Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉచిత విద్యుత్‌కు పాతరే

స్మార్ట్‌ మీటర్లపై రామకృష్ణ మండిపాటు
ఖర్చుపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌
‘అదానీ’ప్రదేశ్‌గా మార్చేస్తారా అని నిలదీత

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రైతులకిచ్చే ఉచిత విద్యుత్‌కు మంగళం పాడేందుకే వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు రైతుల మేలు కోసమేనని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పడాన్ని ఖండిరచారు. విద్యుత్‌ మీటర్ల ఖర్చుపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగింపుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఒక్కో మీటర్‌ ఏర్పాటు, నిర్వహణకు దాదాపు రూ.35వేల ఖర్చవుతుందని డిస్కమ్‌లు అంచనా వేయగా, ఒక్కో మీటర్‌ రూ.6వేల చొప్పున రూ.1150 కోట్లు ఖర్చవుతుందని పెద్దిరెడ్డి చెబుతున్నారని, మిగిలిన అనుబంధ పరికరాల కొనుగోలు, నిర్వహణ కోసం అదనంగా రూ.29 వేలు ఖర్చవ్వడం నిజం కాదా అని రామకృష్ణ నిలదీశారు. నిజంగా రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలనుకుంటే స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు ఎందుకు? కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా ఎందుకని ప్రశ్నించారు. ‘మసిపూసి మారేడు కాయ’ చేసిన చందంగా స్మార్ట్‌ మీటర్లపై పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. స్మార్ట్‌ మీటర్లు రైతుల మెడకు ఉరితాళ్లుగా మారనున్నాయని విమర్శించారు. రైతులకు అన్యాయం జరుగుతుందని గ్రహించే కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేసినా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకించిందని గుర్తుచేశారు. సీఎం జగన్‌, మంత్రులు…స్మార్ట్‌ మీటర్లపై చెబుతున్న కుంటిసాకులను తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష, రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరో ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
‘కృష్ణపట్నం’ అదానీకివ్వడం దుర్మార్గం
రాష్ట్రంలోని గంగవరం, కృష్ణపట్నం పోర్టులను అదానీకి అప్పజెప్పిన జగన్‌ ప్రభుత్వం…ఇప్పుడు కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని కూడా అదానీకి కట్టబెట్టేందుకు సిద్ధమవ్వడం దుర్మార్గమని, దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా జగన్‌ సర్కార్‌ మార్చేస్తోందని రామకృష్ణ దుయ్యబట్టారు. కృష్ణపట్నం థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాన్ని అదానీకి ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిరచారు. రాష్ట్రానికి సంబంధించిన పోర్టులు, సోలార్‌ పవర్‌ ఒప్పందాలు, థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలన్నీ అదానీ కంపెనీలకు అప్పగించడం వెనుక జగన్‌ స్వప్రయోజనాలు దాగున్నాయనేది జగమెరిగిన సత్యమని విమర్శించారు. అమిత్‌షా ఆదేశాలకు దాసోహమంటూ ఆదాయాలు సమకూర్చే ప్రజా ఆస్తులన్నీ అదానీకే కట్టబెట్టేందుకు జగన్‌ సిద్ధమవ్వడం విచారకరమని పేర్కొన్నారు. కృష్ణపట్నం ప్రాజెక్టును జాతికి అంకితం చేయడం కాదని, అదానీకి అంకితమిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒక్కొక్కటీ 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు విద్యుత్‌ ప్లాంట్లను (మొత్తం 2400 మెగావాట్ల సామర్థ్యం) నిర్వహణ పేరుతో అదానీకి కట్టబెట్టనున్నారని విమర్శించారు. ఈ విద్యుత్‌ కేంద్రం కోసం వేలాది ఎకరాల భూములు త్యాగం చేసిన రైతులకు, నిర్వాసితులకు ఇది తీరని అన్యాయమని వ్యాఖ్యానించారు. కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నప్పటికీ అత్యాధునిక సాంకేతికత కలిగిన రూ.23 వేల కోట్ల రూపాయల ప్రజా పెట్టుబడిని అదానీకి అప్పనంగా అప్పగిస్తారా?, అదానీ కంపెనీకి, జగన్‌ సర్కారు మధ్య ఉన్న లాలూచీ ఏమిటని నిలదీశారు. వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి, మరో 14ఏళ్ల తర్వాత రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన గంగవరం పోర్టును కేవలం రూ.628 కోట్లకు అదానీకి అప్పజెప్పడం వెనుక మర్మమేమిటని నిలదీశారు. 9 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఒప్పందాలను రూ.36 వేల కోట్లకు అదానీ కంపెనీతోనే కుదుర్చుకోవడం వెనుక మతలబేమిటని ప్రశ్నించారు. ఆదాయ వనరులన్నీ అదానీకి అప్పగిస్తూ దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌ను అదానీప్రదేశ్‌గా మార్చే ప్రక్రియకు జగన్‌ శ్రీకారం చుట్టారని విమర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img