Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఇదేం దోపిడీ?

. విమాన చార్జీలను తలపిస్తున్న ప్రైవేటు బస్సు ధరలు
. నిబంధనలు బేఖాతర్‌
. చోద్యంచూస్తున్న రవాణాశాఖాధికారులు
. ప్రయాణికుల బెంబేలు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : కడప నుంచి విజయవాడకు టికెట్‌ ధర రూ.1900… ఆశ్చర్యపోకండి…ఇది విమాన చార్జీ కాదు… బస్సు టికెట్‌ ధర… ఇదేదో సంక్రాంతి సందడి కాదు… అంతకన్నా రద్దీ కార్యక్రమమూ కాదు. అయినా ప్రైవేటు ట్రావెల్స్‌ సంస్థలు ప్రయాణికులను నిలువునా దోచేస్తున్నాయి. గతంలో సంక్రాంతి, దసరా వంటి సీజన్లలో టికెట్టు చార్జీలు అధికంగా వసూలు చేసేవారు. ఇప్పుడలా కాదు… పండగ పబ్బాలతో పనిలేకుండా ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ధర పెంచేసి దండుకుంటున్నారు. ఈ పరిస్థితి ఒక్క కడప-విజయవాడ బస్సులకే పరిమితం కాలేదు. వరుసగా రెండు మూడు రోజులు సెలవులొస్తే చాలు… ప్రైవేటు ట్రావెల్స్‌కు పండగే పండగ. సెలవులకు విజయవాడ, హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని ఈ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. రైళ్లలో ప్రయాణించాలంటే అప్పటికప్పుడు బెర్తులు దొరికే పరిస్థితి ఉండదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలన్నా అరకొర సర్వీసులే నడుస్తున్నాయి. దీంతో చాలామంది విధిలేక అందుబాటులో ఉన్న ప్రైవేటు ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. దీనిని అవకాశంగా తీసుకుని ఇష్టానుసారం టికెట్ల ధర పెంచుతూ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీపై నియంత్రణ లేకపోవడంతో ప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి.
డిమాండ్‌ను బట్టి దోపిడీ
ప్రైవేటు ట్రావెల్స్‌లో ఏ బస్సు ఎక్కినా వెయ్యి పైమాటే. ఇది సాధారణ రోజుల్లో. అదే వీకెండ్‌, పండుగుల సమయంలో అయితే రెండు వేల పైమాటే. గతంలో ఇలాంటి ధరలు సాధారణంగా పండుగలు, సెలవుల అనంతరం తిరుగు ప్రయాణాల్లోనే ఉండేవి. ప్రస్తుతం ఎప్పటికప్పుడు డిమాండ్‌ ఆధారంగా బాదుడు కొనసాగిస్తున్నారు. శనివారం, ఆదివారం సెలవులకు ముందు, తర్వాత ఉద్యోగుల రాకపోకల రద్దీని సద్వినియోగం చేసుకుంటూ అసలు చార్జీకి రెట్టింపు కంటే అదనంగా వసూలు చేస్తున్నారు. అంతేకాదు.. బస్సులు బయలుదేరే సమయానికి వీటి ధర అమాంతంగా పెంచేస్తున్నారు. ఒకవేళ ముగ్గురు ప్రయాణికులు ముందుగా టికెట్లు బుక్‌ చేసుకుని ఆఖరి క్షణంలో ఒకరి టికెట్టు రద్దు చేయమని కోరితే, అలా కుదరదంటూ మిగిలిన ఇద్దరివీ రద్దు చేస్తున్నారు. ఇలా రద్దయిన టికెట్లను డిమాండ్‌కు అనుగుణంగా రెట్టింపు ధరలకు అమ్ముకుంటున్నారు. ముందుగా బుక్‌ చేసుకున్న టికెట్టు కావాలంటే అప్పటికి పెంచిన చార్జి ఇవ్వాలని, లేదంటే టికెట్టు ఇవ్వడం కుదరదని తెగేసి చెప్పేస్తున్నారు. కుటుంబ సభ్యులు, భార్యా పిల్లలతో ఉన్న వారు మరో గత్యంతరం లేక ఆఖరి నిమిషంలో అధిక చార్జీలు చెల్లించి గమ్యానికి చేరుకుంటున్నారు. ఒక్కోరోజు కొద్దిసీట్లు మాత్రమే నిండితే అర్ధాంతరంగా ఆ సర్వీసులను రద్దు చేస్తున్నారు. ఇలా ప్రైవేటు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా ప్రయాణికులను దోపిడీ చేస్తున్నా రవాణా శాఖ అధికారులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img