Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉచిత హామీలు తగవు..నియంత్రించాల్సిందే…: సుప్రీంకోర్టు

ఎన్నికల్లో ఉచిత హామీలపై సర్వోన్నత న్యాయస్ధానం ఆందోళన వ్యక్తం చేసింది. ఇది చాలా తీవ్రమైన అంశమని ఉచితాలను నిరోధించే చర్యలపై ఓ వైఖరితో ముందుకు రావాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అలాంటి హామీలను ఇవ్వకుండా ఉండేందుకు ఏదైనా పరిష్కారం కనుగొనాలని ఆదేశించింది. ఉచితాలు, ఎన్నికల హామీలకు సంబంధించిన నిబంధనలు ఎన్నికల ప్రవర్తనా నియమావళిలో ఉన్నాయని, ఉచితాలపై నిషేధం విధించే చట్టాన్ని ప్రభుత్వమే తీసుకురావాల్సి ఉంటుందని ఈసీ తరపున హాజరైన న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఎన్నికల మ్యానిఫెస్టో ఎలాంటి వాగ్ధానం కాదని గతంలో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులున్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.ఎన్నికల్లో ఉచిత హామీలపై ఈసీనే ఓ నిర్ణయం తీసుకోవాలని అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ పేర్కొన్నారు. ఈ విషయంలో తమకు అధికారం లేదని, ఈసీనే ఓ నిర్ణయం తీసుకోవాలని మీరు లిఖితపూర్వకంగా ఎందుకు ఇవ్వకూడదని నటరాజ్‌ను ఉద్దేశించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ కోరారు. ఉచితాలపై ప్రభుత్వం తన వైఖరిని తెలిపితే వీటిని కొనసాగించాలా లేదా అనేది తాము నిర్ణయిస్తామని స్పష్టం చేశారు. ఉచిత హామీలు తీవ్రమైన అంశమని, ఈ విషయంలో ఫైనాన్స్‌ కమిషన్‌ కార్యాచారణకు దిగాలని రాజకీయ అంశాలు ఇమిడిఉన్నందున కేంద్ర ప్రభుత్వం ఉచితాలపై ఓ నిర్ణయం తీసుకుంటుందని తాను భావించడం లేదని సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ పేర్కొన్నారు. ఉచితాలపై హామీల వర్షం గుప్పించి పతనమైన శ్రీలంక సంక్షోభం దిశగా మనం పయనిస్తున్నామని, మన ఆర్ధిక వ్యవస్ధ కూడా కుప్పకూలుతుందని ఈ అంశపై పిటిషన్‌ దాఖలు చేసిన న్యాయవాది అశ్వని ఉపాధ్యాయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో అన్ని రాష్ట్రాలు కలిపి రూ . 70 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని వివరించారు.కాగా కోర్టు తదుపరి విచారణను ఆగస్టు 3కి కోర్టు వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img