Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇదేం ఎంపిక?

ట్రిబ్యునళ్ల ఖాళీల భర్తీలో కేంద్రం తీరుపై సుప్రీం అసహనం

రెండు వారాల్లో భర్తీ చేయాలని ఆదేశం

న్యూదిల్లీ :
దేశ వ్యాప్తంగా వివిధ ట్రిబ్యునళ్లలోని ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి, అసహనం వ్యక్తం చేసింది. విచారణ సమయంలో ఏదో ఒక సాకు చెప్పడం అలవాటైందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఖాళీలను రెండు వారాల్లోగా భర్తీ చేయాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో కేంద్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియను ప్రారంభించినా.. సర్కారు తీరులో ఏ మాత్రం మార్పు లేదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడిరది. ఖాళీలను భర్తీ చేయాలంటూ దాఖలైన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ డీవై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఖాళీల భర్తీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు సంతృప్తికరంగా లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. ఆలస్యానికి కరోనా సహా అనేక కారణాలు చెబుతున్నారని, ఖాళీల భర్తీ, సభ్యుల ఎంపిక విధానం కూడా అర్థం కావడం లేదని అన్నారు. మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామని ఆయన గుర్తు చేశారు.
న్యాయపాలన రాజ్యాంగ బద్ధంగా ఉండాలి
విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయపాలన అనేది రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉండాలని, ఒక ఏడాది పని చేయడానికి జ్యుడీషియరీ నుంచి ఎవరైనా

వస్తారా అని జస్టిస్‌ రమణ ప్రశ్నించారు. భర్తీ ఆలస్యంతో ఖాళీల సంఖ్య మరింత పెరుగుతుందని గుర్తు చేశారు. ట్రిబ్యునళ్ల ఖాళీల భర్తీలో ప్రతిసారీ ఇలాగే ప్రవర్తిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. విచారణ సమయంలో కేంద్రానికి ఏదో ఒకటి చెప్పడం అలవాటైందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సమస్యలు అందరికీ తెలుసునని, కావలసింది పరిష్కారమే అని రమణ స్పష్టం చేశారు. ప్రభుత్వం నియామకాలు చేపట్టడం ఒక్కటే సమస్యకు పరిష్కారం అని స్పష్టం చేశారు.
సమయం ఇవ్వండి : కేంద్రం
కేంద్రప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ వాదనలు వినిపించారు. ఖాళీల భర్తీకి రెండు వారాలు సమయం ఇవ్వాలని, అప్పటివరకు విచారణను వాయిదా వేయాలని కోరారు. దీనికి సుప్రీం ధర్మాసనం సమ్మతించింది. ఇప్పటికే చాలా ఓపికతో ఉన్నామని, మరికొంత సమయం కూడా ఎదురు చూడగలమని జస్టిస్‌ ఎన్‌వీ రమణ అన్నారు. అటార్నీ జనరల్‌ కోరినట్లుగా విచారణను రెండు వారాలు వాయిదా వేస్తామని, ఆ లోపు నియామకాలు చేపట్టాలని ఆదేశించారు. కోర్టు ఉత్తర్వులు రాకముందే నియామకాలు చేపడితే అందరికీ మంచిదని అన్నారు. ట్రిబ్యునళ్లలో నియామకాలు, ఖాళీలపై స్పష్టమైన విధానంతో కోర్టుకు రావాలని అటార్నీ జనరల్‌ను ధర్మాసనం ఆదేశించింది. రెండు వారాల్లో స్పష్టత ఇవ్వకపోతే తగిన ఆదేశాల జారీకి సిద్ధమని తేల్చి చెప్పింది.
ఎన్‌సీఎల్‌ఏటీ చైర్‌పర్సన్‌ నియామకంపై తొందరెందుకు?
నేషనల్‌ కంపెనీ లా అప్పిల్లేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఎన్‌సీఎల్‌ఏటీ తాత్కాలిక చైర్మన్‌గా జస్టిస్‌ ఎం.వేణుగోపాల్‌ను నియమించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వెలిబుచ్చింది. ఈ విషయంలో అంత తొందరపాటెందుకని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ప్రస్తుత చైర్మన్‌ జస్టిస్‌ చీమా రిటైర్మెంట్‌కు పదిరోజుల ముందుగానే వేరొకరిని నియమించడం ఎలా సాధ్యమని పేర్కొంది. ఈ విషయమై గురువారం విచారణ జరుపుతామని, కోర్టుకు హాజరు కావాలని అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ను ఆదేశించింది. ఎన్‌సీఎల్‌టీలో ఎనిమిదిమంది జ్యుడిషియల్‌ సభ్యులు, 10 మంది సాంకేతిక సభ్యుల నియామక ప్రతిపాదనను కేంద్రం శనివారం ఆమోదించింది. ఒకటిన్నరేళ్లకు పైగా ఎన్‌సీఎల్‌ఏటీ శాశ్వత చైర్మన్‌ లేకుండానే కొనసాగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img