Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీ అభివృద్ధి ఏదీ?

. మూడున్నరేళ్లుగా జగన్‌ కాలయాపన బ నిత్యం మోదీకి జపం
. విభజన హామీలపై నిర్లక్ష్యం బ పక్క రాష్ట్రాలకు పరిశ్రమలు
. పడేకేసిన నీటిపారుదల ప్రాజెక్టులు బ ఉద్యోగ, ఉపాధి కల్పనలో దగా
. కొత్త ఏడాదిలో మెగా డీఎస్సీపై ఆశలు
. పింఛన్లు, రేషన్‌కార్డుల కుదింపుతో ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమగ్రాభివృద్ధి, విభజన హామీలు, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి ఈ ఏడాదిలోనైనా జగన్‌ ప్రభుత్వం అడుగు వేస్తుందా?, లేదా? అనేవీ ప్రశ్నార్థకంగానే ఉన్నాయి. ఇవి జగన్‌కు సవాళ్లుగానే మారుతు న్నాయి. మూడున్నరేళ్ల జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాభివృద్ధి బెత్తెడు ముందుకెళ్లలేదు. పరిశ్రమలు, నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతీ లేదు. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలిపోవడం వెరసి రాష్ట్రంలో ఒక్కటీ నిర్మించలేదు. ప్రభుత్వ ఉద్యోగాలు, పరిశ్రమల్లో ఉద్యోగ కల్పన కనుమరుగైంది. సీఎం జగన్‌ దిల్లీకి ఎన్ని సార్లు వెళ్లినా, వినతులు సమర్పించినా ఫలితం లేదు. ఆ వినతులపై కేంద్రమూ స్పందించడం లేదు. అసలు కేంద్రానికి సీఎం ఏయే వినతులిస్తున్నారేదీ మీడియా ముఖంగా చెప్పడం లేదని, రాష్ట్ర ప్రజలకూ వివరించడం లేదంటూ ప్రతిపక్షాలు నిలదీస్తున్నా జగన్‌ స్పందించడం లేదు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకుగాను ప్రతిపక్షాలను ఇంత వరకు దిల్లీకి తీసుకెళ్లలేదు. వారికి రాష్ట్రంలో ఏ ఒక్కరికీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చిన సందర్భాలు లేవు. కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సాయం లేకపోయినా, అటు జగన్‌ మాత్రం కేంద్రానికి అన్ని విధాలా వత్తాసు పలుకుతున్నారు. చట్టసభల్లో కేంద్రం తీసుకొచ్చిన రైతాంగ, కార్మిక వ్యతిరేక, అలాగే ప్రైవేటీకరణ కోసం తీసుకొచ్చిన బిల్లులకు వైసీపీ ఎంపీలు మద్దతు తెలుపుతున్నారు. పరోక్షంగా ప్రధాని నరేంద్ర మోదీకీ, అమిత్‌ షాకు మద్దతిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ప్రతిపక్షాల సూచనలను, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఖాతరు చేయకుండా… ఒంటెద్దు పోకడలతో జగన్‌ పాలన ఉంది. రాష్ట్రాభివృద్ధి తిరోగమనంలో పయనిస్తోం దంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి. జగన్‌ ఏకపక్ష పాలనతోనే రాష్ట్ర పరిస్థితి దిగజారిందని, సీఎం కేవలం మీట నొక్కే వారిగానే పరిమితమై పోతున్నారంటూ మండిపడుతున్నాయి. జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణం ఇంతవరకూ పూర్తి చేయ లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లనూ లబ్ధిదారులకు కేటాయించలేదు. ప్రతి నెలా వేలాది మంది పేదలకు చెందిన రేషన్‌ కార్డులు, పింఛన్లలో కోత విధించడంతో లబ్ధిదా రులు ఆందోళన చెందుతున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు ఒక్కటీ పూర్తి కాలేదు. నాడు వైఎస్‌ఆర్‌ జలయజ్ఞానికి ప్రాధాన్యత ఇవ్వగా, సీఎం జగన్‌ మాత్రం వాటిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తుతున్నాయి.
