Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

‘ఉపాధి’ నిర్వీర్యం

. నిధుల కేటాయింపులో 5 శాతం క్షీణత
. గ్రామీణ పేదల జీవన భృతికి గండికొట్టిన కేంద్రం
. పనులకు డిమాండ్‌ ఉన్నా పట్టించుకోని పాలకులు
. పని చేసినా కూలీలకు దక్కని ప్రతిఫలం

న్యూదిల్లీ : దేశంలో ‘ఉపాధి’ కూలీలు అడుగడుగునా దగా పడుతున్నారు. కేంద్రంలోని మోదీ సర్కారు అస్తవ్యస్త విధానాలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) ను నిర్వీర్యం చేసింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పథకం రూపుకోల్పోయే కుట్రలకు తెరలేపింది. 2022-23లో ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఖర్చు చేయడం అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 5 శాతం పడిపోయింది. ఇది మెరుగైన ఆర్థిక కార్యకలాపాలతో డిమాండ్‌లో మితమైన తగ్గుదలని ప్రతిబింబిస్తోంది. ఉపాధి హామీ పథకం కింద 2022`23 ఆర్థిక సంవత్సరంలో రూ.1.01 లక్షల కోట్ల వ్యయం ఇప్పటికీ ఆ సంవత్సరానికి కేంద్రం వాస్తవ నిధుల విడుదల కంటే 12 శాతం ఎక్కువగా ఉందని ఏప్రిల్‌ 5 నాటికి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. ఈ పథకం కోసం ప్రభుత్వం గత ఆర్థిక సంవత్సరంలో రూ.84,900 కోట్ల సవరించిన అంచనాలకుగాను రూ.90,373 కోట్లు విడుదల చేసింది. మునుపటి సంవత్సరాల నుంచి వినియోగించని నిధులను పరిగణనలోకి తీసుకుంటే, ఈ పథకం కింద ఖర్చుల కోసం మొత్తం నిధుల లభ్యత 202223 ఆర్థిక సంవత్సరంలో రూ.1.06 లక్షల కోట్లకు చేరుకుంది. అయితే డిమాండ్‌ పెరుగుదలను తీర్చడానికి తగిన నిధులను కేటాయించడానికి కేంద్రం కట్టుబడి ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. జాతీయ గణాంకాల కమిషన్‌ మాజీ చైర్మన్‌ ప్రణబ్‌ సేన్‌ మాట్లాడుతూ మెరుగైన ఆర్థిక కార్యకలాపాలు, కొన్ని సరఫరా సంబంధిత సమస్యలు గత ఆర్థిక సంవత్సరంలో ‘ఉపాధి హామీ’ పథకం వ్యయంలో నియంత్రణకు కారణమై ఉండవచ్చని అన్నారు. ‘202324 ఆర్థిక సంవత్సరం విషయానికొస్తే, వ్యవసాయ రంగం పని తీరును బట్టి పథకం కింద వ్యయం ప్రభావితమవుతుంది’ అని సేన్‌ చెప్పారు. ‘ఇది బాగా ఉంటే, ఉపాధి హామీకి డిమాండ్‌ తగ్గుతుంది. బాగాలేకపోతే, ఉపాధికి డిమాండ్‌ పెరుగుతుంది’ అని అన్నారు. కాగా, 202324 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ బడ్జెట్‌ రూ.60 వేల కోట్లు. ఇది 202223 ఆర్థిక సంవత్సరం కోసం బడ్జెట్‌ అంచనా రూ.73 వేల కోట్ల కంటే 18 శాతం తక్కువ. అయితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అవసరమైతే ఈ పథకానికి మరిన్ని నిధులు కేటాయించాలని సూచించారు.
మరోపక్క డిజిటల్‌ వేధింపులు
నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎంఎస్‌) అనే డిజిటల్‌ హాజరు యాప్‌ను జనవరి 1 నుంచి తప్పనిసరి చేసినందున, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ వెబ్‌సైట్‌లో రోజుకు రెండుసార్లు రెండు లొకేషన్‌, టైమ్‌ స్టాంప్‌ ఉన్న ఫోటోలను అప్‌లోడ్‌ చేస్తే తప్ప వారి రోజువారీ హాజరు నమోదు కావడం లేదని కూలీలు ఫిర్యాదు చేస్తున్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ సమస్యలను పరిష్కరించకుండా దానిని జాతీయ స్థాయికి విస్తరించిందని వారు తెలిపారు. అయితే పీఏఈజీ, ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా అధ్యయనం ప్రకారం, దేశంలో లక్షకు పైగా గ్రామ పంచాయతీలలో ఒక్క ఎన్‌ఎంఎంఎస్‌ పరికరం కూడా వాడుకలో లేదు. కొత్త హాజరు విధానం ప్రత్యేకించి మహిళా కూలీల సమస్యలను మరింత జఠిలం చేసింది. ఇటీవల జంతర్‌ మంతర్‌ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో మోహినీ దేవి అనే కూలీ మాట్లాడుతూ ‘సుదూర ప్రాంతాల నుంచి పని చేసే ప్రదేశానికి ఆలస్యంగా చేరుకునే కూలీలు ఎటువంటి విచారణ లేకుండా స్వయంచాలకంగా గైర్హాజరు అవుతారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మరికొందరు ఆధార్‌ ఆధారిత చెల్లింపు వ్యవస్థ (ఏబీపీఎస్‌) కింద ఫిర్యాదు చేశారు. ఏబీపీఎస్‌ బ్యాంకు ఖాతాలు లేని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ కూలీలకు వేతన చెల్లింపులు అందవని తెలిపారు. కేంద్ర మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం, ఉపాధి హామీ కూలీలలో 43 శాతం మంది మాత్రమే ఏబీపీఎస్‌కు అర్హులు. ఇటీవలి మార్పులు దేశవ్యాప్తంగా 15 కోట్ల మంది కార్మికులను ప్రతికూలంగా ప్రభావితం చేశాయి. ఆధార్‌-పాన్‌ లింకింగ్‌ కోసం చివరి తేదీని పొడిగించాలని కూలీలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పథకం కింద నిధుల పంపిణీకి మార్చి 31 గడువును రద్దు చేయాలని, కోసం సౌకర్యవంతమైన చెల్లింపు విధానాన్ని అవలంబించాలని ఎన్‌ఆర్‌ఈజీఏ సంఘర్ష్‌ మోర్చా డిమాండ్‌ చేసింది. నిజానికి, వేతన చెల్లింపుల్లో దీర్ఘకాల జాప్యం గురించి ఫిర్యాదులు పెరుగుతున్నాయి. 15 రోజులలోపు చెల్లింపులను కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని చట్టంలో పేర్కొన్న చట్టపరమైన హామీని అపహాస్యం చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img