విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన సంఘటనలో కుట్ర కోణం దాగి ఉందని సీఎం చంద్రబాబుకు అధికారికంగా నివేదిక అందజేయడం చర్చనీయాంశంగా మారింది. బోట్లు గేట్లకు ఉండే కౌంటర్ వెయిట్‌లకు కాకుండా… బ్యారేజీ ఫిల్లర్లను బలంగా ఢీకొడితే ప్రమాద తీవ్రత మరింత పెరిగేదని నివేదికలో వెల్లడిరచారు. ఈ సంఘటనలో ఉషాద్రితోపాటు సూరాయిపాలేనికి చెందిన కోమటిరెడ్డి రామ్మోహన్‌ను పోలీసులు అరెస్టు చేసి… విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. వారిద్దరూ వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేశ్ గుర్తించారు. ఈనెల 1వ తేదీన వరదలకు ప్రకాశం బ్యారేజీకి రికార్డుస్థాయిలో 11.47 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ సమయంలో బ్యారేజీకి ఎగువున గొల్లపూడి నుంచి ఐదు ఇనుప బోట్లు కొట్టుకొచ్చాయి. అందులో మూడు బోట్లు బ్యారేజీ గేట్ల వెనుక ఉండే కౌంటర్ వెయిట్లను బలంగా ఢీ కొట్టాయి. అవి ప్రస్తుతం బ్యారేజీ 67, 69వ ఖానాల వద్ద చిక్కుకున్నాయి. కౌంటర్ వెయిట్లకు జరిగిన నష్టంపై కృష్ణారివర్ కన్జర్వేషన్ ఈఈ పీవీఆర్ కృష్ణారావు విజయవాడ వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ఈ ఘటనపై ఐదు కేసులు నమోదు చేశారు. బ్యారేజీకి దూసుకొచ్చిన బోట్లలో… మూడు బోట్లు ఉషాద్రి అనే వ్యక్తికి చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఉషాద్రికి వైసీపీ నేత కోమటిరెడ్డి రామ్మోహన్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమాని స్తున్నారు. దీంతో ఉషాద్రిని, వైసీపీ నేత రామ్మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐదు బోట్లలో మూడిరటిపై వైసీపీ రంగులేసి… ఒకదానికొకటి ఇనుప గొలుసులతో అనుసంధానించారు. సాధారణంగా బోట్లను ఇలా ఒకదానికొకటి కట్టడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా ఒకదానికొకటి కట్టేసిన మూడు బోట్లను ఒక ప్లాస్టిక్ తాడుతో గొల్లపూడి స్మశానం వద్ద ఉన్న ఒక చెట్టుకు కట్టారు. ఒక్కో బోటు బరువు 40-50 టన్నులు ఉంటుంది. ఆ బోట్లలో మూడిరటిని ఇనుప గొలుసులతో కట్టి అసలైన లంగరు మాత్రం ప్లాస్టిక్ తాడుతో వేయడం అనుమానాలకు తావిస్తోంది. ఈ కుట్రలో ఎంతమంది ఉన్నా శిక్షించి తీరతామని మంత్రులు నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, తానేటి వనిత వ్యాఖ్యానించారు. పోలీసులు విచారణను వేగవంతం చేశారని, దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూస్తాయని స్పష్టంచేశారు. కాగా, ఈ బోట్లు కొట్టుకొచ్చిన సంఘటనలో అరెస్టులను వైసీపీ ఖండిరచింది. బోట్ల కేసు నిందితుడు నారా లోకేశ్‌కు సన్నిహితుడని తెలిపింది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న రామ్మోహన్ స్వయానా టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం అధ్యక్షుడు కోమటి జయరామ్‌కు బంధువు అని పేర్కొంది.