Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉద్ధవ్‌ రాజీనామా

మా ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర

తప్పులుంటే క్షమించండి… నమస్తే
బలపరీక్షకు ముందే సీఎం కుర్చీ వదిలేసిన ఠాక్రే
సోనియా, పవార్‌కు కృతజ్ఞతలు తెలిపిన శివసేన అధినేత

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే తన పదవికి రాజీనామాను ప్రకటించారు. తప్పులుంటే క్షమించాలని.. తనకు అండగా నిలబడినందుకు మంత్రివర్గ సహచరులకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర గవర్నర్‌ బలపరీక్ష ఆదేశాలను సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రాత్రి 9.40 గంటల సమయంలో ఆయన మీడియా ముఖంగా తన రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. మా ప్రభుత్వం పతనం వెనుక కేంద్రం కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. శివాజీ మహారాజ్‌ వారసత్వాన్ని కొనసాగిస్తామని, బాలాసాహెబ్‌ ఆశయాలను నెరవేర్చామని అన్నారు. ఈ సందర్భంగా సోనియా, శరద్‌ పవార్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. శివసేన ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొందని పేర్కొంటూ, న్యాయస్థానం ఆదేశాలను గౌరవిస్తామని చెప్పారు. రాజీనామా లేఖతో రాజ్‌భవన్‌కి బయలుదేరి వెళ్లారు. అంతకుముందు బలపరీక్షను సవాలు చేస్తూ దాఖలయిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు విచారణ జరుపుతుండగా సాయంత్రం మహారాష్ట్ర కేబినెట్‌ భేటీ అయింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సమావేశానికి అధ్యక్షత వహించారు. తొలుత ఆయన రాష్ట్ర సచివాలయానికి చేరుకుని ఛత్రపతి శివాజీ మహారాజ్‌, బీఆర్‌ అంబేద్కర్‌ చిత్రపటాలకు నివాళులు అర్పించారు. కోవిడ్‌`19 సోకిన కారణంగా ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌, కేబినెట్‌ మంత్రి ఛగన్‌ భుజబల్‌ వర్చువల్‌గా సమావేశానికి హాజరయ్యారు. సమావేశంలో ఉద్వేగ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే తన వల్ల తప్పులేమైనా జరిగితే మన్నించాలని కోరారు. తనకు అండగా నిలబడినందుకు కృతజ్ఞ తలు తెలిపారు. తన సొంత వ్యక్తులు తనను వెన్ను పోటు పొడిచడం గురించి కూడా మాట్లాడారు. చాలామంది దీనిని వీడ్కోలు ప్రసంగంగా అర్థం చేసుకున్నారు. కేబినెట్‌ సమావేశంలో తన ఆలోచన లను మంత్రులతో పంచుకున్నానని చెప్పారు. కేబినెట్‌ సమావేశం తర్వాత సచివాలయం నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాకు నమస్కరించి వెళ్లిపోయారు. ‘అందరికీ ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. నా స్వంత వారే నన్ను వెన్నుపోటు పొడిచారని ఆయన అన్నారు’ అని శివసేన అధికార ప్రతినిధి అరవింద్‌ సావంత్‌ అన్నారు. ‘ఇది వీడ్కోలు అని అనిపించవచ్చు కానీ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తున్నట్లు చెప్పలేదు’ అని అన్నారు. సుప్రీం కోర్టు గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ పక్షాన ఉంటే, ఉద్ధవ్‌ ఠాక్రే అసెంబ్లీలో ఓటు వేయడానికి ఇష్టపడరని ఆ వర్గాలు తెలిపాయి. మరోవైపు మంత్రిమండలి భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని రెండు నగరాల పేర్లను మార్చింది. ఔరంగాబాద్‌ని శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్‌ను ధార్‌శివ్‌గా మార్పు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img