Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఆమోదమా? తిరస్కరణా?

అందరి చూపు గవర్నర్‌ వైపు
. హెల్త్‌వర్సిటీ పేరు మార్పు బిల్లు వివాదం
. గవర్నరుతో భేటీకి అఖిలపక్షం సిద్ధం
. వైఎస్‌ఆర్‌, జగనన్న పథకాలపై విపక్షాల ధ్వజం

విశాలాంధ్రబ్యూరో`అమరావతి: హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్పు బిల్లు గవర్నరు కార్యాలయానికి చేరినట్లు తెలిసింది. దీంతో అందరి చూపు గవర్నరు కార్యాలయం వైపే ఉంది. విశ్వవిద్యాలయాల కులపతి అయిన గవర్నరు ఈ బిల్లును ఆమోదిస్తారా? తిరస్కరిస్తారా? అనేది ఉత్కంఠగా మారింది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల చివరి రోజున జగన్‌ ప్రభుత్వం హడావుడిగా ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీగా పేరు మార్పు బిల్లును ప్రవేశపెట్టింది. అంతకుముందు ఆన్‌లైన్లో కేబినెట్‌లో ఆమోదం పొంది, ఆ తర్వాత సభా ముందుకు తీసుకొచ్చింది. దీనిపై అసెంబ్లీలోను, శాసన మండలిలోను టీడీపీ సభ్యులు పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆ రెండు చట్టసభల్లోనూ పెద్దఎత్తున రాద్ధాంతం నెలకొంది. ఎన్టీఆర్‌ పేరు మార్చొద్దంటూ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియం వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా బిల్లు ప్రతుల పేపర్లు చించి ఆయన ముందే గాల్లోకి ఎగుర వేశారు. ఇదే సంఘటన యథాతథంగా శాసన మండలిలోనూ కొనసాగింది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య పరస్పర దూషణలు, వాగ్వివాదాలు నెలకొన్నప్పటికీ, మెజార్టీ సభ్యులు ఉన్నందున బిల్లు ఆమోదమైంది. ఈ నిరసనలు చట్టసభలకే పరిమితం కాకుండా బయట కూడా కొనసాగాయి. దీంతో అధికార పార్టీకి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధ్వర్యంలో ఆ పార్టీ ముఖ్యనేతలు గవర్నరును కలిసి, ఎన్టీఆర్‌ పేరుతోనే ఆరోగ్య విశ్వవిద్యాలయం కొనసాగించాలంటూ కోరారు. ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్టీఆర్‌ పేరు కొనసాగిస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీనిపై ఎన్టీఆర్‌ కుటుంబం సైతం ఘాటుగా స్పందించింది. నందమూరి బాలకృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌, దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులు ట్వీట్‌ చేశారు. అటు వైసీపీ ప్రభుత్వ హయాంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా నియమితులైన యార్లగడ్డ ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు. పేరు మార్పును ప్రతిపక్షాలు సైతం ఘాటుగా విమర్శిస్తున్నాయి. విజయవాడ బాలోత్సవంలో గురువారం ఏఐఎస్‌ఎఫ్‌, ఐఎంఏ రౌండుటేబుల్‌ సమావేశం నిర్వహించి, ఎన్టీఆర్‌ హెల్త్‌వర్సిటీగానే కొనసాగించాలని, లేకుంటే ఐక్యంగా ఉద్యమిస్తామని వెల్లడిరచింది. అఖిలపక్షం అధ్వర్యంలో గవర్నరు కలిసి ఆ బిల్లును తిరస్కరించాలని కోరనున్నాయి. గవర్నరు కార్యాలయం నుంచి సానుకూల స్పందన రాకుంటే, అఖిలపక్షం అధ్వర్యంలో రాష్ట్రపతికి నివేదించాలని సమావేశం తీర్మానించాయి. సీఎం జగన్‌ ప్రభుత్వం హడావుడిగా ఎన్టీఆర్‌ పేరు మార్పు చేస్తూ తీసుకున్న నిర్ణయంపైన అటు అధికార పక్ష సభ్యులు, వైసీపీ నేతల్లోనూ కొంత అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం. దీంతో ఉభయ చట్టసభల నుంచి ఆమోదించి, గవర్నరు కార్యాలయానికి వచ్చిన పేరు మార్పు బిల్లుపై ఉత్కంఠ నెలకొంది. గవర్నరు నిర్ణయం ఆధారంగానే హెల్త్‌వర్సిటీకి పేరుకు తెరపడ నుంది.
జగనన్న పథకాల మాయాజాలం
సీఎం జగన్‌ ప్రభుత్వ హయాంలో అన్నింటా వ్యక్తిగత పథకాల పేర్లతో ప్రజలను మభ్యపెడుతున్నారు. సీఎం జగన్‌ పేరుతో దాదాపు 20 పథకాల వరకూ కొనసాగుతునున్నాయి. అందులో జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యాదీవెన, విద్యాకానుక, వసతి దీవెన ఇలా చాలా ఉన్నాయి. ఇక వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరుతో దాదాపు 54 పథకాలు కొనసాగుతున్నాయి.
అందులో వైఎస్‌ఆర్‌, జగనన్న భూ హక్కు`భూ రక్ష పథకం, వైఎస్‌ఆర్‌ బీమా, వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం ఇలా అన్నింటా పెట్టేశారు. ఇప్పుడు తెలుగుజాతి కీర్తి ప్రతిష్టలు ఇనుమడిరపజేసిన ఎన్టీఆర్‌ పేరు కాస్తా మార్చి…ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీకి డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ మార్చేశారు. గత ప్రభుత్వాల ముఖ్యమంత్రుల హయాంలో ఇంత రీతిలో ఎక్కడా వ్యక్తిగతంగా పథకాలు పెట్టలేదని విపక్షాలు నొక్కిచెబుతున్నాయి. స్వాతంత్రోద్యమంలో భాగస్వాములైన మహనీయులు, శాస్త్రవేత్తలు, భూపోరాట యోధులు, విప్లవ వీరులు తదితరుల పేర్లను పథకాలకు పెట్టడంలో జగన్‌ ప్రభుత్వం మరచిందనీ, అన్నింటా వైఎస్‌ఆర్‌, జగనన్న పేర్లతో పథకాలు నిండిపోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img