Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఎత్తు తగ్గింపును సహించం

. పోలవరం ప్రాజెక్టుపై కేంద్రం కుట్రలు సాగనివ్వం
. రాష్ట్రవ్యాప్తంగా సీపీఐ దీక్షలు
. అంగుళం తగ్గినా నిర్వాసితులకు ద్రోహం చేసినట్లే
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో ` అమరావతి: పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా పూర్తి స్థాయి నిర్మాణాన్ని డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు జిల్లా కలెక్టరేట్‌ల ఎదుట సామూహిక దీక్షలు నిర్వహించారు. దీనిలో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్‌ వద్ద జిల్లా సీపీఐ కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య అధ్యక్షతన సోమ, మంగళవారాలలో జరిగే సామూహిక దీక్షలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామ కృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు ఎత్తు 45.72 మీటర్ల నుండి 41.5 మీటర్లకు కుదించడం, నిర్వాసితులకు పరిహారం చెల్లించకుండా ఎగ్గొట్ట డానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని విమర్శిం చారు. 150 అడుగుల ఎత్తులో 196 టీఎంసీల సామర్థ్యంతో ఉండాల్సిన ప్రాజెక్టును 130 అడుగులకు కుదించి ఆ లోపున ఉన్న నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పడమంటే పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. పోలవరం పూర్తి అయితే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, కృష్ణా డెల్టాతో పాటు రాయలసీమ ప్రాంతానికి కూడా సాగునీరు అందుతుందన్నారు. తద్వారా రాష్ట్రం సస్యశ్యామలమవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ ఇటీవల అసెంబ్లీలో పోలవరాన్ని తన తండ్రి ప్రారం భించారని, దానిని తానే పూర్తి చేస్తానని మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేలా కేంద్రం ఎత్తు తగ్గిస్తుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. జగన్‌ ఎన్నికల ప్రచార సమయంలో తనకు 25 మంది ఎంపీలను ఇస్తే కేంద్రం మెడలు వంచి విభజన హామీలు నెరవేర్చేటట్లు చేస్తానని వాగ్దానం చేశారని గుర్తు చేశారు. అధికారం చేపట్టిన తర్వాత జగన్‌ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేయకుండా దిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ప్రధాని మోదీ వద్ద తన కేసుల మాఫీ కోసం మోకరిల్లుతున్నారని ఆరోపిం చారు. ఇకనైనా ముఖ్యమంత్రి తన అహాన్ని పక్కన పెట్టి అన్ని రాజకీయ పార్టీలను దిల్లీ తీసుకువెళ్లి కేంద్రంపై ఒత్తిడి చేసే విధంగా చర్యలు చేపట్టాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో సీపీఐ, సీపీఎం నేతల బృందంతో ప్రాజెక్టు నిర్వాసిత ప్రాంతాలలో పర్యటించి…అన్ని పక్షాలను కలుపుకొని దిల్లీ వెళ్లి ఎంపీలను, కేంద్రమంత్రులను, ప్రతిపక్షాలను కలిసి పోలవరం ప్రాజెక్టుకు జరుగుతున్న అన్యాయం గురించి విశదీకరిస్తామని తెలిపారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, ఏలూరు జిల్లా ఇన్‌చార్జి అక్కినేని వనజ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తు కుదించి మినీ రిజర్వాయర్‌గా చేయడానికి కుట్ర చేస్తున్నదని ఆరోపించారు. వరదల కారణంగా ముంపునకు గురైన కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంత ప్రజలకు నష్టపరిహారం నేటికీ చెల్లించలేదన్నారు. సీపీిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్‌ మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి, నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం గతంలో ఎనిమిది రోజులపాటు సీపీఐ పాదయాత్రలు చేసి లక్ష సంతకాలు సేకరించిందని తెలిపారు. సీపీఐ రాష్ట్ర నాయకులు చలసాని వెంకట రామారావు, ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, కంట్రోల్‌ కమిషన్‌ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, రైతుసంఘం రాష్ట్ర నాయకులు కొమ్మన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
పోలవరంలోనూ కేంద్రం అన్యాయం: జేవీఎస్‌ మూర్తి
తొమ్మిదేళ్లుగా విభజన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం… తాజాగా పోలవరం ప్రాజెక్టు విషయంలోనూ తీరని అన్యాయం చేస్తున్నదని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. ప్రాజెక్టు ఎత్తు తగ్గించ కుండా నిర్మాణాన్ని పూర్తి చేయాలని, నిర్వాసితులకు పునరావాసం, నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ విశాఖ జిల్లా సమితి అధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం నిర్మాణ ఎత్తును కుదిస్తూ కేంద్రమంత్రి ప్రకటన చేస్తే రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వైసీపీ ఎంపీలు నోరుమేదపడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను విస్మరించి, వారి స్వప్రయోజనాలకు తలొగ్గి రాష్ట్ర భవిష్యత్తును కేంద్రం వద్ద తాకట్టు పెడుతున్నారన్నారు. పోలవరం నిర్వాసితులకు వెంటనే పునరావాసం కల్పించి, ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించేం దుకు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని డిమాండ్‌ చేశారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎం.పైడిరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎ.విమల, కసిరెడ్డి సత్యనారాయణ, కె.సత్యాంజ నేయ, ఎస్‌కే రెహమాన్‌, పి.చంద్రశేఖర్‌, ఆర్‌.శ్రీనివాసరావు, జి.రాంబాబు, సీఎన్‌ క్షేత్రపాల్‌ పాల్గొన్నారు.
