Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆప్‌పై ఆగని బీజేపీ కుట్రలు

. రూ.164 కోట్ల జరిమానా
. కేజ్రీవాల్‌ లక్ష్యంగా చర్యలు సిసోడియా
. బ్యాంక్‌ ఖాతాలు స్వాధీనం చేసుకోవాలి: బీజేపీ

న్యూదిల్లీ : వార్తాప్రతికలకు ఇచ్చే ప్రభుత్వ ప్రకటనలపై ఆప్‌, బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. ప్రభుత్వ అధికారులను చట్టవిరుద్ధంగా ఉపయోగించుకుంటూ తమ పార్టీని బద్నామ్‌ చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్‌ ఆరోపించింది. బీజేపీ సైతం ఎదురుదాడికి దిగింది. ఆప్‌ బ్యాంక్‌ ఖాతాలు స్వాధీనం చేసుకోవాలని, నాయకుల ఆస్తులను అటాచ్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. ప్రభుత్వ ప్రకటనల పేరుతో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) సొంత ప్రచారం చేసుకుందనే ఆరోపణలపై దిల్లీ రాష్ట్ర డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ పబ్లిసిటీ (డీఐపీ) విభాగం తాజాగా స్పందించింది. ఈ మేరకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు నోటీసులు జారీ చేసింది. గతేడాది ప్రకటనలకు వెచ్చించిన సొమ్ముతో పాటు పెనాల్టీ మొత్తంతో కలిపి రూ.163.62 కోట్లు చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని పది రోజుల్లోగా ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని నోటీసుల్లో పేర్కొంది. గడువులోగా చెల్లించకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, మార్చి 31, 2017 వరకు ప్రకటనల కోసం ఆప్‌ రూ. 99,31,10,053 ఖర్చు చేసినట్లు తెలిపింది. ప్రజాధనాన్ని పార్టీ అవసరాలకు వినియోగించుకున్నందుకుగాను జరిమానా, వడ్డీగా మరో రూ. 64,30,78,212 చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీంతో మొత్తం రూ.163.62 కోట్లు ప్రభుత్వ ఖజానాకు జమచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ ప్రకటనల ముసుగులో దిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా ఆరోపించారు. ప్రభుత్వ ప్రకటనలను ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రచారానికి ఉపయోగించుకుంటోందని, ఇందుకోసం గతేడాది రూ.97 కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు. ఈ

మొత్తాన్ని పార్టీ అధినేత కేజ్రీవాల్‌ నుంచి వసూలు చేయాలని సంబంధిత అధికారులను ఎల్జీ సక్సేనా ఆదేశించారు. ఎల్జీ ఆదేశాల మేరకు తాజాగా ఆప్‌కు డీఐపీ నోటీసులు జారీ చేసింది.
బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక చర్యలు: సిసోడియా
ఆప్‌కు జరిమానా విధించడంపై దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా తీవ్రంగా స్పందించారు. దిల్లీ ప్రభుత్వం, మంత్రులు లక్ష్యంగా బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా అధికారులను తమ నియంత్రణలో ఉంచుకుంటుందని తీవ్రంగా విమర్శించారు. అదేసమయంలో రూ.163.62 కోట్ల జరిమానా చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసిన డీఐపీకి ఆప్‌ జాతీయ కార్యదర్శి పంకజ్‌ కుమార్‌ గుప్తా లేఖ రాశారు. డీఐపీ చర్యను నియంతృత్వమైనదిగా, మూర్ఖత్వంతో కూడినదిగా గుప్తా అభివర్ణించారు. ఆ ప్రకటనల కాపీలు అందజేయాలని గుప్తా కోరారు. సిసోడియా గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దిల్లీ వార్తాపత్రికల్లో బీజేపీ ముఖ్యమంత్రులు ఇచ్చిన ప్రకటనలను కూడా ప్రచురించాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ ముఖ్యమంత్రులు ఇచ్చిన ప్రకటన ఖర్చులను కూడా రికవరీ చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, మంత్రులు లక్ష్యంగా అధికారులను దుర్వినియోగం చేయడాన్ని బీజేపీ ఆపాలని డిమాండ్‌ చేశారు. తాము ఇచ్చిన ప్రకటనలు చట్టవిరుద్ధమైనవి ఏమిటో చెప్పాలని, ఆ ప్రకటనలు తమకు ఇవ్వాలని డీఐపీ కార్యదర్శిని కోరారు. దిల్లీ అధికారులను బీజేపీ చట్టవ్యతిరేకంగా ఉపయోగించుకుంటుందని విమర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ప్రకటనలను పార్టీ ప్రకటనలుగా చూపుతారా అని నిలదీశారు. మరోవైపు, ఆప్‌ బ్యాంకు ఖాతాలు స్వాధీనం చేసుకోవాలని, నాయకుల ఆస్తులు అటాచ్‌ చేయాలని బీజేపీ డిమాండ్‌ చేసింది. ఆప్‌ రాజకీయ ప్రచారం కోసం ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. రూ.163 కోట్లు చెల్లించాలని డీఐపీ నోటీసు జారీ చేసిన తర్వాత ఆప్‌పై బీజేపీ విరుచుకుపడిరది. ప్రభుత్వ నిధులతో ఆప్‌, దాని నాయకులు రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారని చెప్పింది. ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని కోరింది. పన్ను చెల్లింపుదారుల డబ్బును ఆప్‌ వృథా చేస్తోందని పేర్కొంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img