Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉద్ధవ్‌పై అనుచిత వ్యాఖ్యలు కేంద్రమంత్రి రాణే అరెస్టు

శివసేన` బీజేపీ బాహాబాహీ
అరెస్టు రాజ్యాంగ విరుద్ధం : నడ్డా

అమరావతి : మహారాష్ట్రలో హైడ్రామా నడిచింది. ముఖ్యమంత్రి వర్సెస్‌ కేంద్ర మంత్రిగా పరిస్థితి మారింది. వ్యవహారం కేంద్రమంత్రి నారాయణ్‌ రాణే అరెస్టు వరకు వెళ్లింది. రాయ్‌గఢ్‌ జిల్లాలో జన్‌ ఆశీర్వాద్‌ యాత్రలో పాల్గొన్న రాణే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశానికి స్వాతంత్య్రం ఎప్పుడొచ్చిందో కూడా తెలియని ఉద్ధవ్‌ చెంపపగల గొట్టాలనేంత కోపమొచ్చిందన్నారు. స్వాతంత్య్ర దినోత్స వం గురించి పక్క వ్యక్తిని అడిగి తెలుసుకున్నారన్నారు. తానక్కడ ఉండి వుంటే ఉద్ధవ్‌ చెంప చెళ్లుమనిపించేవాడినన్నారు. రాణే చేసిన వ్యాఖ్యలు బీజేపీకి శివసేనకు మధ్య అగ్గిరాజేశాయి. రాజకీయ వివాదానికి, ఆందోళ నలకు దారితీశాయి. రాణేపై నాసిక్‌ సైబర్‌ పోలీసులకు శివసేన శాఖాధ్య క్షుడు ఫిర్యాదు చేయగా ఐపీసీలోని 500, 505(2), 153బి(1)(సి) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది. పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ఈ క్రమంలో హైబీపీ, మధుమేహం గురించి రాణే ఫిర్యాదు చేయగా వైద్యుడితో పరీక్షలు చేయించారు. తన వ్యాఖ్యలను రాణే సమర్థిం చుకున్నారు. తానేమీ నేరం చేయలేదని అన్నారు. అరెస్టుపై మీడియా హడావిడి ఏమిటంటూ కస్సుబుస్సులాడారు. తాను మూములు వ్యక్తిని కానని, ఇటువంటి సమాచారాన్ని టీవీలోచూపే ముందు కాస్త ఆలోచించాలని కసురుకున్నారు. తొలుత రత్నగిరి కోర్టులో ముందస్తు బెయిల్‌ కోసం అర్జీ పెట్టుకున్నారు. బెయిల్‌ పిటిషన్‌ రద్దు కావడంతో రాణేను పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.
అగ్గిరాజేసిన రాణే వ్యాఖ్యలు
థాకరేనుద్దేశించి నారాయణ్‌ రాణే చేసిన వ్యాఖ్యలు శివసేన, బీజేపీకి మధ్య ఘర్షణకు దారితీశాయి. రెండు వర్గాల మధ్య వాగ్వాదం

జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకున్నారు. పరస్పరం పార్టీ కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ముంబైతో పాటు అనేక నగరాల్లో శివసేన కార్యకర్తలు ఆందోళనలు నిర్వహించారు. శివసేన యూత్‌వింగ్‌ యువసేన కార్యకర్తలు ముంబైలోని శాంతాక్రజ్‌ (వెస్ట్‌)లోగల జూహు తారారోడ్డులోని రాణే నివాసం వద్దకు చేరుకోగా అక్కడ బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. రెండు వర్గాలు రాళ్లదాడికి దిగగా పోలీసులు లాఠీచార్జి చేశారు. రాణే నివాసం వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి పోలీసులను మోహరించినట్లు అధికారి ఒకరు తెలిపారు. కోవిడ్‌ నిబంధనలను అతిక్రమించినందున ఐపీసీ, సీఆర్పీసీ వేర్వేరు సెక్షన్ల కింద 50 మంది యువసేన, బీజేపీ కార్యకర్తలపై ఎఫ్‌ఐఆర్‌ను శాంతాక్రజ్‌ పోలీసులు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజిని, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన వీడియోలను, వార్తా ఛానళ్లు ప్రసారం చేసిన వీడియో క్లిప్పింగులనూ పోలీసులు పరిశీస్తున్నారు. కోస్తా రత్నగిరి జిల్లాలోని చిప్లున్‌లో శివసేనబీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగిందని పోలీసులు తెలిపారు. నాసిక్‌లో రాళ్ల దాడి జరిగిందని, షాలిమార్‌ చౌక్‌ వద్ద బీజేపీకి వ్యతిరేకంగా శివసేన ఆఫీస్‌ బేరర్లు ప్రదర్శనలు నిర్వహించారని వెల్లడిరచారు. దీంతో శివసేన కార్యాలయంపై దాడికి బీజేపీ కార్యకర్తలు యత్నించగా ఘర్షణ చోటుచేసుకుంది. థానే, నవీ ముంబై, పల్ఘార్‌, పూనే, నాగపూర్‌, అమరావతి తదితర ప్రాంతాల్లోనూ ఘర్షణలుఆందోళనలు జరిగినట్లు తెలిపారు. పూనేలోని డెక్కన్‌ జింఖానా ప్రాంతంలో రాణే పోస్టర్లను చెప్పులతో శివసేన కార్యకర్తలు కొట్టారు. అమరావతి నగరంలోని బీజేపీ కార్యాలయంలో శివసేన కార్యకర్తలు విధ్వంసం సృష్టించారు. కార్యాలయం ఎదుట పోస్టర్లపై పెట్రోల్‌ పోసి నిప్పుపెట్టారు. కార్యాలయంపైకి రాళ్లు విసిరారు. రాణే వ్యాఖ్యలకు నిరసన వ్యక్తంచేశారు. దాడి సమయంలో కార్యాలయంలో పార్టీ వర్కర్లుగానీ, ఆఫీసు బేరర్లుగానీ ఎవ్వరూ లేరు. ‘బీజేపీ నేతలు తమ నోటిని అదుపులో పెట్టుకోకపోతే అందరినీ కొడతాం. మా నేత ఉద్ధవ్‌ థాకరేపై అనుచిత వ్యాఖ్యలను, విమర్శలను భరించం బీజేపీ నేతల తీరు మారకపోతే వారందరికీ దేహశుద్ధి చేస్తాం’ అని అమరావతి శివసేన అధ్యక్షుడు పరాగ్‌ గుధాధె హెచ్చరించారు. నాగపూర్‌ నగరంలోనూ అనేక చోట్ల శివసేన, యువసేన కార్యకర్తలు నిరసనలు తెలిపారు. మహల్‌ ప్రాంతంలోని గాంధీగేట్‌ వద్ద యువసేన కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. థానే నగరంలో మేయర్‌ నరేశ్‌ మహాస్కే నేతృత్వంలో వందలాది మంది శివసైనికులు నౌపాదా పోలీసు స్టేషన్‌కు వెళ్లి రాణేపై ఫిర్యాదు చేశారు. ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం (ఎంఎంఆర్‌) పరిధిలోని కల్యాణ్‌, డోంబివిలి, నవీ ముంబైలో మహిళలు సహా శివసేన వర్కర్లు భారీ ఆందోళన నిర్వహించారు. రాణే పోస్టర్లను చెప్పులతో కొడుతూ ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాల్ఘర్‌ జిల్లాలోని వసాయిలో ప్రధాన రహదారుల వద్ద శివసేన కార్యకర్తలు గుమ్మిగూడి కేంద్రమంత్రి పోస్టర్లను కాళ్లతో తొక్కుతూ నిరసన వ్యక్తంచేశారు.
రాణే అరెస్టు రాజ్యాంగ విలువల ఉల్లంఘనే.. : నడ్డా
నారాయణ రాణే అరెస్టును బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఖండిరచారు. ఇలా చేయడం రాజ్యాంగ విలువలను హరించడమే అని వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలకు తమ పార్టీ బెదరబోదన్నారు. జన్‌ ఆశీర్వాద్‌ యాత్రకు అమితాదరణ లభించడాన్ని చూసి ప్రత్యర్థులు ఓర్లలేకపోతున్నారన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడతామని, యాత్రను కొనసాగిస్తామని చెప్పారు. పోలీసు కస్టడీలో ఉంటే రాణే ప్రాణానికి ముప్పు ఉంటుందని మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్సీ ప్రసాద్‌ లాడ్‌ అన్నారు. పోలీసులు ఆయనతో దురుసుగా ప్రవర్తించినట్లు పేర్కొన్నారు. రాణే వయస్సు దాదాపు 70 ఏళ్లు అని, ఆయన భోజనం చేస్తుండగా పోలీసులు తోసేశారని, ఆ వయస్సు వారితో ఇటువంటి వ్యవహారం ఆమోదయోగ్యం కాదని, ఆయన ప్రాణానికి ముప్పు ఉందనిపిస్తోందని ఆయనన్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img