Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉసురుతీసిన వరద

కడప, చిత్తూరు, అనంతపురంలలో బీభత్సం

వేర్వేరు ఘటనల్లో 25 మంది మృతి.. 17 మంది గల్లంతు

చెయ్యేరు నదిలో కొట్టుకుపోయిన 30 మంది
12 మృతదేహాలు లభ్యం
కదిరిలో కూలిన భవనం.. ఏడుగురు మృత్యువాత
సీఎం ఏరియల్‌ సర్వే

విశాలాంధ్ర ` కడప/అనంతపురం/తిరుపతి : ఆంధ్ర ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక చెరువులకు కట్టలు తెగి వరద ప్రవాహం ఊళ్లకు పడిరది. భారీ వర్షాలు కడప జిల్లాను అతలాకుతలం చేశాయి. పెన్నా, పాపగ్ని, పింఛ, మాండవ్య, బహుదా, చెయ్యేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీనికితోడు వాగులు, వంకలు ఉరకలెత్తుతున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వరద ప్రభావిత ప్రాంతాలలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఏరియల్‌ సర్వే చేపట్టారు. ఇదిలాఉండగా, శుక్రవారం నాటి నుంచి రాష్ట్రంలోని కడప, అనంతపురం జిల్లాల్లో వర్ష సంబంధిత ఘటనల్లో 25 మంది మరణించగా, 17 మంది గల్లంతయ్యారని శనివారం ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం కడప జిల్లాలోని చెయ్యేరు నదిలో వరద ఉధృతిలో 30 మందికి పైగా కొట్టుకుపోయారు. శనివారం సాయంత్రం వరకు 12 మృతదేహాలను వెలికితీసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. రెండు లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండటంతో మిగిలిన వారి ఆచూకీ కనుగొనడం చాలా కష్టంగా మారినట్లు వివరించారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో ఎడతెరిపిలేని భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్న ఒక భవనం కూలి పక్కనే ఉన్న మరొక నివాసంపై పడిరది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులతో సహా కనీసం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. కుప్పకూ లిన భవనాల నుంచి నలుగురు వ్యక్తులు సురక్షితంగా బయటకు వచ్చారు. మరికొందరి ఆచూకీ తెలియరాలేదు. ఈ ప్రమాదానికి అక్రమ నిర్మాణమే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు జిల్లా వాసులను వర్షాలు బెంబేలెత్తిస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపి లేని వర్షాలకు అనేక గ్రామాలు నీట మునిగాయి. తిరుపతి పట్టణం వరద నీటిలో మునిగిపోయింది. ఇదిలాఉండగా, పెన్నేరు నదిలో భారీ వరద రావడంతో నెల్లూరు జిల్లాలోని అనేక గ్రామాలు శనివారం నీట మునిగాయి. వరద బాధిత ప్రాంతాల నుంచి వేలాది మందిని సహాయక శిబిరాలకు తరలించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయా జిల్లాల్లో సహాయక, రక్షణ చర్యల కోసం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలను మోహరించారు.
బాధితులను అన్నివిధాలా ఆదుకోండి : సీఎం ఆదేశం
కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మంత్రులు, అధికారులతో కలిసి శనివారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు. ముఖ్యమంత్రి వెంట పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు. తాడేపల్లిలోని నివాసం నుండి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లిన సీఎం…అక్కడ నుండి ప్రత్యేక విమానంలో కడపకు చేరుకున్నారు. అక్కడి నుండి ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు సహా వరద ప్రభావిత ప్రాంతాలను ఆయన పరిశీలించారు. పంటపొలాలన్నీ నీట మునిగిపోయాయి. లోతట్టు గ్రామాలన్నీ జల దిగ్బంధంలో చిక్కుకుపోయాయి. ఇళ్లు నీటిలో మునిగిపోయాయి. కాగా, కడప, చిత్తూరు జిల్లాలో పరిస్థితులు చూసి చలించిపోయిన సీఎం జగన్‌.. ముంపు బాధితుల కుటుంబాలకు అన్ని విధాల సహాయం అందించాలని ఆదేశించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయానికి సీఎం చేరుకుని అక్కడ నష్ట తీవ్రతను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చిత్తూరు జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌, తుడ చైర్మన్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డితో వరద నష్ట తీవ్రత, సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వరద నీరు తగ్గిన వెంటనే పంట నష్టం నమోదు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాగా ప్రభుత్వం వర్ష సంబంధిత ఘటనల్లో మరణించిన ఒక్కొక్క బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుండి గన్నవరానికి తిరుగు ప్రయాణం అయ్యారు.
రైల్వే ట్రాక్‌లను పరిశీలించిన ఎస్‌సీఆర్‌ జీఎం మాల్యా
కడప జిల్లాలో చెయ్యేరు నది వరద ఉధృతికి రైల్వే ట్రాక్‌ కొట్టుకుపోయిన నందలూరురాజంపేట సెక్షన్‌ను దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా తనిఖీ చేశారు. ట్రాక్‌ పునరుద్ధరణ పనులు జోరుగా సాగుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాగా అన్ని ప్రామాణిక భద్రతా నిబంధనలను అనుసరించి యుద్ధప్రాతిపదికన ట్రాక్‌ పునరుద్ధరణ పనులను పూర్తి చేయాలని అధికారులను జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యా ఆదేశించారు. విజయవాడ డివిజన్‌లో నెల్లూరుపడుగుపాడు సెక్షన్‌లో రైల్వే ట్రాక్‌పై వరద నీరు ప్రవహిస్తున్న కారణంగా శని, ఆదివారాల్లో కనీసం 10 ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు రద్దయ్యాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img