Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఆదుకోమంటే అరెస్టులా?

అన్నదాత గోడు పట్టదా

. కేవీవీ ప్రసాద్‌, ముప్పాళ్ల ఆగ్రహం
. మంగళగిరిలో సీపీఐ, రైతు నేతల అరెస్టు

విశాలాంధ్ర – మంగళగిరి/తాడేపల్లి: అకాల వర్షాలకు పంట దెబ్బతిన్న రైతులను ఆదుకోమని అడిగితే అరెస్టు చేయడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. పంటనష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ సీపీఐ, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం అధ్వర్యంలో శుక్రవారం సీఎం కార్యాలయ ముట్టడికి సమాయత్తమయ్యారు. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి రైతుసంఘం, సీపీఐ నాయకులు, కార్యకర్తలు మంగళగిరిలోని వేములపల్లి శ్రీకృష్ణభవన్‌కు ఉదయాన్నే పెద్దఎత్తున చేరుకున్నారు. పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా సీఎం కార్యాలయానికి చేరుకుని ముఖ్యమంత్రికి వినతిపత్రం అందజేయాలని నాయకులు భావించారు. అయితే, అప్పటికే అక్కడ భారీగా మోహరించిన పోలీసులు సీపీఐ, రైతుసంఘం నాయకులు, కార్యకర్తలను అడ్డుకుని బలవంతంగా లాక్కెళ్లి వ్యానులో ఎక్కించి దుగ్గిరాల పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ అకాల వర్షాలకు రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, మామిడి, ఉద్యానవన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, పసుపు, మొక్కజొన్న కొనుగోలు చేసే పరిస్థితి లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. పండిరచిన పంటను మద్దతు ధరతో కొనుగోలు చేసే పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదని విమర్శించారు. పంటను కాపాడుకోవడానికి పరదాలు కూడా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి మీనమేషాలు లెక్కిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ కోసం రూ.2 వేల కోట్లు కేటాయించినప్పటికీ వాటిని వినియోగించడం లేదన్నారు. ఏ పంటకు కనీస మద్దతు ధర లేదని, పంటల బీమా పథకం అమలు జరగడం లేదని ఆగ్రహం వెలిబుచ్చారు. ధరల స్థిరీకరణ కోసం రూ.3 వేల కోట్లు కేటాయించామని చెబుతున్న ప్రభుత్వం…ఆ నిధిని ఉపయోగించి పంటలను ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి బేషజాలకు పోకుండా ఆహార పంటలకు ఎకరాకు రూ.40 వేలు, వాణిజ్య పంటలకు రూ.75 వేలు ఇవ్వాలని, ఉద్యానవన పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. రైతు పండిరచిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయడం ఈ ప్రభుత్వానికి చేతకావడం లేదని మండిపడ్డారు. రైతుల దయనీయ పరిస్థితులను వినే తీరిక…ఓపిక ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరమన్నారు. కనీసం వినతిపత్రం ఇవ్వడానికి కూడా అనుమతివ్వడం లేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా రైతుసంఘం ప్రతినిధులు, సీపీఐ శ్రేణులను గృహనిర్బంధం, అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం రైతులకు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రిగా రైతులకు ఇచ్చిన భరోసా ఏమిటని జగన్‌మోహన్‌ రెడ్డిని నిలదీశారు. రైతు భరోసా కేంద్రాలు రైతు భక్షక కేంద్రాలుగా మారాయన్నారు. మీటనొక్కుడుకు పరిమితమైన జగన్‌మోహన్‌ రెడ్డి రైతును ఆదుకునే దిశగా చర్యలు చేపట్టడం లేదని విమర్శించారు. ఒక్క మిర్చి పంటకు తప్ప ఏ పంటకు గిట్టుబాటు ధర లేదని తెలిపారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి సీఎం జగన్‌ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకుంటే అన్ని ప్రతిపక్షాలను కలుపుకుని ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
జీఓ 1ని కొట్టివేయడం శుభపరిణామం
ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ 1ని కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడం శుభపరిణామమని ముప్పాళ్ల అన్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు.
జీఓ ఒకటిని సవాల్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పిటిషన్‌ వేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. అరెస్టు అయిన వారిలో సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్‌, మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు కంచర్ల కాశయ్య, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, జమలయ్య, కాబోతు ఈశ్వరరావు, జాలాది జాన్‌బాబు, ఉలవలపూడి రాము, కోట మాల్యాద్రి, ముసునూరు సుహాస్‌, అన్నవరపు ప్రభాకర్‌, జవ్వాది సాంబశివరావు, పంతగాని మరియదాసు, జవహర్‌ జానీ, బాణాల రామయ్య, ఎస్‌కే కరీముల్లా, శశి, వెంకటేశ్వర్లు, గుంటక సాంబిరెడ్డి, పుప్పాల సత్యనారాయణ, బోర్లా శీను, ముప్పాళ్ల శివశంకరరావు, రామారావు, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్‌కే సుభానీ, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బందెల నాజర్‌ జీ, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగభూషణం, ఏఐవైఎఫ్‌ గుంటూరు నగర కార్యదర్శి చల్లా మరియదాసు, ఏఐవైఎఫ్‌ నాయకులు బి.గోపి, ఎస్‌కే కరిముల్లా, మల్లికార్జునరావు, ఆర్‌.వందనం, ఉమామహేశ్వరరావు, ముక్కామల, కాట్రగడ్డ రామచంద్ర జోషి, శనగల సుబ్బారెడ్డి, ఎర్రగుంట నాగరాజు, రత్తయ్య గోగినేని, గుత్తికొండ రామారావు, బోస్‌, తాడిబోయిన శివన్నారాయణ, షేక్‌ జాన్‌సైదా తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img