జాబ్‌ క్యాలెండరులో జాప్యం
ప్రతి ఏట నిరుద్యోగుల కోసం జాబ్‌ క్యాలెండరు ఇస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చి, నిట్టనిలువునా ముంచేశారు. కేవలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేసి, ఆ తర్వాత మిగిలిన విభాగాల ఉద్యోగాల భర్తీని ప్రభుత్వం గాలికొదిలేసింది. విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల ఉద్యమాల ఫలితంగా ఎట్టకే లకు మూడున్నరేళ్ల తర్వాత పోలీసు కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో వయోపరిమితి పెంచలేదు. దానిపైనా విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమించడంతో ప్రభుత్వం దిగివచ్చి రెండేళ్ల వయోపరిమితిని పెంచింది. దీంతో వేలాది మంది ఉద్యోగాలకు అవకాశం లభించింది. మూడున్నరేళ్ల నుంచి డీఎస్సీ పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో లక్షన్నర మంది అభ్యర్థులకు వయస్సు మించిపోయి, జీవితాంతం నిరుద్యోగులుగా మారిపోయే పరిస్థితి ఉంది. జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు తన పాదయాత్రలో ప్రతి ఏట 10 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామంటూ హామీ ఇవ్వగా, అధికారంలోకి వచ్చిన మూడున్నరేళ్లలోనూ ఇంతవరకు అమలు చేయలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2018`డీఎస్సీకి జనరల్‌ అభ్యర్థుల వయోపరిమితి 44 ఏళ్ల వరకు ఇచ్చి, దరఖాస్తులు స్వీకరించారు. ఆ సమయంలో తక్కువ పోస్టులు ఉన్నందున చాలా మంది ఉపాధ్యాయ పోస్టులు సాధించలేక పోయారు. అదే సమయంలో ఎన్నికలు రావడంతో, జగన్‌ ఇచ్చిన ప్రతి ఏట మెగా డీఎస్సీ హామీని నమ్మి, ఉపాధ్యాయ నిరుద్యోగులంతా ఆయనకు మద్దతిచ్చారు. అప్పటికి 42 ఏళ్ల నుంచి 44 ఏళ్ల లోపు వయస్సు ఉన్న వారంతా చివరి డీఎస్సీ కోసం ఎదురు చూడగా, జగన్‌ మొదటి ఏడాది పాలనలో, రెండో ఏడాది, మూడో ఏడాది… ఇలా మూడున్నరేళ్లలో ఒక్క డీఎస్సీ ఇవ్వలేదు. దీంతో వారందరికీ వయోపరిమితి మించిపోయింది. ఇలా దాదాపు లక్షన్నర మంది అభ్యర్థుల జీవితాలతో జగన్‌ ప్రభుత్వం చెలగాటమాడుతోంది. ఈ నూతన సంవత్సరంలోనైనా జంబో డీఎస్సీ వస్తుందన్న ఆశతో నిరుద్యోగ ఉపాధ్యాయులున్నారు.
విభజన హామీలపై మౌనం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన హామీలు, ప్రత్యేక హోదా, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాల సాధనలో జగన్‌ ప్రభుత్వం విఫలమైంది. మూడున్నరేళ్లయినా ఇంతవరకూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయలేక పోయింది. నాడు ఎన్నికల్లో తనకు 25 మంది ఎంపీలను గెలిపిస్తే… కేంద్ర మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తానంటూ ఆర్భాటంగా ప్రకటనలు చేసిన జగన్‌, తీరా అధికారంలోకి వచ్చాక మోదీకి జపం చేస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు అయినా పోలవరంపైనా ఇదే వైఖరితో ఉన్నారు. పోలవరానికి నిధులు రప్పించి, సకాలంలో పూర్తి చేయింలేక పోయారు. కేంద్ర విద్యా సంస్థలను పూర్తి స్థాయిలో నెలకొల్పలేక పోయారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ ఆర్టీసీ, విద్యుత్‌ పంపిణీ తదితర పెండిరగ్‌ అంశాలు పరిష్కారమవ్వలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో జగన్‌ సన్నిహితంగా మెలుగుతున్నప్పటికీ ఫలితం లేకపోయింది. నిత్యం అప్పులు తెస్తూ… రాష్ట్రాన్ని మరింత ఆర్థికలేమితో కుంగదీస్తున్నారన్న విమర్శలున్నాయి. గత వైఫల్యాలను గుర్తెరిగి, ఈ నూతన సంవత్సరంలోనైనా రాష్ట్రాభివృద్ధి పైన, విభజన హామీల పరిష్కారం పైన సీఎం జగన్‌ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img