Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎడతెరపిలేని వాన

ప్రకాశం బ్యారేజీకి వరద పోటు
పరవళ్లు తొక్కుతున్న గోదావరి
జనావాసాలు జలదిగ్బంధం
విజయనగరంలో గోడకూలి ఇద్దరి మృతి

రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా రెండు రోజులుగా వర్షంతో తడిసి ముద్దయింది. అన్ని మండలాల్లోనూ శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేని వర్షం కారణంగా వాహనచోదకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

విశాలాంధ్ర`విజయవాడ: రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. అనేక జిల్లాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా రెండు రోజులుగా వర్షంతో తడిసి ముద్దయింది. అన్ని మండలాల్లోనూ శుక్రవారం రాత్రి నుంచి శనివారం మధ్యాహ్నం వరకు వర్షం కురుస్తూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కారణంగా వాహనచోదకులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. శనివారం ఉదయం 8గంటల సమయానికి జిల్లాలో 26.86 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా ఇబ్రహీంపట్నం మండలంలో 43.6 మిల్లీమీటర్లు. అతి తక్కువగా రెడ్డిగూడెం మండలంలో 12.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
బ్యారేజీకి వరద…
మరోవైపు ఎగువన తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రకాశం బ్యారేజీ వద్దకు వరద నీరు వచ్చి చేరుతోంది. శనివారం సాయంత్రం ఆరు గంటల సమయానికి 23,117 క్యూసెక్కులు వరద వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో 25 గేట్లను ఒక అడుగు మేర ఎత్తి 18,375 క్యూసెక్కులను దిగువకు, మరో 4,742 క్యూసెక్కులను కాలువలకు విడుదల చేసినట్లు పేర్కొన్నారు.
దేవీపట్నం: గోదావరి నది ఎగువ ప్రాంతంలో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉపనదులు నుంచి వరదనీరు కలవడంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ఈ కారణంగా గోదావరి నది ఒడ్డున ఉన్న గిరిజన గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న 47 గ్రామాల్లో ఇప్పటికే కొన్ని గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి తరలించారు. కొన్ని గ్రామాలు ప్రజలు పరిహారం, మరికొన్ని ప్యాకేజీలు అందని కారణంగా గ్రామాలు ఖాళీ చేయని సంగతి తెలిసిందే. అయితే ఇటీవల అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరిలో వరదనీటి నిల్వలు అధికంగా పెరుగుతున్నాయి. పోలవరం కాఫర్‌ డ్యాం వద్ద సుమారు 28అడుగుల ఎత్తులో వరద నీటి నిల్వలు పెరిగినట్టు తెలుస్తోంది. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి వద్ద సుమారు 175 గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు సమాచారం. గోదావరి ఎగువన భద్రాచలం వద్ద గోదావరి నది వరద నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఏటా గోదావరి వరదలతో నెలలు తరబడి ఇబ్బందులు ఎదుర్కొనే గిరిజనులు గ్రామాలు ఖాళీ చేయటంతో కొంతవరకు ఆ ఇబ్బందులు తొలగాయి. ఇంకా ఖాళీ చేయని గ్రామాల్లో ఆదివారం సబ్‌ కలెక్టర్‌ కట్టా సింహాచలం, అధికారులు పర్యటించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. ఎడతెరిపి లేని వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. మండలంలో పలు ప్రాంతాల్లో కొండ వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడి గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే రెండు మూడు రోజులు వాతావరణంలో మార్పులు ఇలానే ఉండి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడిరచింది. దీంతో గోదావరి తీరంలో ఇంకా ఖాళీ చేయని గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
భారీ వర్షానికి గోడ కూలి ఇద్దరి మృతి
గరివిడి: భారీ వర్షాల కారణంగా విజయనగరం జిల్లా గరివిడి మండలం, కుమరాంలో శనివారం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో పెంకుటిల్లు గోడ కూలి ఇద్దరు వ్యక్తులు ఘటనా స్థలంలోనే మృతి చెందారు. వారిని అడ్డాల హరిత వర్మ(6) అడ్డాల లక్ష్మి(48)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మృతురాలి కుమారుడు అడ్డాల రాము(27), కోడలు సాయి ధరణి(23), మనుమరాలు భవాని(3)లకు తీవ్ర గాయాలయ్యాయి. అత్యవసర వైద్యం కోసం విజయనగరం పెద్దాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చీపురుపల్లి ఆర్డీవో మండల అప్పారావు, తహసీల్దార్‌ టీ గోవింద్‌, స్థానిక ఎస్‌ఐ బీ మురళి వెళ్లి పరిశీలించి వివరాలు సేకరించారు. వీరితో పాటు ఆ గ్రామ సర్పంచ్‌ భర్త ముల్లు రమణ, ఎంపీటీసీ భర్త రఘుమండ చంద్రకుమార్‌, స్థానిక గ్రామ పెద్దలు ఉన్నారు.
కర్నూలు: జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. విత్తనాలు వేసి వర్షాలు రాక ఆకాశం వైపు చూసున్న రైతన్న మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా హర్షం వ్యక్తం చేస్తున్నాడు. కర్నూలు జిల్లాతో పాటు నంద్యాలలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు వరి, వేరుశనగ, పత్తి, కంది, పొద్దుతిరుగుడు పంటలు సాగు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img