Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎమ్మెల్సీల ఏకగ్రీవంపై దృష్టి

. ప్రత్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ కోసం వైసీపీ తీవ్ర ఒత్తిడి
. ఇప్పటికే 5 స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఏకగ్రీవం
. మిగిలిన స్థానాల్లోనూ అధికార పార్టీ నేతల ముమ్మరయత్నాలు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రంలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్‌, స్థానిక సంస్థల శాసనమండలి నియోజకవర్గాల ఎన్నికలను సాధ్యమైనంత మేర ఏకగ్రీవం చేసి తమ సత్తా చాటాలనే ధోరణితో అధికార పార్టీ వ్యవహరిస్తోంది. ఇందుకోసం వైసీపీయేతర అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరింపజేసేందుకు ఆ పార్టీ నేతలు తమ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఆ అభ్యర్థుల బలం, బలహీనతల ఆధారంగా అధికారం ఉపయోగించి వారిపై వివిధ కోణాల్లో బల ప్రయోగం చేస్తున్నారు. ప్రస్తుతం స్థానిక సంస్థల కోటాలో 9 శాసన మండలి స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, వీటిలో 5 స్థానాల్లో ఇప్పటికే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించనున్నారు. ఎన్నికల అధికారులు సైతం అధికార పార్టీ ఒత్తిడికి తలొగ్గి ప్రత్యర్థుల నామినేషన్‌ పత్రాలను ఏదో ఒక సాకు చూపి తిరస్కరిస్తున్నట్లు ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు నిలబెట్టిన స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ పత్రాల్లో బలపరిచిన వారి సంతకాలు ఫోర్జరీవని ఆయన నామినేషన్‌ను అధికారులు తిరస్కరించారు. దీంతో ఇక్కడ వైసీపీ అభ్యర్థి పి.రామసుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికవనున్నారు. అలాగే అనంతపురం జిల్లాలో స్వతంత్ర అభ్యర్థి వేలూరు రంగయ్య నామినేషన్‌ను అధికారులు స్క్రూటినీలో తిరస్కరించారు. దీంతో ఈ స్థానంలో వైసీపీ అభ్యర్థి ఎస్‌.మంగమ్మ ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ను అధికారులు తిరస్కరించడంతో వైసీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్నిక ఏకగ్రీవం కానుంది. నెల్లూరు జిల్లాలో కూడా బలపర్చిన అభ్యర్థి సంతకం ఫోర్జరీ చేశారన్న అభియోగంతో నామినేషన్‌ను తిరస్కరించడంతో వైసీపీ అభ్యర్థి మేరుగ మురళి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీకి చెందిన కడలి శ్రీదుర్గ, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లను సాంకేతిక కారణాలతో అధికారులు తిరస్కరించడంతో బరిలో కుడుపూడి సూర్యనారాయణరావు మాత్రమే మిగిలారు. ఇలా ఇప్పటివరకు కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో కేవలం వైసీపీ అభ్యర్థులు మాత్రమే మిగలడంతో వారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి ఏర్పడిరది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 27వ తేదీ వరకు గడువు ఉంది. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నియిన అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తారు. దీంతో ఈలోగా మిగిలిన నియోజకవర్గాల్లోనూ ఏకగ్రీవం చేసేందుకు అధికార పార్టీ నేతలు విశ్వయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి స్థానిక సంస్థల్లో అధికార పార్టీ అభ్యర్థులే ఎక్కువ శాతం ఉన్నారు. గెలుపు నల్లేరుపై నడకే. కానీ ఇటీవల అధికార పార్టీపై ప్రజల్లో పెద్దఎత్తున వ్యతిరేకత నెలకొన్న నేపథ్యంలో పోలింగ్‌ జరిగితే ఆ ప్రభావం పడుతుందేమోనని వైసీపీ నేతలు భయపడుతున్నారు. అందుకోసం సాధ్యమైనంత మేర ఏకగ్రీవం చేసుకుంటే మేలన్న ఉద్దేశంతో ప్రత్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు ప్రయత్నిస్తున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గంలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలవడంతో పోటీ అనివార్యంగా కనపడుతోంది. వీరు ప్రస్తుతం ఎవరికీ అందుబాటులో లేకుండా పోవడంతో అధికార పార్టీ నేతలు గాలిస్తున్నారు. వైసీపీ స్థానిక సంస్థల అభ్యర్థిగా కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన డాక్టర్‌ మధుసూదన్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. కర్నూలు, నంద్యాల జిల్లాకు చెందిన స్థానిక సంస్థలకు చెందిన ఓట్లు 1,178 ఉన్నాయి. ఇందులో వైసీపీకి చెందిన సభ్యులు 1,021 మంది, టీడీపీ 129, వామపక్షాలు 5, బీజేపీ 8, ఇండిపెండెంట్‌లు 11 సభ్యులు ఉన్నారు. వైసీపీ సభ్యుల బలం ఉన్నా ఎమ్మెల్సీ ఏకగ్రీవంగా ఎంపిక కావాలని వైసీపీ నేతలు ఆరాటపడుతున్నారు. ఇక శ్రీకాకుళం జిల్లాలో స్వంతంత్ర అభ్యర్థి ఒకరు బరిలో ఉండగా, పశ్చిమ గోదావరి జిల్లాలోని రెండు స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు రంగంలో ఉన్నారు. అలాగే మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరిగే ఎన్నికల్లో మాత్రం భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ ఐదు నియోజకవర్గాలు ఏకగ్రీవం చేయడం అసాధ్యం. దీంతో వైసీపీ ఇప్పటికే ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img