్లించారు. దాదాపు 25 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు చేసినట్టు ఉత్తర రైల్వే విభ విభాగం తెలిపింది. రాజస్థాన్‌లోని సహనేవాల్‌, రాజ్‌పురా సమీపంలోని రైల్వే ట్రాక్‌లను ఆందోళన కారులు చుట్టుముట్టడంతో న్యూదిల్లీ-అమృత్‌సర్‌ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ను శంబు స్టేషన్‌ సమీపంలో నిలిపివేశారు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌ జిల్లాలోని ట్రాక్‌లు సహా కీలకమైన జైపూర్‌ రైల్వే జంక్షన్‌ స్టేషన్‌ ప్రవేశద్వారం వద్ద భారీ నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అన్నదాతల మరణానికి కారణమైన కేంద్రం, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండు చేశారు. ఇదిలా ఉండగా పంజాబ్‌లోని 11 జిల్లాల్లో రైల్‌ రోకో కార్యక్రమం నిర్వహించినట్టు కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌ సింగ్‌ పాంథర్‌ తెలిపారు.
కేంద్రం మాట్లాడలేదు: రాకేశ్‌ తికైత్‌
సాగు చట్టాల విషయంలో పిలుపునిచ్చిన రైల్‌ రోకో కార్యక్రమం, నిరసనలు ఒక్కో జిల్లాలో ఒక్కోరకంగా సాగాయని రైతు ఉద్యమ నేత రాకేశ్‌ తికైత్‌ అన్నారు. లఖింపూర్‌ ఘటన విషయంలో కేంద్రం మాత్రం ఇప్పటివరకూ తమను సంప్రదించలేదని వెల్లడిరచారు.
అట్టుడికిన పాట్నా స్టేషన్‌
సంయ్తు కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన రైల్‌రోకో సందర్భంగా బీహార్‌ రాజధాని పాట్నా స్టేషన్‌ వామపక్షాల కార్యకర్తల ఆందోళనలతో అట్టుడికింది. సోమవారం ఉదయం 11:30 గంటలకు కార్మిక, కర్షక సంఘాలు రైల్వే స్టేషన్‌ వరకూ భారీ ర్యాలీ నిర్వహించాయి. పాట్నా స్టేషన్‌ గోలాంబర్‌ వద్దకు చేరుకుని లఖింపూర్‌ మారణకాండకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అక్కడకు చేరుకున్న పోలీసులకు, అందోళన కారులకు మధ్య యుద్దవాతావరణం నెలకొంది. ప్లాట్‌ఫారంలోకి దూసుకెళ్లడానికి ప్రయత్నించిన ఆందోళనకారులను బలవంతంగా నిలువరించారు. ఈ నేపథ్యంలో అఖిల భారత కిసాన్‌ మహాసభ రాష్ట్ర కార్యదర్శి సతి రామధర్‌ సింగ్‌ ఆధ్వర్యంలో పాట్నా రైల్వే స్టేషన్‌ ప్రాంగణంలోనే భారీ సభను ఏర్పాటు చేశారు. వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని, లఖింపూర్‌ ఘటనకు బాధ్యుడైన కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండు చేశారు. లఖింపూర్‌ నిందితుడు ఆశిష్‌ మిశ్రాను కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. విద్యుత్‌ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలని, కనీస మద్దతు ధర చట్టాలను రూపొందించాలని డిమాండు చేశారు. ఈ భారీ నిరసన కార్యక్రమంలో బీహార్‌ రాష్ట్ర కిసాన్‌ సభ ప్రధాన కార్యదర్శి అశోక్‌ ప్రసాద్‌ సింగ్‌, సహాయ కార్యదర్శి ఉమేష్‌ సింగ్‌, కిసాన్‌ ఖేత్‌ కార్మిక సంఘం నేత మణికంఠ పాఠక్‌, రైతు నేతలు గోపాల్‌ శర్మ, వ్యవసాయ కార్మిక సంఘం నేత నంద కిషోర్‌ సింగ్‌, జై కిసాన్‌ ఉద్యమ నేత అనూప్‌ కుమార్‌ సిన్హా, కిసాన్‌ కార్మిక సభ నేత రాంచంద్ర సింగ్‌, కిషన్‌ సంఘర్ష్‌ సమితి నేత దినేష్‌ సింగ్‌, ఆల్‌ ఇండియా కిసాన్‌ ఫెడరేషన్‌ జమీరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

కేంద్రం దిగిరాకపోతే సరికొత్త ఉద్యమం : అంజన్‌
దేశ వ్యాప్తంగా అన్నదాతలు చేపట్టిన రైల్‌రోకో కార్యక్రమం విజయవంతమైందని అఖిల భారతీయ కిసాన్‌ సభ (ఏఐకేఎస్‌) జాతీయ ప్రధాన కార్యదర్శి అతుల్‌ కుమార్‌ అంజన్‌ పేర్కొన్నారు. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడం, కనీస మద్దతు ధరతో ఉత్పత్తుల కొనుగోలుకు చట్టబద్ధమైన హామీ, లఖింపూర్‌ నిందితులపై కఠిన చర్యల డిమాండ్లతో చేపట్టిన రైల్‌రోకోలో అన్నదాతలే ప్రత్యక్షంగా పాల్గొన్నారని తెలిపారు. కేంద్రం అన్నదాతల అందోళనలను నిర్లక్ష్యం చేస్తే రైతు ఉద్యమం మరింత వేడెక్కుతుందని హెచ్చరించారు. ఇప్పటికేనా కేంద్ర పెద్దలు సానుకూలంగా చర్చించాలని, రైతుల డిమాండ్ల మేరకు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే సరికొత్త ఉద్యమ ప్రస్థానం ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే త్వరలో దిల్లీలో సంయుక్త కిసాన్‌ మోర్చా ముఖ్య నేతల సమావేశం కానున్నట్టు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img