Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

ఎగువ భద్రతో ఎడారిగా రాయలసీమ

. రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్న కేంద్రం
. ఇరిగేషన్‌ ప్రాజెక్టులను గాలికి వదిలేసిన సీఎం
. రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర`అనంతపురం అర్బన్‌: కర్నాటక రాష్ట్రంలో ఎగువ భద్రా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు నిర్మాణం జరిగితే రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు జీవనాడి అయిన పోలవరం జాతీయ ప్రాజెక్టును పూర్తి నీటి సామర్థ్యంతో నిర్మించాలనీ, కర్నాటకలో బీజేపీి ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ఎగువ భద్రా ప్రాజెక్టును ఆపాలని డిమాండ్‌చేస్తూ అనంతపురంలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రామకృష్ణతోపాటు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్‌, సీనియర్‌ నాయకుడు ఎంవీ రమణ, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్‌, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకుడు దాదా గాంధి, సీపీఐ ఎంఎల్‌ జిల్లా కార్యదర్శి పెద్దన్న, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య తదితరులు పాల్గొన్నారు. రామకృష్ణ మాట్లాడుతూ కర్నాటక అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో లబ్ధికోసమే ఎగువ భద్రా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును అక్రమంగా నిర్మిస్తున్నారన్నారు. ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర జల కమిషన్‌ అనుమతులు సైతం లేవని చెప్పారు. ఎగువ భద్రా ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆంధ్ర ప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇంతజరుగతున్నా ఇటీవల బడ్జెట్‌ లో కేంద్ర ప్రభుత్వం ఎగువ భద్రా నిర్మాణానికి 5,300 కోట్ల రూపాయలు కేటాయించిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారేగాని నిధులు మంజూరు చేయడం లేదని చెప్పారు. ఇప్పటివరకు పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన 2,900 కోట్లు కేంద్రం ఇవ్వాల్సివుండగా ఆ అంశాన్ని పట్టించుకోకుండా ఎగువ భద్రాకు 5 వేల కోట్ల పైచిలుకు నిధులు విడుదల చేయడం హేయమైన చర్య అన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టి వ్యవస్థలన్నింటిని తుంగలో తొక్కుతున్నదని చెప్పారు. ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి దుర్మార్గంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టారు. .కేంద్రంలో బీజేపీి, రాష్ట్రంలో వైసీపీి ప్రభుత్వాల స్వార్థ రాజకీయాలవల్ల హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీ, శ్రీశైలం డ్యాం ద్వారా రాయల సీమకు వచ్చే నీటికి ఇబ్బందులు ఎదురౌతున్నాయని చెప్పారు. తుంగ భద్రా నుంచి శ్రీశైలం డ్యాం కు వచ్చే అదనపు నీరు ఆగిపోయే ప్రమాదం ఉందన్నారు. దీంతో రాయలసీమ ప్రాంతం ఎడారి కాబోతోందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయన్నారు. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఇరిగేషన్‌ ప్రాజెక్టులను గాలికి వదిలేసిందనీ, కావలసిన నిధులు విడుదల చేయకపోగా ఉన్న నిధులను సైతం సక్రమంగా ఖర్చు చేయడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో ఇరిగేషన్‌ ప్రాజెక్టుల సత్వర నిర్మాణం కోసం ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు అన్ని వర్గాల ప్రజలు సమాయత్తం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సీనియర్‌ నాయకుడు న్యాయవాది ఐదుకల్లు రవీంద్ర,ఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్‌ సాకే హరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img