Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఆర్‌`5 జోన్‌లో 47,017 ఇళ్లు

కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన రాష్ట్ర ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఆర్‌5 జోన్‌పై రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ముందుకు కదులుతోంది. ఆ జోన్‌లో ఇతర ప్రాంతాల్లోని పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వొచ్చని, అయితే కోర్టు తుది తీర్పుకు లోబడే అవి చెల్లుబాటు అవుతాయని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ ప్రభుత్వం మాత్రం ముందుకే వెళుతోంది. ఇళ్ల స్థలాలతో పాటు ఇంటి నిర్మాణాలు కూడా చేపడితే తర్వాత తీర్పు ఎలా ఉన్నా వైసీపీ ప్రభుత్వానికే ఆ ఘనత మిగిలిపోతుందని పాలకులు భావిస్తున్నారు. ఈ నెలాఖరులో సీఎం చేతుల మీదుగా పట్టాల పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం ఇక్కడి స్థలాల్ని దాదాపు రూ.20 కోట్లు పెట్టి చదును చేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. పట్టాల పంపీణీ రోజే గృహ నిర్మాణ శంకుస్థాపన వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తాజాగా ప్రతిపాదనలు పంపింది. ఆర్‌-5 జోన్‌ పరిధిలో మొత్తం 47,017 ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రతిపాదనల్లో పేర్కొంది. వాస్తవానికి గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లాలకు చెందిన మొత్తం 51,392 మందికి ఆర్‌`5 జోన్‌లో ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. అయితే వీటిలో ఇళ్లు కట్టుకోగలిగే వారి కోసం స్థలాలు కేటాయించి, మిగతా వాటిలో తామే ఇళ్లు నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం సహకరించాలని కేంద్రాన్ని కోరింది. షీర్‌వాల్‌ టెక్నాలజీతో ఇళ్లు కట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇళ్ల స్థలాల లేఅవుట్ల అభివృద్ధికి సీఆర్‌డీఏ రూ.50 కోట్లు కేటాయించింది. పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయడంలో భాగంగా మంత్రులు, ప్రభుత్వంలో కీలకనేతలు, అధికారులు ప్రతిరోజు పనులు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img