Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఎస్కేఎం నుంచి పేర్లు అందిన వెంటనే ఎంఎస్‌పీపై కమిటీ : తోమర్‌

న్యూదిల్లీ: సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్కేఎం) నుంచి ప్రతినిధుల పేర్లు అందిన వెంటనే పంటల కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)పై ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ శుక్రవారం రాజ్యసభలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో డీఎంకే సభ్యుడు ఎం.షణ్ముగం అడిగిన ప్రశ్నకు సమాధానంగా తోమర్‌ మాట్లాడుతూ… ఎంఎస్‌పీపై కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. రైతులు ఏడాది కాలంగా నిరసనలు చేస్తున్న మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సందర్భంగా ప్రధాని ఈ మేరకు హామీ ఇచ్చారు. సేంద్రీయ వ్యవసాయం, పంటల వైవిధ్యం, ఎమ్‌ఎస్‌పిలను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని పేర్కొన్నారని తోమర్‌ చెప్పారు. ఈ అంశంపై ప్రభుత్వం కసరత్తు చేసిందన్నారు. ‘మేము సంయుక్త కిసాన్‌ మోర్చా నుంచి పేర్లను అడిగాము. వారితో చర్చలు జరుగుతున్నాయి. పేర్లు అందిన వెంటనే కమిటీని ఏర్పాటు చేస్తాం’ అని తోమర్‌ చెప్పారు.
ఎంత బియ్యాన్ని కొంటారో చెప్పండి: టీఆర్‌ఎస్‌
తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యాన్ని కేంద్రం ఎంతమేర కొంటుందో స్పష్టం చేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు డిమాండ్‌ చేశారు. ధాన్యం సేకరణ గురించి ఎన్నో సార్లు చర్చించామని ఆహార మంత్రి పీయూష్‌ గోయల్‌ అంటున్నారని, కానీ ఆయన ప్రతిసారి గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శించారు. డీసెంట్రలైజ్డ్‌ ప్రొక్యూర్మెంట్‌ (డీసీపీ) విధానంలో ధాన్యం సేకరిస్తున్న రాష్ట్రాల నుంచి కేంద్రం ధాన్యం కొంటుందా లేదా అని ఆయన ప్రశ్నించారు. డీసీపీలో భాగంగా రాష్ట్రమే నేరుగా ధాన్యం కొని మిల్లింగ్‌ తర్వాత ఎఫ్‌సీఐకి ఇస్తుందన్నారు. కానీ ధాన్యం కొనుగోలు సమయంలో జూన్‌ నెలలోనే రాష్ట్రం రైతులకు డబ్బులు చెల్లిస్తుందని, కేంద్రం మాత్రం ఆగస్టులో ఆ మొత్తాన్ని ఇస్తుందని కేశవరావు అన్నారు. తమ వద్ద నుంచి ఎంత మొత్తంలో బియాన్ని కొనుగోలు చేస్తారో కేంద్రం స్పష్టంగా చెప్పాలని ఆయన అడిగారు. కేంద్ర ఆహార శాఖ తన లేఖల్లో కానీ ఒప్పందాల్లో కానీ వరి గురించి చెప్పిందని, ఎక్కడా బియ్యం అన్న పదాన్ని వాడలేదన్నారు. తెలంగాణలో భిన్న రకం ధాన్యం ఉంటుందని, ఒడిశాలో మరో రకంగా ఉంటుందని ఆయన అన్నారు. ఆ రకాలతోనే ఉప్పుడు బియ్యం తయారు అవుతుందని ఎంపీ కేశవరావు అన్నారు. దీనిపై ఆహారమంత్రి గోయల్‌ స్పందిస్తూ… రాష్ట్ర ప్రభుత్వాలు ఉప్పుడు బియ్యం సేకరణలో రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలోనే పంపిణీ చేయడానికి రాష్ట్రాలు చిరుధాన్యాన్ని కొనుగోలు చేయవచ్చు కానీ కేంద్రం చేయదని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img