Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీకి తీవ్ర నష్టం

ఎగువ భద్రపై కర్ణాటక అక్రమ ప్రాజెక్టు

. జాతీయ హోదా కల్పించిన కేంద్రం
. చోద్యం చూస్తున్న సీమ ప్రజాప్రతినిధులు
. నోరు విప్పని జగన్‌ ప్రభుత్వం

విశాలాంధ్ర బ్యూరో – కర్నూలు: తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం అనేక ఎత్తిపోతల పథకాలు, లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అనధికారికంగా నిర్మిస్తోంది. దీని వలన ఏపీకి ముఖ్యంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడిరది. భద్రా నదిపై నిర్మించిన లిప్టు ఇరిగేషన్‌కు ఈ బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం రూ.5400 కోట్లు కేటాయించడమే కాకుండా దానికి జాతీయ హోదా కల్పించింది. ఈ ప్రాజెక్టును అనధికారికంగా నిర్మించినా రాష్ట్ర ఎంపీలు లోక్‌సభలో ఏమాత్రం అడ్డుకోకపోవడం దారుణం. కృష్ణా బేసిన్‌లో తుంగభద్ర నది ఉపనది. ఆంధ్ర, కర్ణాటక జల ప్రయోజనాల కోసం హాస్పేట వద్ద తుంగభద్ర నదిపై 1953లో 131.29 టీసీఎంసీల సామర్ధ్యంతో తుంగభద్ర ప్రాజెక్టును కర్ణాటక ప్రభుత్వం నిర్మాణం చేపట్టింది. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ కలిపి 212 టీఎంసీల నీరు ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఏపీ, తెలంగాణకు 73.01 టీఎంసీలు, కర్ణాటకకు 138.99 టీఎంసీల నికర జలాలు కేటాయించారు. అయితే ఏపీకి వచ్చే నీటిని ఆ రాష్ట్ర రైతులు అక్రమంగా వాడుకుంటున్నారు. ఏపీకి నీటిని రానివ్వడం లేదు. దీనిపై అనేకసార్లు ఏపీ రైతులు నిరసనలు తెలిపినా కర్ణాటక పట్టించుకోలేదు. తూతూ మంత్రంగా చర్యలు తీసుకోవడం సర్వసాధారణంగా మారింది. అయితే ఇటీవల తుంగభద్ర నదిపై కర్ణాటక ప్రభుత్వం అనధికారికంగా చేపట్టిన లిప్టుఇరిగేషన్‌ ప్రాజెక్టుల వలన ఏపీకి తీరని అన్యాయం జరిగే ప్రమాదం ఏర్పడిరది. కర్ణాటకలోని చిక్‌మంగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, తుముకూరు జిల్లాలలో 2.25 లక్షల ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా రూ.21,473 కోట్లతో మొదటి దశ కింద తుంగ నుండి భద్రకు 17.40 టీఎంసీలు, రెండోదశ కింద భద్ర నది నుండి 29 టీఎంసీల సామర్ధ్యం గల ఎత్తిపోతల పథకాన్ని కర్ణాటక ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే దాదాపు మొదటి విడత పనులు పుర్తికాగా, రెండో దశ కింద చేపట్టిన పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం 2020లో కర్ణాటక ప్రభుత్వం అనుమతులు పొందింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏపీకి రావలసిన నీటి వాటాకు కోత పడే అవకాశం ఉంది. కర్ణాటక ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టి…వడివడిగా పనులు చేస్తున్నా…ఎన్నికల కోసం కేంద్రప్రభుత్వం దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి….ఉత్తర్వులు మంజూరు చేసినా జగన్‌ ప్రభుత్వం, ఇరిగేషన్‌ శాఖ అధికారులు ఏమి చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఈ లిప్టు ఇరిగేషన్‌ ప్రాజెక్టు వలన ఏపీకి ముఖ్యంగా రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. తుంగభద్ర నదిపై కర్ణాటక ఇంకా అనేక అనధికార ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై రాయలసీమ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నోరు తెరవకపోవడం దారుణం. ఇదే పరిస్థితి కొనసాగితే రాయలసీమ ఎడాదిగా మారుతుంది. ప్రజలు సాగు, తాగునీటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రానున్న రోజుల్లో రాయలసీమ ప్రజలు జలోద్యమం చేపట్టే పరిస్థితులను పాలకులు కల్పించడం దురదృష్టకరం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img