Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

ఆర్టీసీ బాదుడు

డీజిల్‌ సెస్‌ పేరుతో బస్సు చార్జీల పెంపు

ప్రయాణికులపై భారం
నేటి నుంచే అమలు
పెరగనున్న పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, లగ్జరీ టికెట్లు
సిటీ బస్సులకు మినహాయింపు
కిలోమీటర్‌, స్లాబ్‌ల ఆధారంగా ధరలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి:
ఆర్టీసీ ప్రయాణికులపై ప్రభుత్వం మరోమారు భారం మోపింది. డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీల మోతకు రంగం సిద్ధం చేసింది. శుక్రవారం నుంచి పెరిగిన ధరలు అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీచేసింది.ప్రయాణికులు వెళ్లే కిలో మీటర్ల ఆధారంగా స్లాబ్‌ పద్ధతిలో డీజిల్‌ సెస్‌ పెంపునకు ప్రభుత్వం నిర్ణయించింది. సిటీ సర్వీసులకు సెస్సు పెంపునుంచి మినహాయింపునిచ్చింది. దీని ప్రభావంతో విద్యార్థుల బస్‌ పాస్‌ల ధరలు దాదాపు 20శాతం పెరిగే అవకాశముంది. పల్లెవెలుగు బస్సు ప్రస్తుత టికెట్‌ ధర రూ.10గా ఉంది. మొదటి 30 కిలోమీటర్ల వరకు సెస్‌ పెంచింది. ఈ బస్సుల్లో 35 నుంచి 60 కిలోమీటర్ల దూరానికి రూ.5 పెంచింది. 60 నుంచి 70 కిలోమీటర్ల వరకు అదనంగా రూ.10 పెరగనుంది. 100 కిలో మీటర్లు, ఆపైన రూ.120 సెస్‌ విధించారు. ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌ బస్సుల్లో ప్రస్తుతం టికెట్‌పై రూ.5 సెస్‌ వసూలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో 30 కిలోమీటర్ల వరకు సెస్‌ పెంపు లేదు. 31 నుంచి 65 కిలోమీటర్ల వరకు మరో రూ.5 సెస్‌, 66 నుంచి 80 కిలోమీటర్ల వరకు రూ.10 సెస్‌ పెంచారు. సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సుల్లో టికెట్‌పై రూ.10 డీజిల్‌ సెస్‌ వసూలు చేస్తున్నారు. ఈ బస్సుల్లో 55 కిలోమీటర్ల వరకు సెస్‌ పెంపు లేదు. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే సూపర్‌ లగ్జరీ బస్సుల్లో రూ.70 సెస్‌, హైదరాబాద్‌ వెళ్లే అమరావతి బస్సుల్లో రూ.80 చొప్పున డీజిల్‌ సెస్‌ విధించారు. ఏపీఎస్‌ఆర్టీసీ ఏపీతోపాటు వివిధ రాష్ట్రాలకు నిత్యం 11,271 బస్సులను 41 లక్షల కిలోమీటర్లు నడుపుతోంది. 45 లక్షల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతోంది. డీజిల్‌ సెస్‌ పేరుతో పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌, అల్రాడీలక్స్‌, సూపర్‌ డీలక్స్‌, ఇంద్ర, గరుడ, మెట్రో లగ్జరీఏసీ, అమరావతి, డాల్ఫిన్‌, నైట్‌ రైడర్‌ సీట్‌, నైట్‌ రైడర్‌ బెర్త్‌, వెన్నెల30, వెన్నెల`24 విభాగాల బస్సు టికెట్లను కిలోమీటర్లు, స్లాబ్‌ల పద్ధతిలో పెంచడంపై విపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పెంచిన చార్జీలను విరమించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.
రెండు విడతలుగా టికెట్ల ధరల పెంపు: ఆర్టీసీ టిక్కెట్లు ధరలు11 డిసెంబరు 2019న పెంచారు. అప్పుడు లీటరు డీజిల్‌ ధర రూ.67 మాత్రమే ఉంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 13వ తేదీన మార్కెట్‌లో డీజిల్‌ ధర రూ.107కు పెరిగింది. డిసెంబరు 2019 నుంచి ఏప్రిల్‌ 13 వరకు డీజిల్‌ ధర రూ.40కు చేరింది. ఈ కారణంగా ఏప్రిల్‌ 13న డీజిల్‌ సెస్‌ను ఆర్టీసీ విధించడంతో టికెట్ల ధరలు పెరిగాయి. మళ్లీ ఈనెల 29వ తేదీన మార్కెట్‌లో డీజిల్‌(బల్కు) ధర రూ.131కు పెరిగింది.
విధిలేని పరిస్థితుల్లోనే డీజిల్‌ సెస్‌ పెంపు: విధిలేని పరిస్థితుల్లో డీజిల్‌ సెస్‌ పెంచక తప్పడం లేదని, ప్రయాణికులు సహకరించి ఆర్టీసీని ఆదరించాలని ఆర్టీసీ చైర్మన్‌ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ ద్వారకా తిరుమలరావు విజ్ఞప్తి చేశారు.
చార్జీల పెంపును విరమించుకోవాలి: రామకృష్ణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై పదేపదే పన్నుల భారాలను వేస్తోందని, డీజిల్‌ సెస్‌ పేరుతో ఆర్టీసీ బస్‌ చార్జీల పెంపుదలను విరమించుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. ఇటీవలే డీజిల్‌ ధర పెరుగుదలను సాకుగా చూపి దాదాపు రూ.720 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రజలపై జగన్‌ సర్కారు మోపిందనీ, మరోసారి డీజిల్‌ సెస్‌ పేరుతో మళ్లీ చార్జీలు పెంచడం దారుణమన్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ ప్రెస్‌, మెట్రో, లగ్జరీ బస్సుల్లో కిలో మీటర్ల చొప్పున టిక్కెట్లు ధరలు పెరిగాయన్నారు. బస్సు పాస్‌ ధరలను కూడా పెంచిందని పేర్కొన్నారు. విద్యుత్‌ చార్జీలను ఇప్పటికే ఏడు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిందన్నారు. రెండు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై పెనుభారం మోపటం దుర్మార్గమని, ఆస్తి, నీటి, చెత్త పన్నులను విపరీతంగా పెంచి, బలవంతపు వసూళ్లకు పాల్పడుతోందన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి కేవలం జనం జేబులకు చిల్లులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిరచారు. తక్షణమే పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img