Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉపాధ్యాయుల ఉద్యమాలకు
సీపీఐ అండ

రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయులందరికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సోమవారం ఓ ప్రకటనలో టీచర్స్‌ డే శుభాకాంక్షలు తెలిపారు. గత కొంతకాలంగా ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ రోడ్డెక్కి ఉద్యమానికి సిద్దపడ్డారనీ, విద్య బోధించే గురువులని కూడా చూడకుండా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి గృహ నిర్భంధాలు, అరెస్టులు, వేధింపులకు పాల్పడుతోందని అన్నారు. జగన్‌ సర్కార్‌ తీరును నిరసిస్తూ టీచర్స్‌ డే వేడుకలను ఉపాధ్యాయ సంఘాలు బహిష్కరించడం ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలు జగన్‌ తుంగలో తొక్కారన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీిఎస్‌ రద్దు చేస్తానని చేసిన వాగ్ధానం 3 ఏళ్లు అయినా అమలుకు నోచుకోలేదన్నారు. సీపీిఎస్‌ రద్దు, పీఆర్సీ అంశాల్లో సీఎం మాటతప్పి మడమ తిప్పారని విమర్శించారు. ప్రభుత్వ వైఖరితో విసిగి వేసారిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు శాంతియుత నిరసనలకు సిద్ధమైతే పోలీసులచే వారిపై ఉక్కుపాదం మోపడం దుర్మార్గమని చెప్పారు. సీపీిఎస్‌ రద్దు కోరుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఆందోళన వాయిదా వేసుకున్నప్పటికీ వీరికి, వీరి కుటుంబ సభ్యులకు వేధింపులు, అరెస్టులు, వాహనాలను పోలీస్‌ స్టేషన్‌లకు తరలించడం వంటి పోలీసుల దుశ్చర్యలు తప్పలేదని అన్నారు. జగన్‌ నిరంకుశ పాలన, అప్రజాస్వామిక చర్యలు, నిర్భంధకాండలను సీపీఐ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు చేసే న్యాయమైన పోరాటానికి ఎల్లప్పుడు అండగా ఉంటుందని రామకృష్ణ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img