Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

ఎమ్మెల్సీ పదవుల జాతర

. మేలోగా 21 స్థానాలు ఖాళీ
. మొత్తం దక్కించుకునేందుకు సీఎం కసరత్తు
. అభ్యర్థిత్వాల వేటలో వైసీపీ నేతలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రానున్న మూడు నెలల్లో శాసనమండలిలో పెద్దసంఖ్యలో ఎమ్మెల్సీ పోస్టులు ఖాళీ కానుండడంతో అధికారపార్టీలో హడావుడి ప్రారంభమైంది. ఎమ్మెల్యే కోటాతోపాటు స్థానిక సంస్థలు, పట్టభద్రులు, ఉపాధ్యాయ కోటాల్లో మే 1వ తేదీ లోపు దాదాపు 21 స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ మొత్తం దక్కించుకోవడానికి వైసీపీ ఈసారి గట్టి కసరత్తు చేస్తోంది. గతంలో ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలను అధికారపార్టీలు పెద్దగా పట్టించుకునేవి కావు. ఎమ్మెల్యే, స్థానిక సంస్థల కోటాలో అధికారపార్టీకి ఎక్కువ అవకాశాలుంటాయి. కానీ ఈసారి శాసనమండలిలో ఖాళీ అయ్యే ఏ ఒక్క స్థానాన్నీ వదులుకోకూడదన్న భావనతో వైసీపీ అధిష్ఠానం ఉంది. ఖాళీ అయ్యే స్థానాలకు సంబంధించి అధికార పార్టీలో నేతలు ఎవరి ప్రయత్నాలు వారు మొదలుపెట్టారు. శాసనసభ్యుల కోటాలో ఏడు స్థానాలు ఖాళీ కానున్నాయి. వీటిలో వైసీపీకి చెందిన వారు ఐదుగురు ఉండగా, టీడీపీకి చెందిన నారా లోకేశ్‌, బచ్చుల అర్జునుడు పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. ఈ రెండు స్థానాలు ఈసారి వైసీపీ ఖాతాలో చేరనున్నాయి. ఈ ఏడు పోస్టుల కోసం వైసీపీలో గతంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ పదవులు ఆశించిన నేతలు, జిల్లాల ఇన్‌చార్జిలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉన్నందున, దానికనుగుణంగా నేతలు పార్టీ పెద్దల ఆశీస్సుల కోసం నానా తంటాలు పడుతున్నారు. స్థానిక సంస్థల కోటాలోనూ దాదాపు 9 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఇవన్నీ టీడీపీకి చెందినవి కాగా, ఈసారి అధికార పార్టీ తన ఖాతాలో వేసుకునేందుకు కసరత్తు నిర్వహిస్తోంది. స్థానిక సంస్థల్లో వైసీపీ అభ్యర్థులే పెద్దసంఖ్యలో గెలిచినందున ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకే అవుతుందన్న ధీమాతో ఆ పార్టీ నేతలున్నారు. ఈ కోటాలో అభ్యర్థిత్వాన్ని దక్కించుకునేందుకు వైసీపీలో నేతలు పోటీపడుతున్నారు. టీడీపీలో ఎమ్మెల్సీ పదవులు పొంది గతంలో వైసీపీలోకి వెళ్లిన డొక్కా మాణిక్యవరప్రసాద్‌, పోతుల సునీతలను మళ్లీ కొనసాగించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్‌ నుంచి ఇప్పటికే హామీలు పొంది ఉన్న బొప్పన భవకుమార్‌, యార్లగడ్డ వెంకట్రావు, మండపేటలో పట్టాభిరామయ్య, ఇటీవల మృతి చెందిన ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి సతీమణి శ్రీలక్ష్మి, పర్చూరు నియోజకవర్గ సమన్వయకర్త రావి రామనాథబాబు, మర్రి రాజశేఖర్‌, మేకా శేషుబాబు, జంకె వెంకటరెడ్డి, నర్తు రామారావు, దుట్టా రామచంద్రరావు తదితరులు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇక పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి ప్రకాశంనెల్లూరుచిత్తూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న యండపల్లి శ్రీనివాసులు రెడ్డి, కడపఅనంతపురంచిత్తూరు గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వెన్నుపూస గోపాలరెడ్డి, శ్రీకాకుళంవిజయనగరంవిశాఖపట్నం గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గానికి చెందిన పీవీఎన్‌ మాధవ్‌, కడపఅనంతపురంకర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన కత్తి నర్సింహారెడ్డి, ప్రకాశంనెల్లూరు`చిత్తూరు ఉపాధ్యాయ నియోజకవర్గానికి చెందిన విటపు బాలసుబ్రహ్మణ్యం పదవీకాలం మార్చి 29వ తేదీతో ముగియనుంది. దీంతో ఈసారి ఈ నియోజకవర్గాలకు అధికారపార్టీ నుంచి పోటీ పడేందుకు చాలామంది సిద్ధమవుతున్నారు. ఇలా మొత్తానికి మేలోపు పెద్దసంఖ్యలో ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానుండడంతో ముఖ్యంగా మంత్రులు తమ మద్దతుదారులకు అభ్యర్థిత్వాలు దక్కించుకునేందుకు అన్ని కోణాల్లో ప్రయత్నాలు ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి మాత్రం జిల్లాల వారీగా తాను హామీలిచ్చి ఇప్పటివరకు పదవులు ఇవ్వలేని వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగిస్తూ, మరోవైపు రాబోయే ఎన్నికలకు పార్టీకి ఉపయోగపడేలా ఆయా సామాజికవర్గాల్లో సమర్థులైన వారిని ఎంపిక చేసే కసరత్తు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img