Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉగ్ర కుట్ర భగ్నం

హరియాణాలో నలుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు
తెలంగాణకు ఆయుధాల సరఫరాకు యత్నం
భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

చండీగఢ్‌: దేశంలో అనేకచోట్ల భీకర పేలుళ్లకు ముష్కరులు పన్నిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు. భారీ మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను తెలంగాణకు తరలించేందుకు యత్నించిన నలుగురు ఖలిస్థానీ ఉగ్రవాదులను గురువారం ఉదయం అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలతో సహా రుజువైంది. నిఘా వర్గాల సమాచారం మేరకు తెలంగాణ, పంజాబ్‌, హరియాణా పోలీసులు సంయుక్తంగా అంతర్రాష్ట్ర ఆపరేషన్‌ చేపట్టారు. ఈ క్రమంలో హరియాణాలోని కర్నాల్‌లో ఓ టోల్‌ ప్లాజా వద్ద అనుమానిత ఇన్నోవా ఎస్‌యూవీని అధికారులు గుర్తించారు. ఆ వాహనాన్ని తనిఖీ చేయగా భారీగా ఆయుధాలు కన్పించాయి. ఇందులో ఐఈడీలు, ఆర్డీఎక్స్‌, 30 కాలిబర్‌ పిస్టళ్లు ఉన్నాయి. దీంతో వాహనంలోని నలుగురు నిందితులను అరెస్టు చేశారు. పంజాబ్‌కు చెందిన వీరిని ఖలిస్థానీ ఉగ్రవాదులుగా గుర్తించారు. ఈ అయుధాలను తెలంగాణ, మహారాష్ట్రకు తీసుకెళ్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితులను విచారించగా అనేక కీలక విషయాలు బయటపడ్డాయి. ఈ ఆయుధాలను డ్రోన్ల ద్వారా దేశ సరిహద్దుల నుంచి తీసుకున్నట్లు తెలిపారు. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నామని నిందితులు వెల్లడిరచారు. పాకిస్థాన్‌కు చెందిన ఖలిస్థానీ ఉగ్రవాది హర్జిందర్‌ సింగ్‌ రిండా వీటిని పంపినట్లు అధికారులు తెలిపారు. ఈ ఖలిస్థానీ ఉగ్రవాదులతో హర్జిందర్‌సింగ్‌ రిండా నిత్యం సంప్రదింపులు జరుపుతున్నట్లు, అక్కడి నుంచే ఆదేశాలు వస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఎక్కడ, ఎప్పుడు అందజేయాలన్న విషయాలను రిండా ప్రత్యేక యాప్‌ ద్వారా సమాచారం ఇస్తున్నట్లు వివరించారు. ఉగ్రవాదుల అరెస్టు, మందుగుండు సామగ్రి స్వాధీనం వంటి అనేక అంశాలను కర్నాల్‌ ఎస్పీ గంగారాం పునియా విలేకరులకు వివరించారు. హరియాణా, పంజాబ్‌ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో నాలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు హరియాణా డీజీపీ పీకే అగర్వాల్‌ వెల్లడిరచారు. విచారణ కొనసాగుతోందని తెలిపారు. ఉగ్రవాదులు ఉపయోగించిన వాహనం నుంచి 2.5 కేజీల ఆర్‌డీఎక్స్‌, పిస్టల్‌, 31 కాట్రిడ్జిలతో పాటు రూ.13 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కర్నాల్‌ రేంజి ఐజీ సత్యేందర్‌ కుమార్‌ గుప్తా చెప్పారు. పేలుడు పదార్థాలను తెలంగాణలోని ఆదిలాబాద్‌కు తరలిస్తుండగా పట్టుకున్నట్లు ఎస్‌పీ పునియా వివరించారు. పాక్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నడుపుతున్న రిండాకు అనేక ఉగ్రదాడులతో సంబంధం ఉందని చెప్పారు. రిండా ఆయుధాలు, మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తుంటాడని, ఆయుధాలు సరఫరా చేయడమే ఖలిస్థానీ ఉగ్రవాదుల పనని చెప్పారు. నిందితులను కోర్టులో హాజరుపరుస్తామని, ఆ తర్వాత విచారణ కోసం పోలీసు కస్టడీ కోరతామని ఎస్‌పీ తెలిపారు. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ రోహతక్‌లో విలేకరులతో మాట్లాడుతూ కేసు దర్యాప్తులో ఉందని, పోలీసులు లోతుగా విచారణ జరుపుతున్నట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img