Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థులను గెలిపించండి

. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు
. ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రంలో ఈ నెల 13వ తేదీజరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ, పీడీఎఫ్‌ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు శనివారం రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. లేఖ సారాంశం ఇలా ఉంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజాస్వామ్యం నిరంతర దాడికి గురవుతోంది. ఇందులో భాగంగా పట్టభద్రులు, టీచర్ల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికను కూడా ఒక ప్రహసనంగా మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కనుసన్నల్లో అధికార పార్టీ అడ్డదారులు తొక్కుతోంది. ప్రభుత్వ టెర్రరిజంతో పరిశ్రమలు పారిపోతున్నాయి. నిరుద్యోగం పెరిగిపోయింది. యువత భవిష్యత్‌ అంధకారం అయ్యింది. నేడు ఈ ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ గురించి, డీయస్సీ గురించి ఎలా మోసం చేసిందో కూడా చూశాం. ఇక ప్రభుత్వంలో భాగం అయిన ఉద్యోగులకు ఎప్పుడూ తగిన ప్రాధాన్యం ఇచ్చాం. విభజన కష్టాలు ఉన్నా ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చాం. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చాం. వారికి తగు గౌరవం ఇచ్చాం. ప్రభుత్వ ఉద్యోగులకు అడిగినంత ఫిట్‌మెంట్‌ కాదు కదా… కనీసం ఏ నెల జీతం ఆ నెల ఇచ్చే పరిస్థితి కూడా నేడు లేదు. టీచర్లను లిక్కర్‌ షాపుల వద్ద పెట్టి ఎలా అవమానించారో కూడా రాష్ట్రం మొత్తం చూసింది. ఈ అన్ని అంశాలను యువత, పట్టభద్రులు, ఉద్యోగులు, టీచర్లు గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను. రాష్ట్రంలో రెండేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ అక్రమాలు మనం చూశాం. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ పత్రాలు దాఖలు చేయకుండా హింసకు పాల్పడిరది. అధికార దుర్వినియోగంతో ఎన్నికల్లో పోటీ చేసే హక్కును హరించింది. ఎన్నికల్లో అక్రమాలు అనే విధానానికి అలవాటుపడిన ఈ ప్రభుత్వం… ఇప్పుడు ఆదే విధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలకు, ఫోర్జరీలకు తెరతీసింది. అడ్డదారులతో పట్టభద్రుల, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది. దీనిపై ప్రజలు, ఓటర్లు చైతన్యంతో వ్యవహరించి కుట్రపూరిత వైసీపీకి బుద్ది చెప్పాలని కోరుతున్నాను. గతంలో తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఎలా వేశారో… ఏ స్థాయి అక్రమాలు చేశారో చూశాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బోగస్‌ ఓట్ల సంస్కృతికి అధికార వైసీపీ మళ్లీ తెరతీసింది. తిరుపతిలో ఇల్లు కూడా లేని ఖాళీ స్థలాల్లో ఓట్లు నమోదు చేశారు. ఏడవ తరగతి, టెన్త్‌, ఇంటర్‌ చదివిన వారిని, నిరక్షరాస్యులను పట్టభద్రుల ఓటర్లుగా నమోదు చేశారు. చివరికి వైసీపీ కార్యాలయం అడ్రస్‌ పెట్టి కూడా 38 బోగస్‌ ఓట్లు సృష్టించారు. ఒ తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గంలోని ఒక్క తిరుపతి నగరంలోనే 7 వేలకు పైగా దొంగ ఓట్లు చేర్పించారు. ఇక ఉత్తరాంధ్రలో 5 వేలకు పైగా బోగస్‌ ఓట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవి ఇప్పటి వరకు బయట పడిన సంఖ్య మాత్రమే. మూడు పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికల ఓటర్ల జాబితాలో 20-30 శాతం వరకు దొంగ ఓట్లు ఉంటాయని పరిశీలనలో తేలింది. ఇక ఈ బోగస్‌ ఓట్లతో పాటు కానుకలు ఇచ్చి వైసీపీ ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తోంది. ఓటర్లకు పెద్ద ఎత్తున వెండి నాణేలు పంచుతున్నట్లు తెల్సింది. టీచర్లు, గ్రాడ్యుయేట్లను గుర్తించి వారికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు ఇచ్చి ప్రలోభపెట్టే స్థాయికి అధికార పార్టీ దిగజారింది. అందువల్ల ఎట్టిపరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు.
అందుకే గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మేము పీడీఎఫ్‌తో ఒక అవగాహనకు వచ్చాం. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాకు మొదటి ప్రాధాన్య ఓటు వేసిన తరువాత… రెండో ప్రాధాన్య ఓటు పీడిఎఫ్‌ అభ్యర్థులకు వేయాలని ప్రజలను, మా మద్దతుదారులను కోరుతున్నాం. ఇదే సందర్భంలో పీడీఎఫ్‌ అభ్యర్ధులకు ఓటు వేసిన ఓటర్లను వారి రెండో ప్రాధాన్య ఓటు మాకు వేయాలని కోరుతున్నాం. ఉపాధ్యాయ ఎన్నికల్లో టీడీపీ పోటీలో లేనందునవల్ల టీడీపీ సానుభూతిపరులు పశ్చిమ రాయలసీమ టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్‌కు ఓటు వేయాలని చంద్రబాబు కోరారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img