Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఆయిల్‌ పరిశ్రమలో విషాదం

ఏడుగురు కార్మికుల దుర్మరణం


. శుభ్రం చేసేందుకు ట్యాంకులోకి దిగారు
. ఊపిరాడక విగత జీవులయ్యారు
. కాకినాడ జిల్లాలో ఘటన

విశాలాంధ్ర-సామర్లకోట : కాకినాడ జిల్లాలోని.. అంబటి సుబ్బన్న ఆయిల్‌ పరిశ్రమలో అత్యంత విషాద ఘటన చోటుచేసుకుంది. శుభ్రం చేసేందుకు ఎడిబుల్‌ ఆయిల్‌ ట్యాంకులోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరి ఆడక మృత్యువాత పడ్డారు. మృతుల్లో.. ఐదుగురిని పాడేరు వాసులుగా, ఇద్దరిని పెద్దాపురం మండలం పులిమేరు వాసులుగా గుర్తించారు. సేకరించిన వివరాల ప్రకారం… కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జి రాగంపేటలో ఉన్న అంబటి ఆయిల్‌ పరిశ్రమలో గురువారం ఉదయం 24 అడుగుల పొడవు , 6 అడుగుల వెడల్పు కలిగిన భారీ ఆయిల్‌ ట్యాంకును శుభ్రపరిచేందుకు కార్మికులు ఒక్కొరొక్కరుగా దిగి ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు తెలిసింది. పరిశ్రమలోని ఆయిల్‌ ట్యాంకర్‌ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ట్యాంకర్‌లో ఆయిల్‌ మొత్తం తీసివేశారు. దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో వారికి ఊపిరి అందలేదు. వెంటనే బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. అయితే సమయం గడుస్తున్నప్పటికీ శుభ్రం చేసేందుకు వెళ్లిన కార్మికులు బయటకు రాకపోవడంతో మిగిలిన కార్మికులు వెళ్లి చూడగా అందరూ విగతజీవులుగా కనిపించారు. వెంటనే ట్యాంకర్‌ను అప్పటికప్పుడు యంత్రాలతో కూల్చి అందరినీ బయటకు తీసుకువచ్చారు. వారంతా ఊపిరాడక చనిపోయినట్లు తోటి కార్మికులు గుర్తించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల్లో పాడేరుకు చెందిన గిరిజన కార్మికులు మొచ్చంగి కృష్ణా, మొచ్చంగి నర్సింగ, మొచ్చంగి సాగర్‌, కురతాడు బంజు బాబు, కుర్ర రామారావు. పులిమేరు గ్రామానికి చెందిన కట్టమురి జగదీష్‌, ఎల్లమిల్లి ప్రసాద్‌ ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన జరిగిన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రూ.25 లక్షల పరిహారం
కార్మికుల మృతి వార్త తెలిసిన వెంటనే కాకినాడ జిల్లా కలెక్టర్‌ కృత్తికా శుక్లా ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. ఫ్యాక్టరీకి సీలు వేసి, ఐపీసీ సెక్షన్‌ 304ఎ (నిర్లక్ష్యం కారణంగా మరణం) కింద కేసు నమోదు చేసినట్లు విలేకరులకు చెప్పారు. ఫ్యాక్టరీ అధికారులు నిర్లక్ష్యానికి పాల్పడ్డారా అనే అంశంపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించేందుకు జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు శుక్లా తెలిపారు. ఫ్యాక్టరీని నడపడానికి పొందిన ఆమోద పత్రాలను కమిటీ సభ్యులు పరిశీలిస్తున్నారు. కాగా మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం ప్రకటించింది. అయితే ఫ్యాక్టరీ యాజమాన్యం తగిన భద్రతా చర్యలు తీసుకోలేదని మృతుల కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌ బాబు మాట్లాడుతూ… పోస్టుమార్టం రిపోర్ట్లు, విచారణ ఆధారంగా యాజమాన్యంపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామన్నారు. కార్మికుల మృతిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తామని తెలిపారు.
యాజమాన్యం నిర్లక్ష్యం
కాకినాడ జిల్లాలోని పెద్దాపురం ప్రాంతం అనేక పరిశ్రమలకు పెట్టింది పేరు. ఈ ప్రాంతంలో అనేక రకాల ఆయిల్‌ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అందులో అంబటి సుబ్బన్న ఆయిల్‌ ఫ్యాక్టరీ ఒకటి. గత కొన్నేళ్లుగా అంబటి ఆయిల్‌ ఫ్యాక్టరీ నడుస్తోంది. ఈ పరిశ్రమలో ఇది రెండో ప్రమాదం. మరోవైపు ఏడుగురు కార్మికుల మృతికి యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆయిల్‌ ట్యాంకర్‌లో కార్మికులు దించే క్రమంలో వారికి అవసరమైన ఆక్సిజన్‌ను అందించాల్సి ఉంటుంది. ట్యాంకర్‌లో వచ్చే ఘాటైన వాయువులను తట్టుకునేందుకు మాస్క్‌లతో పాటు రక్షణ కవచాలు అందించాల్సి ఉంటుంది. అయితే రక్షణ కవచాలు అందించడంతో యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఏడుగురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని స్థానికులు చెబుతున్నారు. ఆయిల్‌ ట్యాంకర్‌లోకి వెళ్లిన కార్మికులు సమయం గడుస్తున్నప్పటీ ఎందుకు బయటకు రాలేదో అనే విషయాన్ని కూడా యాజమాన్యం పట్టించుకోలేదని, యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఏడుగురు కార్మికులు చనిపోయారని తోటి కార్మికులు, మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
రూ.కోటి నష్ట పరిహారం ఇవ్వాలి: సీపీఐ
సంఘటన జరిగిన స్థలాన్ని కాకినాడ జిల్లా సీపీఐ కార్యదర్శి కామిరెడ్డి బోడకొండ, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు తోకల ప్రసాద్‌, పెద్దాపురం నియోజకవర్గ సీపీఐ నాయకుడు పెద్దిరెడ్డి సత్యనారాయణ, జనసేన పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి తుమ్మల బాబు, పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పరిశీలించారు. ట్యాంకును శుభ్రం చేయడానికి అనుభవంలేని కార్మికులను నియమించారన్నారు. మృతిచెందిన కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. కాగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పెద్దాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
ఈ సమయంలో పులిమెరు గ్రామవాసులు, మృతుల బంధువులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ి మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకూ ఇక్కడ నుంచి కదిలేది లేదని భీష్మించారు. యాజమాన్యంతో చర్చలు జరపగా మరో రూ.25 లక్షలు పరిహారం ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలియజేశారు. ముందుగా దహన సంస్కారాల నిమిత్తం రూ.50,000 యాజమాన్యం కార్మికుల కుటుంబాలకు అందజేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img