Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఈపీఎఫ్‌ వడ్డీరేటు 8.5 శాతంగా కొనసాగించాలి

ఏఐటీయూసీ డిమాండ్‌
న్యూదిల్లీ: ఉద్యోగ భవిష్యనిధి (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును 8.5 శాతంగా కొనసాగించాలని ఏఐటీయూసీ డిమాండ్‌ చేసింది. ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ట్రస్టీలు ఇటీవల సమావేశమై వడ్డీ రేటును తగ్గిస్తూ నిర్ణయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో బోర్డు సభ్యులు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి అమర్‌జిత్‌ కౌర్‌ ఒక ప్రకటనలో విమర్శిం చారు. బలవంతంగా ఇలాంటి చర్యలకు పాల్పడిన సీబీటీకి వ్యతిరేకంగా శ్రామికవర్గం గళమెత్తాలని ఆమె పిలుపు ఇచ్చారు. మార్చి 28,29 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మె కార్యాచరణలో కార్మికులు, సీనియర్‌ సిటిజన్లు మమేకం కావాలని కోరారు. సీనియర్‌ సిటిజన్ల డిపాజిట్లపై వడ్డీ రేట్లను అత్యంత కనిష్ఠస్థాయికి తగ్గించి వారిని ఫైనాన్సియల్‌ మార్కెట్‌ పేరిట చిత్తభ్రమలోకి నెట్టి వేశారని అమర్‌జిత్‌ కౌర్‌ విమర్శించారు. వడ్డీ రేటును తగ్గించడం అంటే, సామాజిక భద్రత నుంచి వైదొలగడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి దాచుకున్న సేవింగ్స్‌ పై నాలుగు రూపాయలు వస్తాయని ఆశించిన కార్మికులకు ఆ ఆశకూడా లేకుండా చేశారని అన్నారు. దేశంలో ఉన్న శ్రామికవర్గానికి రైతుల నుంచి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికుల వరకూ భేదభావాలు లేకుండా ఒక సామాజిక భద్రతా నిధిని కేంద్ర ప్రభుత్వమే సృష్టిస్తే, ఈ విధమైన మార్కెట్‌ సమస్యల నుంచి కోట్లాదిమంది కార్మికులను రక్షించేందుకు ఒక సంక్షేమ ఆయుధంగా దోహదపడగలదన్నారు. ఈ విధమైన సామాజిక భద్రతా నిధి సృష్టికి ఇదే సరైన తరుణమని ఆమె అన్నారు. దేశంలో సంపదసృష్టికి, వృద్ధికి చేస్తున్న శ్రమకు కార్మికవర్గానికి న్యాయబద్ధమైన హక్కుగా ఈ విధమైన సామాజిక భద్రత దోహదం చేస్తుందని ఆమె పేర్కొన్నారు. కార్మికశాఖ ముందుకు తెచ్చిన ఈపీఎఫ్‌ కు సంబంధించిన కచ్చితమైన గణాంకాలను, లెక్కలను ఏఐటీయూసీి తిరస్కరిస్తూ, కేంద్రప్రభుత్వం వడ్డీ రేటును తగ్గించడాన్ని సమర్థించుకోవడానికే ఇలాంటి గణాంకాల వాదనను ముందుకు తెచ్చిందని అమర్‌జిత్‌ కౌర్‌ విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img