Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉక్కు ఫ్యాక్టరీ సాధిస్తాం

. ప్రారంభమైన సీపీఐ మలిదశ పాదయాత్ర
. ఐక్య ఉద్యమాలతో జగన్‌ పాలనను అంతమొందిస్తాం
. ప్రజా ఉద్యమాలకు అనుమతివ్వకపోవడం దుర్మార్గం
. సీపీఐ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
. పాదయాత్రకు సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్‌, జనసేన, ఆర్‌సీపీ మద్దతు

విశాలాంధ్ర బ్యూరో`కడప: రాష్ట్రంలో దుర్మార్గపు, అరాచక పాలన రాజ్యమేలుతోందని, నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గాలు కరువై ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారని, దీనంతటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతకాని పాలనే కారణమని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఘాటుగా విమర్శించారు. కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కలగా నిలిచిపోయిందని మండిపడ్డారు. జగన్‌ దుర్మార్గపు పాలన అంతమవ్వాలంటే అన్ని పార్టీలు ఏకతాటిపైకి రావాలని, ఉమ్మడి ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు. ప్రజా పోరాటాలు చేయడానికి కోర్టుల ద్వారా అనుమతి తీసుకోవాల్సి రావడం దుర్మార్గమని వ్యాఖ్యానించారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం సీపీఐ శుక్రవారం మలిదశ పోరాటం ప్రారంభించింది. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సీఎం జగన్‌ శిలాఫలకం వేసిన కన్యతీర్థం నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. కడప ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. పాదయాత్ర జమ్మలమడుగుకు చేరుకునేసరికి జోరువాన వచ్చింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా సీపీఐ మొక్కవోని దీక్షతో పాదయాత్ర కొనసాగించింది. సీపీఐ చేపట్టిన ఉక్కు ఉద్యమానికి టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్‌, జనసేన, ఆర్‌సీపీ, వివిధ కార్మిక సంఘాలు సంపూర్ణ మద్దతిచ్చాయి.
నారాయణ పాదయాత్రను ప్రారంభిస్తూ రాయలసీమ వెనుకబాటుతనాన్ని పారదోలాలన్న లక్ష్యంతో 2007లో నాటి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. అనివార్య కారణాల వలన దాని నిర్మాణం మొగ్గలోనే నిలిచిపోయిందని, జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కన్యతీర్థం వద్ద శంకుస్థాపన చేశారని, ఏడాదిలోపే ఫ్యాక్టరీ ఉత్పత్తి ప్రారంభిస్తుందని ఆర్భాటంగా చెప్పారని, కానీ ఇక్కడ గడ్డి మొలవడం తప్ప ఏమీ కనిపించడం లేదని విమర్శించారు. నిర్మాణాల కన్నా కూల్చివేతల్లో జగన్‌మోహన్‌రెడ్డి ప్రథమస్థానంలో ఉన్నారన్నారు. సీఎం అయ్యాక జగన్‌ ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చాలంటే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగి తీరాలన్నారు. 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పించే ఫ్యాక్టరీని సమాధి చేసిన ఘనత జగన్‌కే దక్కుతుందని నిశితంగా విమర్శించారు. సీఎం జగన్‌కు సొంత జిల్లాపై ఏ మాత్రం అభిమానం ఉన్నా ఫ్యాక్టరీ నిర్మాణం బాధ్యతలను గాలి జనార్ధన్‌రెడ్డికి ఇచ్చైనా నిర్మాణం పూర్తి చేయించాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే మీ సన్నిహితుడు అదానీకైనా కట్టబెట్టాలన్నారు. రాయలసీమను కరువు కాటకాల నుంచి బయట పడేయాలని జగన్‌కు సూచించారు. పాదయాత్రకు పోలీసులు ఎందుకివ్వలేదని నిలదీశారు. కమ్యూనిస్టు పార్టీలు దొమ్మీలు, దోపిడీలు చేస్తున్నాయా లేక హత్యలు చేస్తున్నాయో సీఎం జగన్‌ చెప్పాలన్నారు. ప్రజా సమస్యలపై శాంతియుతంగా పోరాటం చేస్తామంటే అడ్డుకోవడం విడ్డూరమన్నారు. తమ పాదయాత్రకు బీజేపీ, వైసీపీ తప్ప అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయని, ఇది శుభ పరిణామమని పేర్కొన్నారు.
