Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకం

దిల్లీలో జరిగే ఆందోళనకు వైసీపీ మద్దతు
ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి హామీ

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం :
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు దిల్లీలో చేపట్టే ఆందోళనలకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రకటించారు. విశాఖలో బుధవారం కార్మిక సంఘాలతో ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌, ఎంపీలు సత్యనారాయణ, సత్యవతి, మాధవి, ఎమ్మెల్యేలు అమర్నాథ్‌, నాగిరెడ్డి భేటీ అయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల దృష్ట్యా స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై చర్చించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఉక్కు పరిశ్రమ నష్టాల్లో ఉందన్న సాకుతో విక్రయిస్తామనడాన్ని వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు. స్టీల్‌ప్లాంట్‌ కోసం సొంత గనులు ఇవ్వాలని డిమాండు చేశారు. మన రాష్ట్ర సరిహద్దు కోటియాలోనే గనులు ఉన్నాయని చెప్పారు. దీనిపై ఉక్కు శాఖమంత్రి, ఆర్థికమంత్రిని కలుస్తామని, బీజేపీయేతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్తామని హామీ ఇచ్చారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని విజయసాయిరెడ్డి తేల్చిచెప్పారు. మంత్రి ముత్తంశెట్టి సైతం ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. దేశ సంపదను కేంద్రం విక్రయించడం సరికాదన్నారు. నష్టం భర్తీ అయ్యేలా కేంద్రం సహకరించాలని మంత్రి కోరారు. నష్టాల్లో ఉన్న కేంద్ర సంస్థలను ప్రైవేటీకరణ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన అని, విశాఖ ఉక్కు కర్మాగారంపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌కి సొంత గనులు కేటాయించడంతో పాటు రుణాన్ని ఈక్విటీ కింద మార్చి వడ్డీ భారం తగ్గించాలని కేంద్రానికి ఇప్పటికే సూచించామన్నారు. స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రత్యామ్నాయాలు సూచించినట్లు వివరించారు. కార్మికసంఘాల నేతలను దిల్లీకి తీసుకెళ్లి ఉక్కుమంత్రిని, ఆర్థికమంత్రిని కలిసి స్టీల్‌ ప్లాంట్‌ అంశాలను వివరిస్తామన్నారు. జంతర్‌మంతర్‌లో రెండు రోజులు నిరసన తెలపాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయని, దీనికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img