Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఉల్లిధరల క్షీణత

. మహారాష్ట్ర రైతు వినూత్న నిరసన
. ఆహ్వానపత్రం వేయించి… పంట దహనం
. కేజీ రెండు నుంచి నాలుగు రూపాయలు మాత్రమే
. ఎగుమతులపై నిషేధం ఎత్తివేతకు డిమాండ్‌

న్యూదిల్లీ : ఉల్లి ధరలు భారీగా పడిపోవడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఉల్లికి సరైన ధర కల్పించలేని పాలకుల తీరును తీవ్రంగా నిరసించారు. ఉల్లిపాయల ధర భారీగా క్షీణించడంతో మహారాష్ట్రలోని నాసిక్‌ జిల్లాలో ఓ రైతు తన పంటను దహనం చేశారు. ఈ విధంగా ప్రభుత్వ విధానాలు, ఉల్లి రైతుల అవస్థలను ప్రపంచానికి చాటారు. మహారాష్ట్రలో హోలికా పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగ రోజు భోగిమంటలు వేస్తారు. అందుకే పండగ రోజు తన పంటను భోగిమంటల్లో కాల్చేశారు. ఉల్లి ధరలు పడిపోవ డంతో రైతులు తీవ్ర సంక్షోభంలో పడ్డారు. కేజీ ఉల్లి ధర రెండు నుంచి నాలుగు రూపాయలకు పడిపోయింది. ఇది రైతుల్లో తీవ్ర ఆగ్రహం కలిగించింది. లసల్‌గావ్‌లోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీలో ఉల్లిపాయల వేలాన్ని రైతులు నిలిపివేశారు. నాసిక్‌ జిల్లా యోలా తాలూకా మథుల్తాన్‌ గ్రామ రైతు కృష్ణ దోంగ్రే 1.5 ఎకరాల పొలంలో ఉల్లి పంట వేశారు. ధర తగ్గిపోవడంతో తన నిరసన, ఆందోళనకు చిహ్నంగా ఆహ్వానపత్రం వేశారు. దీని ప్రకారం పంటను కాల్చివేశారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. ‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను పూర్తిగా వదిలేశారు. పాలకులకు అధికార పోరు తప్ప రైతుల బతుకులు లేదా చావుల గురించి పట్టించుకోవడం లేదు. ఇది మహారాష్ట్రకే కాకుండా దేశానికే బ్లాక్‌ డే. ఉల్లి పంటను స్వయంగా దహనం చేసుకునే పరిస్థితులు కల్పించిన పాలకుల తీరు దుర్మార్గం’ అని ఆ రైతు ప్రభుత్వ విధానాలను తూర్పారబట్టారు. ఈ నిరసనలో సమీప గ్రామాల రైతులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉల్లి ధరల పతనంతో నాసిక్‌లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా రైతులుఎ ఆందోళనలకు దిగారు. ధరలు లేకపోవడంతో లసల్‌గావ్‌ ఏపీఎంసీలో ఉల్లిపాయల వేలాన్ని మహారాష్ట్ర రాజ్య కంద ఉత్పాదక సంఘటన(ఎంఆర్‌కేయూఎస్‌) ఫిబ్రవరి 27న నిలిపివేసింది. చంద్వాడ, జిల్లాలోని ఇతర ప్రాంతాలు, రాష్ట్రంలో గతవారం రైతులు ఆందోళనలు చేశారు. కేంద్రమంత్రి భారతి పవార్‌ను ఆదివారం నాసిక్‌ జిల్లాలో ఘెరావ్‌ చేశారు. ఉల్లిపాయల ఎగుమతులు పెంచుతామని కేంద్రం చెబుతున్నప్పటికీ మంచి ధరలు ఎందుకు రావడం లేదని రైతులు ప్రశ్నించారు. ఉల్లి క్వింటాల్‌ ధరను రూ.1500గా తక్షణమే ప్రకటించాలని రైతు నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం ఉల్లి ధర కేజీ 3, 4, 5 రూపాయలు మాత్రమే ఉందని, దీనిని కనీసం రూ.15`20కన్నా పెంచాలని డిమాండ్‌ చేశారు. ఫిబ్రవరిలో ఓ రైతు నాసిక్‌ జిల్లాలోనే 512 కేజీల ఉల్లిపాయలు అమ్మితే అతనికి వచ్చిన లాభం కేవలం రూ.2.49 పైసలు. సోలాపూర్‌ మార్కెట్‌ యార్డ్‌లో కేజీ ఉల్లి పాయలకు ఒక్క రూపాయి మాత్రమే లభించిందని ఆ రైతు వాపోయారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img