Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏడాదికి రెండుసార్లు లా నేస్తం

2,011 మంది న్యాయవాదులకు కోటి 55 లక్షల విడుదల
లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం జగన్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: జూనియర్‌ న్యాయవాదులు తమ వృత్తిలో స్థిరపడేంత వరకు అండగా నిలుస్తూ ‘లా నేస్తం’ భరోసానిస్తున్నట్లు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన జూనియన్‌ న్యాయవాదులు 2,011 మంది ఖాతాల్లో రూ.1,00,55,000ను బుధవారం క్యాంపు కార్యాలయంలో బటన్‌ నొక్కి సీఎం జమ చేశారు. జగన్‌ మాట్లాడుతూ చదువు పూర్తిచేసుకుని న్యాయవృత్తిలోకి వచ్చిన వారు మొదటి మూడేళ్లు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం తోడుగా ఉందనే భరోసా ఇవ్వడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. వృత్తిలో ఊతమివ్వడంతో పాటు స్థిరపడ్డానికి ‘లా నేస్తం’ సహకరిస్తుందని అన్నారు. మూడున్నరేళ్లలో 4,248 మంది లబ్ధిపొందారని, ఇప్పటివరకు రూ.35.40 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. న్యాయవాదుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో లాయర్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేశామని జగన్‌మోహన్‌ రెడ్డి తెలిపారు. కోవిడ్‌ సమయంలో ఈ నిధుల నుంచి రూ.25 కోట్ల మేరకు సహాయ కార్యక్రమాలు చేపట్టగలిగామన్నారు. ఇందులో ఆడ్వకేట్‌ జనరల్‌ ఆధ్వర్యంలో లా, ఫైనాన్స్‌ కార్యదర్శులు సభ్యులుగా ఉంటూ అడ్వకేట్‌ వెల్ఫేర్‌ ట్రస్టీని నిర్వహిస్తున్నారని, న్యాయశాఖ కార్యదర్శికి నేరుగా లేక ఈ`మెయిల్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. లా నేస్తం పథకానికి పారదర్శకంగా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉందని, ధ్రువీకరణ ప్రక్రియ పూర్తి చేసి శాచురేషన్‌ విధానంలో అర్హుల్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే ఉద్దేశంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి సంవత్సరానికి రెండు దఫాలుగా ఈ పథకం అమలు కానున్నట్లు చెప్పారు. ‘మంచి జరగాలనే తపన, తాపత్రయంతో పాదయాత్రలో మాట ఇచ్చాం. దాన్ని నిలబెట్టుకుంటూ అడుగులు ముందుకు వేస్తున్నాం’ అని సీఎం అన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధి పొందేవారంతా అంకిత భావంతో పేదోడి కోసం పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో న్యాయశాఖ కార్యదర్శి జి.సత్య ప్రభాకరరావు, బెజవాడ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రగిరి విష్ణువర్ధన్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img