Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఉపాధి పథకంపై కేంద్రం కుట్ర


80శాతం జిల్లాలకు నిధులివ్వం
అంబుడ్స్‌ పర్సన్స్‌ను నియమించలేదని సాకు

ఈ ఆర్థిక సంవత్సరం నుంచి అమలు
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ వెల్లడి

న్యూదిల్లీ: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నీరు కార్చేందుకు మోదీ సర్కారు అనేక కుయుక్తులు పన్నుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఉపాధి పథకానికి క్రమంగా నిధులు తగ్గిస్తూ వస్తోంది. గత బడ్జెట్‌తో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌లో ఉపాధి పథకానికి రూ.25 వేల కోట్లు కోత విధించింది. మొత్తంగా ఈ పథకాన్ని ఎత్తివేయాలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది. అందుకు అనేక సాకులు వెతుకుతోంది. తాజాగా ఓ నిబంధనను తెరపైకి తీసుకొచ్చింది. వాస్తవంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) అమలు తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు అంబుడ్స్‌మన్‌ పర్సన్స్‌ను నియమించాల్సి ఉంది. కానీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు దీనిని సక్రమంగా అమలు చేయడం లేదు. దేశంలో 80శాతం జిల్లాలు అంబుడ్స్‌ పర్సన్స్‌ను నియమించలేదు. దీనిని ఆసరాగా తీసుకొని వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఆ 80శాతం జిల్లాలకు ఉపాధి నిధులు ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడిరచారు.
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ అందించిన వివరాల ప్రకారం ఉపాధి హామీ పథకానికి సంబంధించి బీజేపీ పాలిత రాష్ట్రాలు గుజరాత్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, గోవా, టీఆర్‌ఎస్‌ పాలిత తెలంగాణ, పుదుచ్చేరి, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌, దాద్రా`నాగర్‌ హవేలీ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలు ఒక్క అంబుడ్స్‌ పర్సన్‌ను కూడా నియమించలేదు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌…కొద్ది జిల్లాలకు మాత్రమే అంబుడ్స్‌ పర్సన్స్‌ను నియమించింది. రాష్ట్రంలోని 33 జిల్లాలకుగాను కేవలం నలుగురు అంబుడ్స్‌ పర్సన్స్‌ను నియమించింది. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ పాలిత పశ్చిమబెంగాల్‌..ఈ పథకం కింద 23 జిల్లాలకుగాను నలుగురినే నియమించింది. హరియాణా, పంజాబ్‌లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రెండు రాష్ట్రాల్లోనూ 22 జిల్లాల చొప్పున ఈ పథకం అమలవుతోంది. కానీ హరియాణాలో నాలుగు జిల్లాలకు, పంజాబ్‌లో ఏడు జిల్లాలకు మాత్రమే అంబుడ్స్‌ పర్సన్స్‌ ఉన్నారు. ‘వాస్తవంగా ఉపాధి హామీ పథకం కింద అన్ని జిల్లాల్లో అంబుడ్స్‌ పర్సన్స్‌ను రాష్ట్ర ప్రభుత్వాలు నియమించాల్సి ఉంది. కానీ 80శాతం జిల్లాల్లో అంబుడ్స్‌ పర్సన్స్‌ నియామకమే జరగలేదు. ఈ జిల్లాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి కేంద్రం నిధులు విడుదల చేయడం లేదు’ అని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ కార్యదర్శి నాగేంద్రనాథ్‌ సిన్హా పీటీఐకి చెప్పారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ గురువారం ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కోసం అంబుడ్స్‌ పర్సన్స్‌ యాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గిరిరాజ్‌సింగ్‌ మాట్లాడుతూ దేశంలో అనేక జిల్లాలు అంబుడ్స్‌ పర్సన్స్‌ను నియమించకపోవడంపై ఆందోళన వెలిబుచ్చారు. ఒకవేళ ఎక్కడైనా కొన్ని ప్రాంతాల్లో నియామకాలు జరిగితే..రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులకు అవకాశం కల్పించినట్లు తమ దృష్టికి వచ్చినట్లు చెప్పారు. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ నిబంధనల ప్రకారం అంబుడ్స్‌ పర్సన్స్‌ను నియమించని రాష్ట్రాలకు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నిధులు విడుదల చేసేది లేదు’ అని సింగ్‌ స్పష్టంచేశారు. అంబుడ్స్‌ పర్సన్‌ యాప్‌ను ఉపయోగించుకోవడం ద్వారా ఉపాధి హామీ పథకాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి సహకరించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలుకు సంబంధించి కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ నోడల్‌ మినిస్ట్రీగా పనిచేస్తుంది.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం ప్రధాన లక్ష్యం..ఏడాదికి వంద రోజులు పని కల్పించడం ద్వారా దేశంలోని గ్రామీణ ప్రజలకు జీవనభద్రత కల్పించడం. దీనిని 2006 ఫిబ్రవరి 2వ తేదీన నాటి యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. మొదటిదశలో అత్యంత వెనుకబడిన 200 జిల్లాల్లో దీనిని అమలు చేశారు. ఆ తర్వాత 2007 ఏప్రిల్‌ 1న మరో 113 జిల్లాలు, అదే ఏడాది మే 15న మరో 13 జిల్లాలకు, 2008 ఏప్రిల్‌ 1 నుంచి మిగిలిన అన్ని జిల్లాలకు ఈ పథకాన్ని విస్తరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img