Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఎస్‌కేఎం విభజనకు యత్నించొద్దు

ఎంఎస్‌పీ చట్టం చేసే వరకు ఇళ్లకు వెళ్లం : కేంద్రానికి తికైత్‌ స్పష్టీకరణ

గాజియాబాద్‌ : కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతులు చేపట్టిన మహోద్యమం ముగింపు దశకు చేరుతున్నందున కార్యక్రమాలన్నింటిని జయప్రదం చేయాలని, ప్రదర్శనల్లో భారీ సంఖ్యలో పాల్గొనాలని రైతులకు, కలిసివచ్చే వర్గాలకు బీకేయూ నేత రాకేశ్‌ తికైత్‌ పిలుపునిచ్చారు. ఎంఎస్‌పీకి హామీనిచ్చేలా చట్టం తెచ్చేంత వరకు దిల్లీ సరిహద్దులను ఖాళీ చేసేది లేదని కేంద్రప్రభుత్వానికి స్పష్టంచేశారు. రైతులకు దిల్లీ ప్రవేశం లేకపోతే రైతులు కూడా ప్రభుత్వానికి తలుపులు వేయొచ్చు కదా అని వ్యాఖ్యానించారు. 40కుపైగా రైతు సంఘాల ఛత్ర సంస్థ సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) ఐక్యతను భగ్నం చేసే యత్నాలను మానుకోవాలని, ఉద్యమం చివరి అంకానికి చేరిన సమయంలో జిత్తులు, ఎత్తులు వద్దని కేంద్రానికి హితవు పలికారు. పార్లమెంటులో సాగు చట్టాల ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టాక రైతులంతా తమ ఊళ్లకు, ఇళ్లకు వెళ్లిపోతున్నట్లు అవాస్తవ ప్రచారం జరుగుతోందన్నారు. రైతులతో చర్యలు లేకుండానే ఈ ఉద్యమం ముగియాలన్నది కేంద్రప్రభుత్వ యోచనగా తెలిపారు. ఎస్‌కేఎం నిన్న`నేడు చర్చలకు సిద్ధంగానే ఉందని గుర్తుచేశారు. ఈనెల 4న జరగబోయే సమావేశంలో భవిష్యత్‌ కార్యాచరణను ఎస్‌కేఎం నిర్ణయిస్తుందని తెలిపారు. ఎంఎస్‌పీ చట్టం కోసం రైతులు కొత్తగా డిమాండు చేస్తున్నారని మీడియాలోని ఓ వర్గం ప్రచారం చేయడాన్ని తికైత్‌ ఖండిరచారు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2011లో ఏర్పాటైన కమిటీ కూడా ఎంఎస్‌పీకి చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని సూచించిందని, ఆ కమిటీ సిఫార్సులను ఆచరించాలని ప్రధానిని కోరారు. ఎంఎస్‌సీ చట్టరూపం దాల్చితేగనుక దాని అమలు కోసం కమిటీ అవసరమన్న తికైత్‌ ఈ విషయంలో గందరగోళానికి గురిచేయొద్దు అని మీడియా వర్గాలకు సూచించారు. ఆందోళన సమయంలో దిల్లీలో ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌లోనే కాకుండా ఒక్క హరియాణాలోనే 50వేల మందిపై కేసులున్నాయని, వాటిని ఉపసంహరించుకోవాలని తికైత్‌ డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img