Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఆప్‌…కాంగ్రెస్‌ జిరాక్స్‌

ప్రధాని మోదీ విమర్శ
పఠాన్‌కోట్‌: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌), కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఆప్‌ను కాంగ్రెస్‌కు జిరాక్స్‌ (నకలు) అని అభివర్ణించారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ కూటమి తరపున ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ…రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు లాభసాటిగా మారతాయన్నారు. ‘మీకు సేవ చేయడానికి నాకు ఐదేళ్లు సమయం ఇవ్వండి. వ్యవసాయం, వాణిజ్యం, పరిశ్రమలు లాభసాటిగా మారతాయని నేను మీకు హామీ ఇస్తున్నాను’ అని మోదీ అన్నారు. కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీలు నేరాల్లో భాగస్వాములని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు పరస్పరం పోటీ పడుతున్నట్లు నటిస్తున్నాయని ఆరోపించారు. పంజాబ్‌కు కాంగ్రెస్‌ మాదక ద్రవ్యాల జాఢ్యాన్ని తీసుకొచ్చిందని, దిల్లీ యువతను ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్యంలో ముంచేందుకు ప్రయత్నిస్తోందని చెప్పారు. పంజాబ్‌ను కాంగ్రెస్‌ అవమానించిందన్నారు. పఠాన్‌కోట్‌లో ఉగ్రవాద దాడి అనంతరం దేశ సైనికుల ధైర్యసాహసాలు, శక్తిసామర్థ్యాలను కాంగ్రెస్‌ నాయకులు ప్రశ్నించారని గుర్తు చేశారు. అమరవీరుల కీర్తిప్రతిష్ఠలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‌లో వ్యక్తమవుతున్న ఇటువంటి అభిప్రాయాలను కెప్టెన్‌ అమరేందర్‌ సింగ్‌ అప్పట్లో ఆపారని చెప్పారు. ఇప్పుడు ఆయన కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారన్నారు. కాంగ్రెస్‌కు మరోసారి అవకాశం ఇస్తే, పంజాబ్‌ భద్రతను ప్రమాదంలోకి నెట్టేస్తుందని హెచ్చరించారు. కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా…1984లో సిక్కులపై జరిగిన దాడుల నిందితులను బీజేపీ ప్రభుత్వం కటకటాల వెనుకకు నెట్టిందని ప్రధాని చెప్పుకొచ్చారు. 1947లో దేశ విభజన జరిగినపుడు కర్తార్‌పూర్‌ సాహిబ్‌ పాకిస్థాన్‌లో కలవడంలో కాంగ్రెస్‌ పాత్రను ప్రశ్నించారు. 1965 యుద్ధం సమయంలోనూ దీనిని వెనుకకు తీసుకోవడానికి కాంగ్రెస్‌ ప్రయత్నించలేదని మోదీ నిందించారు. వంశపారంపర్య రాజకీయాలపై మాట్లాడుతూ… తాము ఎక్కడ గెలిచినా, రిమోట్‌ కంట్రోల్‌ ప్రభుత్వాన్ని తొలగిస్తామని, బుజ్జగింపులు, వంశపారంపర్య రాజకీయాలను దూరం చేస్తామని అన్నారు. తాము నూతన పంజాబ్‌ను సృష్టిస్తామని చెప్పారు. ప్రజలు ఒకసారి తమకు మద్దతిస్తే, ఇక వదిలిపెట్టరని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు మోదీ దిల్లీలోని కరోల్‌బాగ్‌లో ఉన్న శ్రీ గురు రవిదాస్‌ విశ్రామ్‌ ధామ్‌ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img