Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఊరువాడా ఏకమై.. మహాపాదయాత్ర ప్రభంజనం

అమరావతి రైతులకు అడుగడుగునా ఘన స్వాగతం
కందుకూరు నుండి గుడ్లూరు వరకు యాత్ర

విశాలాంధ్ర బ్యూరో ` ఒంగోలు : అమరావతి రైతులు చేపట్టిన న్యాయస్థానం నుంచి దేవస్థానం మహాపాదయాత్రకు ఊరు వాడా ప్రజలు ఏకమై.. ప్రభంజనమై ముందుకు సాగుతున్నారు. పాదయాత్రకు అడుగడుగునా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఘన స్వాగతం పలుకుతూ హారతులు పడుతున్నారు. బుధవారం కందుకూరు పట్టణంలోని వెంగమాంబ ఫంక్షన్‌ హాలు నుండి అమరావతి రైతుల మహాపాదయాత్ర ప్రారంభమైంది. అక్కడి నుంచి కొండముడుసుపాలెం గ్రామంలో పాదయాత్రకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి మోపాడు గ్రామం మీదుగా బయలుదేరి మాచవరం మీదుగా రాత్రికి గుడ్లూరు చేరుకుంది. దారిపొడవునా ఎక్కడికక్కడ రైతులు మహిళలు, విద్యార్థినీవిద్యార్థులు పెద్ద సంఖ్యలో రైతుల పాదయాత్రలో అడుగులు కలుపుతూ ముందుకు సాగారు. రైతులకు మహిళలు హారతులు పట్టారు. యాత్రకు ముందు కోలాట ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
విరాళాలు అందజేత
అమరావతి నుంచి తిరుపతి వరకు రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు విరాళాలు పెద్ద సంఖ్యలో అందజేస్తున్నారు. అమరావతి రాజధాని ఉండాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ యాత్రను ప్రోత్సహిస్తూ వారి ఖర్చులకు వేల రూపాయలు విరాళాలు అందజేస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు కూడా వారికి తోచినంతవారు ఇవ్వడం అందరినీ ఆకట్టుకుంటోంది.
కందుకూరు నియోజకవర్గంలో అపూర్వ స్వాగతం
అమరావతి రైతుల మహాపాదయాత్రకు కందుకూరు నియోజకవర్గంలో ప్రజలు నీరాజనాలు పలికారు. చుట్టుపక్కల గ్రామస్తులు, రైతులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో యాత్రలో పాల్గొంటున్నారు. ముఖ్యంగా వృద్ధులతో పాటు మహిళలు పసిబిడ్డలను ఎత్తుకొని మరీ యాత్రలో పాల్గొని జై అమరావతి, జైజై అమరావతి అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img