Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎక్కడి చెత్త అక్కడే

రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్య కార్మికుల సమ్మె
మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట ధర్నాలు
హామీలు అమలు చేసేదాకా సమ్మె ఆగదని నేతల హెచ్చరిక
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి వచ్చిందంటూ రమణ, సుబ్బరాయుడు, చలసాని ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ప్రభుత్వ హామీలు నెలలు, సంవత్సరాలు గడుస్తున్నా అమలుకు నోచుకోకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు నిరవధిక సమ్మెకు దిగారు. అనేక విజ్ఞాపనలు, వినతులు, ఆందోళనలు చేసినా ప్రభుత్వంలో స్పందన రాకపోవడంతో ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, సీఐటీయూ, ఇతర కార్మిక సంఘాల అధ్వర్యంలో పారిశుధ్య సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యాన పారిశుధ్య కార్మికులు వర్షంలో తడుస్తూనే విజయవాడ ధర్నా చౌక్‌లో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన సభలో ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చలసాని వెంకట రామారావు మాట్లాడుతూ గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్‌ మున్సిపల్‌ కార్మికుల సమస్యలు వెంటనే పరి ష్కరించి సమ్మెను విరమింపచేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో సుమారు 55వేల మంది మున్సిపల్‌ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, పర్మినెంట్‌ కార్మికులు, పెన్షనర్లు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నా స్పందించకపోవటం దుర్మార్గమన్నారు. కార్మికులందరికీ 11వ పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు చెల్లించాలని, హెల్త్‌ అలవెన్సుతోపాటు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే 14వ తేదీ నుంచి మున్సిపల్‌ ఇంజినీరింగ్‌ శాఖ పరిధిలోని వివిధ విభాగాల కార్మికులు కూడా సమ్మెలోకి వస్తారని హెచ్చరించారు. సీఐటీయూ నాయకుడు ఉమామహేశ్వరరావు, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) అధ్యక్షుడు పి.సుబ్బరాయుడు మాట్లాడుతూ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించబోమని స్పష్టంచేశారు. మంగళవారం ఉదయం 10గంటలకు మున్సిపల్‌ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలియజేస్తామని చెప్పారు. మున్సిపల్‌ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఆసుల రంగనాయకులు, జెక్కి జేమ్స్‌, జెక్కి రమేశ్‌, జ్యోతిబసు, వి.సాంబశివరావు, డేవిడ్‌, ఎన్‌.శ్రీనివాసరావు, వీవీఎల్‌ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. సమ్మెలో భాగంగా కొండపల్లి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. అనంతరం ఇబ్రహీంపట్నం, కొండపల్లి వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు, సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు మహేశ్‌, ఏఐటీయూసీ నాయకులు జి.ప్రసాద్‌ ప్రసంగిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఏఐటీయూసీ అనుబంధ కొండపల్లి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి టి.నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట పారిశుధ్య కార్మికులు ధర్నా చేశారు. సీపీఐ సీనియర్‌ నాయకుడు మోదుమూడి రామారావు, మున్సిపల్‌ కార్మిక సంఘాల నాయకులు కర్రపాటి సత్యనారాయణ, బుర్రా సుబ్రహ్మణ్యం, యర్రంశెట్టి ఈశ్వరరావు, సీరంశెట్టి లలిత తదితరులు పాల్గొన్నారు. జగ్గయ్యపేటలో మున్సిపల్‌ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఏఐటీయూసీ నాయకులు పోతుపాక వెంకటేశ్వర్లు, అంబోజి శివాజీ, వాసు, భాస్కర్‌, శ్రీను, నాగేంద్రబాబు, వెంకట నారాయణ, సీఐటీయూ నాయకులు విజయ్‌, రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.
విశాఖపట్నంలో
జీవీఎంసీలో ఉన్న 98 వార్డుల్లో పారిశుధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. అన్ని వార్డు కార్యాలయాలతోపాటు ఎంఎస్‌ఎఫ్‌ల్లో మున్సిపల్‌ కార్మికులకి జగన్‌ ప్రభుత్వం చేసిన ద్రోహాన్ని నిరసిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 98 వార్డుల్లో సమ్మె తొలి రోజు విజయవంతంగా ముగిసింది. ఓ పక్క వర్షం, మరోపక్క పేరుకుపోయిన చెత్తకుప్పలతో నగరం దుర్భరంగా మారింది. మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఏఐటీయూసీ) అధ్యక్షులు పడాల రమణ ప్రసంగించారు. సమ్మెను ఉద్దేశించి రమణ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్‌ కార్పొరేషన్‌ వాహనాలను తెల్లవారుజామున 6 గంటల నుంచి నిలుపుదల చేశామని, జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేసేవరకు సమ్మె కొనసాగుతుందన్నారు. 11వ పీఆర్సీ సిఫారసుల ప్రకారం నెల జీతం 20వేల రూపాయలు కరువు భత్యం చెల్లించాలని, మున్సిపల్‌ పారిశుధ్య ఇంజినీరింగ్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు ఏఐటీయూసీ ఉండగా ఉంటుందన్నారు. నాయకులు కె. సత్యనారాయణ, జి ప్రకాశ్‌, జి.సుబ్బారావు, పి.వెంకటరెడ్డి, పిట్టా కిషోర్‌, డోలా ప్రసాద్‌, కె.రాజు, వరప్రసాద్‌, టి.నూకరాజు, నాగ ఆప్పరావు, శేఖర్‌, సిరా రమణ తదితరులు పాల్గొన్నారు.