రామకృష్ణ మాట్లాడుతూ రాయలసీమ అభివృద్ధికి సీఎం జగన్‌ చేపట్టిన కార్యక్రమాలు ఏమిటని ప్రశ్నించారు. 15 ఏళ్ల క్రితం రాజశేఖరరెడ్డి వేసిన పునాదిరాళ్లు సమాధిరాళ్లుగా మిగిలిపోయాయన్నారు. జగన్‌ పాలనలో రాష్ట్రం దుర్భర పరిస్థితిలోకి దిగజారిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై సాగించే పోరాటాలకు అనుమతివ్వకుండా పోలీసులతో అడ్డంకులు సృష్టించడం జగన్‌ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. కోర్టులను ఆశ్రయించి ప్రజా సమస్యలపై ఉద్యమాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే భూములిచ్చిన రైతులతో పాటు నిరుద్యోగ యువతకు ఉపాధి, సాగునీరు, తాగునీరు వంటి మౌలిక వసతులు సమకూరతాయని, రాయలసీమ కరువు కాటకాల నుంచి బయటపడుతుందని ఆయన వివరించారు. జగన్‌ అండ్‌ కంపెనీకి భయపడి రాష్ట్రం నుంచి పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారని విమర్శించారు. అమరరాజా, జాక్‌, కియా కార్ల ఫ్యాక్టరీ అనుబంధ సంస్థలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. సెయిల్‌ నేతృత్వాన స్టీల్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తామని విభజన చట్టంలో హామీ ఇచ్చారని, దీనిని సాధించడంలో సీఎం జగన్‌ విఫలమయ్యారని మండిపడ్డారు. 5700 ఎకరాలు ఇచ్చిన సున్నపురాళ్లపల్లె ప్రజల ఆశలను జగన్‌ సమాధి చేశారన్నారు. ముగ్గురు ముఖ్యమంత్రులు పునాదిరాళ్లు వేశారు కానీ నిర్మాణాలు చేపట్టలేదన్నారు.
టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని విమర్శించారు. జగన్‌ దుర్మార్గపు పాలన కారణంగా పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నాయన్నారు. దీనికితోడు స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు ధనార్జన కోసం పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారన్నారు. 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్ర హక్కులు సాధిస్తానని జగన్‌ ప్రజలను మోసం చేశారన్నారు. సీపీఐ తలపెట్టిన పాదయాత్రకు తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదన్నారు. మాజీ ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మలమడుగు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం జగన్‌మోహన్‌రెడ్డికి లేదని, అందుకే కన్నెతీర్థంలో వేసిన శిలాఫలకం సమాధిగా మారిందన్నారు. రాష్ట్రాన్ని జగన్‌ అప్పులకుప్పగా మార్చారన్నారు. మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి కుటుంబం కడప జిల్లాను సర్వనాశనం చేసిందని విమర్శించారు. ఫ్యాక్టరీ నిర్మాణం కోసం వేల ఎకరాల భూములిచ్చిన రైతులు భుక్తి కోసం అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ శివనాథరెడ్డి మాట్లాడుతూ జగన్‌ సీఎం కావడంతో జిల్లా ప్రజలు సంతోషపడ్డారని, కానీ ఆయన జిల్లాను అధ:పాతాళానికి తొక్కేశారని, సున్నపురాళ్లపల్లె ప్రజల గోడు వింటుంటే మనసు తల్లడిల్లుతోందన్నారు. ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి మాట్లాడుతూ జగన్‌ దోపిడీ పాలన కొనసాగిస్తున్నారని, కక్షపూరిత రాజకీయం జగన్‌కే సాధ్యమన్నారు. పోరాటం ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని పేర్కొంటూ సీపీఐ తలపెట్టిన పాదయాత్రకు సంఫీుభావం తెలిపారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌ మాట్లాడుతూ ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, హక్కులు సాధించుకోగలమన్నారు. సీపీఐ తలపెట్టిన పాదయాత్ర తమ పార్టీ సంపూర్ణమద్దతిస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు కూడా పాదయాత్రలో పాల్గొంటారని వెల్లడిరచారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి.ఓబులేసు, జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, కర్నూలు జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, జిల్లా కార్యవర్గ సభ్యులు పులి కృష్ణమూర్తి, ఎల్‌.నాగసుబ్బారెడ్డి, ఎన్‌.వెంకటశివ, రామయ్య, సుబ్బారెడ్డి, సుబ్రమణ్యం, గుంటి వేణుగోపాల్‌, చంద్రశేఖర్‌, వీరశేఖర్‌, బషీరున్నీసా, విజయలక్ష్మీ, సుబ్బరాయుడు, ఆంజనేయులు, గంగాసురేశ్‌, ఏఐటీయూసీ నాయకులు బాదుల్లా, మద్దిలేటి, ఏఐఎస్‌ఎఫ్‌ నాయకులు సుబ్బరాయుడు, వలరాజు, మహిళా సమాఖ్య, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాల నాయకులు, టీడీపీ నాయకులు ముక్తియార్‌, సీఎం సురేశ్‌ నాయుడు, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img