Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏపీ గవర్నర్‌గా అబ్దుల్‌ నజీర్‌ బాధ్యతల స్వీకరణ

ప్రమాణ స్వీకారం చేయించిన హైకోర్టు సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా
హాజరైన సీఎం జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ నూతన గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ శుక్రవారం ఉదయం 9.30 గంటలకు రాజ్‌భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. తొలుత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి భారత రాష్ట్రపతి జారీ చేసిన అబ్దుల్‌ నజీర్‌ నియామకపు వారెంట్‌ను చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఇతర ప్రముఖులు గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన ప్రముఖులకు హై టీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అనంతరం గవర్నర్‌తో కలిసి మంత్రి మండలి గ్రూప్‌ ఫొటోను దిగారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్‌ కె.మోషేన్‌ రాజు, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రిటైర్డ్‌ న్యాయమూర్తులు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, గవర్నర్‌ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను శాలువాతో సత్కరించి వెంకటేశ్వరుని ఫొటో, లడ్డూ ప్రసాదాలు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img