తిరుపతిలో
తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు మెరుపు సమ్మెకు దిగారు. ఉదయం 6 గంటలకు తిరుపతి కార్పొరేషన్‌ కార్యాలయం వద్దకు వందలాది మంది చేరుకున్నారు. కార్యాలయం లోపలికి అధికారులను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేవరకు కదిలేదిలేదని కార్మికులు పేర్కొన్నారు. ఈ ఉద్యమానికి మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు బి.తులసేంద్ర, రామచంద్రయ్య, ఏఐటీయూసీ కార్యదర్శి రాధాకృష్ణ, కుమార్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి తదితరులు నాయకత్వం వహించారు. కార్మికుల సమ్మెకు మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌, ఏఐటీయూసీ, సీఐటీయూ, సీపీఐ, సీపీఎం, ప్రజాసంఘాలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. పుత్తూరు,నగరి, శ్రీకాళహస్తి, పలమనేరు, మదనపల్లె, పుంగనూరు, చిత్తూరు మున్సిపాలిటీల్లో కార్మికులు పెద్దఎత్తున సమ్మెకు దిగారు.
గుంటూరులో
మున్సిపల్‌ కార్మికుల జేఏసీ అధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా(గుంటూరు, పల్నాడు, బాపట్ల)లో సమ్మె విజయవంతంగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని ఆయా ప్రాంతాలలో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించి నిరసనలు తెలిపారు. గుంటూరులోని నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద జరిగిన సమ్మెలో జేఏసీ నాయకులు కోట మాల్యాద్రి, ముత్యాలరావు, ఈదులమూడి మధుబాబు, సోమి శంకర్‌రావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన మున్సిపల్‌ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఎ.మారుతీ వరప్రసాద్‌ పాల్గొన్నారు. బాపట్ల జిల్లా రేపల్లెలో జరిగిన సమ్మెలో ఏఐటీయూసీ రాష్ట్ర నాయకులు పి.నాగాంజనేయులు పాల్గొన్నారు.
ఏలూరులో
మున్సిపల్‌ ఉద్యోగ కార్మికుల సమ్మె విజయవంతంగా ముగిసింది. జిల్లా ప్రధాన కేంద్రం ఏలూరు నగర పాలక సంస్థ కార్యాలయం వద్ద కార్మికులు మానవహారంగా నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏపీ మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భజంత్రీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. చింతలపూడిలో సీపీఐ మండల కార్యదర్శి కంచర్ల గురవయ్య, ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి తుర్లపాటి బాబు, నూజివీడులో ఏఐటీయూసీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి చాట్ల పుల్లారావు, సీనియర్‌ నాయకులు ఇందుపల్లి సత్య ప్రకాష్‌, జంగారెడ్డిగూడెంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మన్నవ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో సీపీఐ రాష్ట్ర కంట్రోల్‌ కమిషన్‌ చైర్మన్‌, మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావును పోలీసులు గృహనిర్బంధం చేశారు. భీమవరంలో ఏఐటీయూసీ నాయకులు చెల్లబోయిన రంగారావు, తాడేపల్లిగూడెం నుండి ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి సోమసుందర్‌, సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, పాలకొల్లులో మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ధనాల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో
కాకినాడ జిల్లాలో మున్సిపల్‌ కార్మికుల సమ్మె విజయవంతమైంది. సమ్మెకు ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌ హాజరయ్యారు. రాజమహేంద్రవరం మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయం ముందు ఏఐటీయూసీ కార్మిక సంఘాల అధ్వర్యంలో ధర్నా చేశారు. ముఖ్య అతిథిగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి బీవీ కొండలరావు, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కిర్ల కృష్ణ పాల్గొన్నారు. సామర్లకోటలో ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఉప్పలపాటి చంద్ర దాసు, ఏఐటీయూసీ నాయకులు కామిరెడ్డి బోడకొండ, సీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దిరెడ్ల సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img