Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో మోదీపాలన

. ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్‌’
. రాష్ట్రంలో హిట్లర్‌ రాజ్యం
. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

ఎన్నికల హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలం. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. అసలు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందని చెప్పడం ప్రజలను మోసగించడమేనని, ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్‌’ అని రామకృష్ణ ఎద్దేవా చేశారు.

విశాలాంధ్ర-విశాఖ : ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో మోదీ సర్కారు పాలన కొనసాగిస్తోందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, మేనిఫెస్టోను అమలు చేయడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. సీపీఐ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ సీపీఐ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర 27వ మహాసభల తీర్మానాలను, పార్టీ భవిష్యత్‌ ప్రణాళికను వివరించారు. విశాఖలో నిర్వహించిన రాష్ట్ర మహాసభలు దిగ్విజయంగా ముగిశాయని పేర్కొంటూ మహాసభల నిర్వహణకు కృషి చేసిన ఆహ్వానసంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మానం ఆంజనేయులు, జేవీ సత్యనారాయణమూర్తి బృందానికి, మీడియాకు, విశాఖ ప్రజానీకానికి సీపీఐ రాష్ట్ర సమితి తరపున కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నికల హామీలు అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రామకృష్ణ విమర్శించారు. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తీసుకురాలేదని, ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీని గాలికి వదిలేసిందని మండిపడ్డారు. అసలు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఉందని చెప్పడం ప్రజలను మోసగించడమేనని, ఎన్డీయే అంటే ‘నో డేటా అవైలబుల్‌’ అని ఎద్దేవా చేశారు. దేశంలో కరోనా మరణాలకు లెక్కలు లేవన్నారు. గంగానదిలో వేలాది శవాలు కొట్టుకురావటం అత్యంత విచారకరమన్నారు. ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ కరోనా రోగుల మృతుల డేటా ఉండగా భారత్‌లోనే ఆ డేటా ఎందుకు లేదని రామకృష్ణ ప్రశ్నించారు. బీజేపీ పాలనలో పేదరికం పెరిగిందని, ఎనిమిది కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువున ఉన్నారని, అన్ని రంగాల్లోనూ విఫలమైన బీజేపీ ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో గద్దె దింపేందుకు ప్రజాతంత్ర శక్తులన్నీ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా అన్యాయం చేసిందని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ, రైల్వే జోన్‌ తదితర అంశాలపై అన్ని రాజకీయ పార్టీలు కేంద్రాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్రం మెడలు వంచుతానని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్‌…ఇప్పుడు మోదీ, అమిత్‌షా ముందు మోకరిల్లారని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉద్యమశక్తులను కూడగట్టి పోరాడతామని స్పష్టంచేశారు.
రాష్ట్రంలో హిట్లర్‌ రాజ్యం
రాష్ట్రంలో హిట్లర్‌ రాజ్యం నడుస్తోందని రామకృష్ణ విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చిన జగన్‌…ఇప్పటివరకు ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. హామీని అమలు చేయలేకపోతే రాష్ట్ర ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. జీపీఎస్‌ అంటూ సీఎం జగన్‌ కొత్త నాటకానికి తెర తీశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే హక్కు అందరికీ ఉందని, దీనిని కాలరాచి..విజయవాడలో నిరసనలకు తావు లేదని బెదిరింపులకు దిగడం ఏమిటని ప్రశ్నించారు. ఉపాధ్యాయులను, ఇళ్లలోని మహిళలను బెదిరిస్తున్నారని, వాహనాల యజమానుల నుంచి ఆర్సీలు లాక్కుంటున్నారని విమర్శించారు. కానిస్టేబుల్‌ నుంచి ఎస్పీ వరకు వారం రోజులుగా ఇదే పనిపై ఉన్నారని చెప్పారు. జగన్‌ శాశ్వత ముఖ్యమంత్రి కాదని, విజయవాడ ఆయన జాగీరు కాదని అన్నారు. ఎన్నో ఉద్యమాలకు విజయవాడ కేంద్రమని చెప్పారు. ఉపాధ్యాయుల ఉద్యమానికి సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు ఏం జరిగినా తోలు తీస్తామని, ప్రత్యక్ష ఆందోళన చేపడతామని, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పోలవరం నిర్వాసితుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అవసరాలను పోలవరం ప్రాజెక్టు తీరుస్తుందని అన్నారు.
అమరావతి అభివృద్ధికి సైంధవుడిలా…
అమరావతి అభివృద్ధికి సీఎం జగన్‌ సైంధవుడిలా అడ్డుపడ్డారని ఆరోపించారు. ‘అమరావతిని అభివృద్ధి చేయలేదు. పోలవరం పూర్తి కాలేదు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో వైఫల్యం చెందావు’ అని జగన్‌పై రామకృష్ణ నిప్పులు చెరిగారు. పోలవరానికి నిధుల కోసం పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, అఖిలపక్ష నేతలను దిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు. పోలవరం నిర్వాసితులకు అండగా ఉంటామని, త్వరలో భద్రాచలంలో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం ఉందని, ప్రజాగ్రహాన్ని ప్రభుత్వం తొక్కి పెడుతోందని, దీనిని ఎంతోకాలం ఆపలేదని చెప్పారు. దళిత, మైనారిటీ, బీసీలకు సంబంధించిన 29 పథకాలను పక్కనపెట్టారని విమర్శించారు. ప్రజల సమస్యలపై కార్యాచరణ రూపొందించి ఉద్యమాలు చేస్తామని తెలిపారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కాలరాస్తున్నాయని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్న మీడియా హక్కులను హరిస్తున్నాయన్నారు. మీడియా స్వేచ్ఛను హరించడంపై మహాసభలో తీర్మానం చేశామని, సోషల్‌ మీడియా వ్యక్తులపై నిర్బంధం ప్రయోగిస్తున్నారని చెప్పారు. యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్న భార్యాభర్తల్ని హత్య చేసిన ఉదంతాన్ని గుర్తు చేశారు. సమావేశంలో సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, మహిళా సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు ఎ.విమల, జీవీఎంసీ సీపీఐ ఫ్లోర్‌ లీడర్‌ ఏజే స్టాలిన్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img