Friday, April 19, 2024
Friday, April 19, 2024

కరెక్టే..వైసీపీ-బీజేపీ స్నేహం అలాంటిదే…

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
ఏపీలో వైసీపీ-బీజేపీ స్నేహం తాజాగా మరోసారి చర్చనీయాంశమవుతోంది.తాజాగా ప్రధాని మోడీ భీమవరం టూర్‌ సందర్భంగా చేపట్టిన కార్యక్రమాలు, అల్లూరి జయంతి నిర్వహణ చూస్తే వైసీపీ-బీజేపీ కార్యక్రమంలాగే సాగిందన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్‌ కూడా ఇందులో దాపరికమేమీ లేదని తేల్చిచెప్పేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై ఇవాళ మీడియాతో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఘాటుగా స్పందించారు. ‘‘వైసీపీ, బీజేపీ బంధం గురించి చెప్పినందుకు వైసీపీ ఎంపీ శ్రీధర్‌ను అభినందిస్తున్న’’ అని అన్నారు. అదే సమయంలో బీజేపీతో స్నేహం కారణంగా వైసీపీ రాష్ట్రానికి నిధులు తెస్తోందన్న వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. రాష్ట్రానికి నిధులు ఇస్తున్నారని కోటగిరి చెప్పారని, ఇప్పటివరకూ ఏమిచ్చారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ప్రతి బిల్లుకు వైసీపీ ఎంపీలు బీజేపీకి మద్దతిచ్చామని చెప్పారని.. రాష్ట్రానికి హోదా, విభజన హామీలు ఏమిచ్చారో చెప్పాలన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేట్‌ చేస్తామంటే ఏమీ మాట్లాడలేదని మండిపడ్డారు. నరేష్‌ , పవిత్ర లోకేష్‌ మాదిరిగా పెళ్లి కాకుండా బీజేపీ, వైసీపీ సహజీవనం చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. నూతన విద్యావిధానాన్ని అమలు చేస్తున్నామని చెప్తూ పాఠశాలను మూసివేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల తల్లిదండ్రులు రోడ్డెక్కే పరిస్థితికి తెచ్చారన్నారు. ఇంగ్లీష్‌ మీడియం అని చెప్తూ విద్యార్థులకు విద్యను దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులను నియమించాల్సి వస్తుందని పాఠశాలలు మూసివేస్తున్నారన్నారు. సాక్షి పత్రికను ప్రభుత్వం విలీనం చేసుకోవాలని… అదెలాగూ వైసీపీకి పామ్‌ప్లేట్‌ అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ప్రకటనలు ఒక్క సాక్షికి, మరికొన్ని పత్రికలకు తప్ప మరో పత్రికలకు ఇవ్వడం లేదని అన్నారు. ‘‘ప్రభుత్వ సొమ్ము ఏమన్నా మీకు రాసిచ్చారా’’ అని ప్రశ్నించారు. దీనిపై దిల్లీ స్థాయిలో ఉద్యమం చేసైనా చర్యలు తీసుకునేలా కార్యాచరణ చేపడతామని స్పష్టంచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img