Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఈ నెల 30లోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలి.. భారత ఉద్యోగులకు అమెజాన్‌ సూచన

ఇప్పటికే పది వేల మంది ఉద్యోగులను తొలగించిన వైనం
ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని అమేజాన్‌ సంస్థ భారత్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను కోరింది. తద్వారా కంపెనీ అందించే బెనిఫిట్స్‌తో అమెజాన్‌ను విడిచి వెళ్లిపోవాలని చెప్పింది. భారత్‌లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను అమెజాన్‌ వేగవంతం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ వారం దాదాపు పది వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఇంకా మరింత మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కంపెనీలో పని చేస్తున్న అనేక మంది భారతీయ ఉద్యోగులు స్వచ్ఛంద విభజన కార్యక్రమం (వీఎస్పీ) కోసం ప్లాన్‌ చేస్తున్నారు. కంపెనీ వారి ఒప్పందాన్ని ముగించే బదులు స్వచ్ఛందంగా రాజీనామా చేయవలసిందిగా అమెజాన్‌ కూడా కోరుతోంది. అమెజాన్‌ ఎక్స్‌పీరియన్స్‌ అండ్‌ టెక్నాలజీ టీమ్‌లో ఎల్‌1 నుంచి ఎల్‌7 బ్యాండ్‌లో పని చేస్తున్న కొంతమంది భారతీయ ఉద్యోగులు కంపెనీ స్వచ్ఛంద విభజన కార్యక్రమానికి అర్హులు అంటూ ఒక నోటీసు అందుకున్నారు. దీన్ని కోరే ఉద్యోగులు ఈనెల 30వ తేదీ లోపు సంతకం చేయాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోపు తమ సమ్మతి తెలిపే ఉద్యోగులు కంపెనీ అందించే ఇతర ప్రయోజనాలు పొందేందుకు కూడా అర్హులు అవుతారు. భారత కాలమానం ప్రకారం నవంబర్‌ 30వ తేదీ ఉదయం 6.30 గంటలలోపు స్మార్ట్‌ ఫారమ్‌ల వచ్చే వీఎస్పీ దరఖాస్తులను మాత్రమే స్వీకరిస్తామని అమెజాన్‌ స్పష్టం చేసింది. ఉద్యోగులు వీఎస్పీపై సంతకం చేసినట్లయితే వారు 22 వారాల వరకు మూల వేతనం పొందేందుకు అర్హులు. అలాగే ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనం (సమీప 6 నెలల వరకు) అందుకుంటారు. ఇన్సూరెన్స్‌ బెనిఫిట్‌ పాలసీ ప్రకారం 6 నెలల పాటు మెడికల్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని లేదా దాని బదులుగా సమానమైన బీమా ప్రీమియం మొత్తాన్ని పొందేందుకు ఉద్యోగులు అర్హులు అవుతారు. కాగా, శాఖలవారీగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు అమెజాన్‌ బుధవారం ధ్రువీకరించింది. ఈ మేరకు ఉద్యోగులకు ఈమెయిల్‌ పంపించిట్టు వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img