Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఏపీలో రోడ్ల అభివృద్ధికి రూ.3లక్షల కోట్లు

22 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేల్లో ఆరు ఇక్కడే
51 రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన
ఏపీకి మరిన్ని ప్రాజెక్టుల కోసం సీఎం జగన్‌ వినతి
రాష్ట్రాలపై వివక్షకు తావులేదు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: ఏపీలో రోడ్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.3లక్షల కోట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి కేంద్రమంత్రులు నితిన్‌ గడ్కరీ, కిషన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో 1380 కిలోమీటర్ల పొడవు గల 51 జాతీయ రహదారి ప్రాజెక్టులకు గురువారం శంకుస్థాపన చేశారు. అనంతరం గడ్కరీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 22 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌ జాతీయ రహదారులు నిర్మిస్తున్నామని, అందులో ఆరు ఏపీలోనే ఉంటాయన్నారు. విశాఖపట్నం నుంచి రాయపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే రూ.16వేల కోట్లతో 2024లోపే పూర్తిచేస్తామన్నారు. నాగపూర్‌ నుంచి విజయవాడకు రూ.15వేల కోట్లతో 2025 నాటికి పూర్తి చేస్తామన్నారు. కృష్ణాజిల్లా అభివృద్ధికి ఇది ఎంతో దోహదం చేస్తుందన్నారు. రూ.17వేల కోట్లతో చేపట్టే బెంగళూరుచెన్నై ప్రాజెక్టు ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీ పెరగడానికి దోహదపడుతుందన్నారు. దేశ అభివృద్ధిలో ఏపీ పాత్ర కీలకమన్నారు. సీఎం జగన్‌ నాయకత్వాన అభివృద్ధిలో ఏపీ మొదటి ఐదు రాష్ట్రాల్లో ఉందని కితాబిచ్చారు. పరిశ్రమలు, వ్యవసాయాభివృద్ధి కీలకమని, తద్వారానే ఉద్యోగ అవకాశాలు పెరిగి…పేదరికం నిర్మూలన జరుగుతుందన్నారు. విజయవాడ తూర్పువైపు రింగ్‌ రోడ్డుకు అనుమతి ఇస్తున్నామని, మొత్తం ముఖ్యమంత్రి కేంద్రాన్ని 20 ఆర్‌వోబీలు అడగ్గా, తాము 30 ఆర్‌వోబీలకు అనుమతి ఇస్తున్నామని చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో జాతీయ రహదారుల నిర్మాణం, అభివృద్ధిలో మీ దార్శనికత స్పష్టంగా కనిపిస్తోందని గడ్కరీని కొనియాడారు. నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ ప్రోగ్రాంలో భాగంగా ఏర్పాటు చేసిన ఫాస్ట్‌ ట్రాక్స్‌ కార్యక్రమం మీరు చేస్తున్న అభివృద్ధి కిరీటంలో మరో కలికితురాయిలా చేరిందన్నారు. గడ్కరీ రాష్ట్ర పర్యటనలో భాగంగా మొత్తం 51 ప్రాజెక్టులకు ముందడుగు పడిరదన్నారు. ఇందులో రూ.10,400 కోట్ల వ్యయంతో నిర్మించిన 741 కిలోమీటర్ల పొడవైన 30 రహదారుల పనులకు శంకుస్ధాపనతో పాటు ఇప్పటికే రూ.11,157 కోట్ల వ్యయంతో పూర్తి చేసిన మరో 21 రహదారులను ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందని చెపుతూ ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు రెండు లైన్ల రోడ్లుగా మారుస్తూ…దాదాపుగా రూ.6,400 కోట్లు ఖర్చు చేయబోతున్నామని తెలిపారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున మీరు చేసిన మంచి పనులన్నింటికీ ఎటువంటి సంకోచం లేకుండా, రాజకీయాలు లేకుండా తమ సంతోషాన్ని, కృతజ్ఞతలూ తెలియజేస్తున్నానన్నారు. మరికొన్ని రోడ్ల నిర్మాణం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరమని, వాటిని కూడా ఆమోదించాలని కోరారు. విశాఖతీరంలో పోర్టు నుంచి భీమిలి- భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు రహదారి నిర్మాణం, విజయవాడ తూర్పున బైపాస్‌, కృష్ణానదిపై వంతెన సహా దాదాపు 40 కిలోమీటర్ల రహదారి నిర్మాణం, కడప జిల్లా భాకరాపేట నుంచి బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా ప్రకాశం జిల్లా బెస్తవారిపేట రహదారి, పుంగనూరు నుంచి పులిచెర్ల మీదుగా చిన్నగొట్టికల్లు రహదారి, సబ్బవరం నుంచి చోడవరం, నర్సీపట్నం మీదుగా తుని రహదారి, విశాఖపట్నం నుంచి నర్సీపట్నం, చింతపల్లి, చింతూరు మీదుగా భద్రాచలం వరకు ఉన్న రహదారి…వీటన్నింటినీ జాతీయ రహదారులగా గుర్తించి అభివృద్ధి చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.
కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోదీ రాష్ట్రాల మధ్య వివక్షకు తావులేకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని, అందుకోసం రోడ్డు, సముద్రం, వాయు కనెక్ట్‌విటీల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. గిరిజనశాఖ ద్వారా అల్లూరి సీతారామరాజు మ్యూజియం విశాఖపట్నంలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విశాఖలో అనేక పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకరిస్తోందన్నారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్‌, కె.నారాయణస్వామి, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రత్యేక చర్చ
అనంతరం సీఎం క్యాంపు కార్యాలయంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులపై నితిన్‌ గడ్కరీతో సీఎం జగన్‌ చర్చించారు. ఆయా ప్రాజెక్టుల అవసరాలను వివరించి ఆమోదించాలని కోరగా, వాటన్నింటిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందిస్తూ వాటి మంజూరుకు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img