మోదీ ఎదుట మోకరిల్లుతున్న జగన్‌: ముప్పాళ్ల
పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎలాంటి సడలింపులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో నిర్వహిస్తున్న దీక్ష శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముప్పాళ్ల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం నాలుగు దశాబ్దాలుగా సీపీఐ మడమ తిప్పని పోరాటం చేస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తన కేసుల మాఫీ కోసం ప్రధాని మోదీ ముందు మోకరి ల్లుతూ, ప్రాజెక్టు నిర్మాణాన్ని 133 అడుగుల ఎత్తుకు కుదించాలని, నిర్వాసితులకు అన్యాయం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదు కోట్ల ఆంధ్రుల జీవనాడి, కోస్తా జిల్లా నుంచి రాయలసీమ వరకు సాగునీటిని అందించే పోలవరం నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని ముప్పాళ్ల డిమాండ్‌ చేశారు. సీపీఐ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతీ వరప్రసాద్‌ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కుని పోలవరం ప్రాజెక్టును అటకెక్కిసు ్తన్నాయని విమర్శించారు. దీక్ష శిబిరంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి షేక్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించాలి: జల్లి విల్సన్‌
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా పూర్తిస్థాయిలో నిర్మించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, శాసన మండలి మాజీ సభ్యులు జల్లి విల్సన్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు. సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా సమితి అధ్వర్యంలో జల్లి విల్సన్‌, సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు నాయకత్వంలో సీపీఐ బృందం కలెక్టర్‌ ఎస్‌.ఢల్లీిరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. సీపీఐ జిల్లా నాయకులు బుడ్డి రమేశ్‌, మహిళా సమాఖ్య నాయకులు పంచదార్ల దుర్గాంబ, రైతు సంఘం జిల్లా కన్వీనర్‌ మల్నీడి యల్లమందరావు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నరసింహారావు, సీపీఐ విజయవాడ నగర సహాయ కార్యద ర్శులు లంక దుర్గారావు, నక్కా వీరభద్రరావు, నాయకులు మూలి సాంబశివరావు, తాడి పైడియ్య తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి మౌనం వీడాలి: ఈశ్వరయ్య
పోలవరం ప్రాజెక్టులో నీటి సామర్థ్యం తగ్గించే ఆలోచన మానుకోవాలని, 45.72 మీటర్ల నీటిమట్టంతో నిర్మించాలని, ఎత్తు తగ్గించాలన్న కేంద్రం కుట్రపై సీఎం జగన్‌ మౌనం వీడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు జి.ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. రాయచోటి కలెక్టరేట్‌ వద్ద సీపీఐ చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ నీటి వివాదాలపై ఏర్పాటైన బచావత్‌ ట్రిబ్యునల్‌ తీర్పు ప్రకారం కేంద్ర జలవనరుల సంఘం ఆమోదించిన… రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ హోదా కల్పించిన పోలవరం ప్రాజెక్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి గురవుతోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం నాటి సీఎం రాజశేఖర్‌ రెడ్డి పోలవరం ప్రాజెక్టు కట్టాలని ప్రయత్నిస్తే, ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తామని కేంద్రం చెబుతన్నా ఆయన కుమారుడు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎస్‌ నర్సింహులు, సహాయ కార్యదర్శి మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు.
ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం దుర్మార్గం: జగదీశ్‌
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఎత్తు తగ్గించడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్‌ విమర్శించారు. అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట జిల్లా కార్యదర్శి జాఫర్‌, జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, రంగయ్య, రమణ, రాజేశ్‌ గౌడ్‌, సంతోశ్‌ కుమార్‌, వీరభద్రస్వామి, మల్లికార్జున, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు కుల్లాయ్‌ స్వామి, ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఆనంద్‌, ఏపీి మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు పార్వతీ ప్రసాద్‌, గిరిజన సమాఖ్య రాష్ట్ర నాయకుడు రామాంజ నేయులు రిలే నిరాహారదీక్ష చేపట్టారు. జగదీశ్‌ దీక్షలు ప్రారంభించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
ఎన్ని బటన్‌లు నొక్కినా లాభం లేదు: జంగాల
ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరాన్ని పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్ని బటన్‌లు నొక్కినా ప్రయోజనం శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ విమర్శించారు. పోలవరం ప్రాధాన్యతను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించకపోతే తగిన మూల్యం చెల్లించకతప్పదని హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించకుండా పూర్తి స్థాయిలో నిర్మించాలని కోరుతూ సీపీఐ గుంటూరు జిల్లా సమితి అధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయం వద్ద సామూహిక దీక్షలు చేపట్టారు. సీపీఐ గుంటూరు నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, జిల్లా, నగర నేతలు పాల్గొన్నారు.
కర్నూలులో: పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించాలని కర్నూలు కలెక్టరేట్‌ వద్ద చేపట్టిన నిరాహారదీక్షలను సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు ఆవుల శేఖర్‌, ఎన్‌.లెనిన్‌బాబు ప్రారంభించారు. సీపీఐ పట్టణ సహాయ కార్యదర్శి సి.మహేశ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బి.గిడ్డయ్య, కె.జగన్నాధం, ఎన్‌.మునెప్ప, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో
పోలవరం ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించు కోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రకాశం జిల్లా కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన ధర్నాకు సీపీఐ జిల్లా సమితి సభ్యులు కె.వీరారెడ్డి అధ్యక్షత వహించారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్‌నారాయణ, ఆర్‌.వెంకట్రావు, పీవీఆర్‌ చౌదరి, పి.ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లిలో
పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించే ఆలోచనను కేంద్రం తక్షణమే విరమించుకోవాలని డిమాండ్‌ చేస్తూ అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట నిర్వహించిన నిరసన కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ, సహాయ కార్యదర్శులు మాకిరెడ్డి రామానాయుడు, రాజాన దొరబాబు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో
పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ కాకినాడ కలెక్టరేట్‌కు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహం ముందు నిర్వహించిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు, జిల్లా కార్యదర్శి కె.బోడకొండ, సహాయ కార్యదర్శులు తోకల ప్రసాద్‌, జి.లోవరత్నం తదితరులు పాల్గొన్నారు.
విజయనగరంలో: పోలవరం సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన దీక్షల్లో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు పి.కామేశ్వరరావు, జిల్లా కార్యదర్శి ఓమ్ని రమణ, జిల్లా సహాయ కార్యదర్శులు బుగత అశోక్‌, అలమంద ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.
పార్వతీపురంలో: పోలవరం ఎత్తు తగ్గించకుండా నిర్మించాలని డిమాండ్‌చేస్తూ పార్వతీపురం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన దీక్షల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి కూరంగి మన్మధరావు, జిల్లా కార్యవర్గసభ్యులు గరుగుబిల్లి సూరయ్య, ఈవీ నాయుడు, కూరంగి గోపి, పువ్వుల ప్రసాద్‌, వెంకట్రావు, రంగారావు తదితరులు పాల్గొన్నారు.
భీమవరంలో: పోలవరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిర్మించాలని భీమవరం కలెక్టరేట్‌ ఎదుట నిర్వహించిన దీక్షల్లో జిల్లా సీపీఐ కార్యదర్శి కోనాల భీమారావు, రాష్ట్ర సమితి సభ్యులు కలిశెట్టి వెంకట్రావు, సీహెచ్‌ రంగారావు, సీతారాం ప్రసాద్‌, బొద్దాని నాగరాజు, కళింగ లక్ష్మణరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img