Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఏప్రిల్‌ నుంచి ఆందోళన

నిస్సహాయ స్థితిలో ప్రభుత్వ ఉద్యోగులు

. జీతాలూ సక్రమంగా ఇవ్వడం లేదు
. ఉద్యోగుల ఆర్థిక స్థితి మరింత దారుణం
. గవర్నర్‌కు ఉద్యోగ సంఘాల నేతల ఫిర్యాదు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : ప్రభుత్వ ఉద్యోగులంతా నిస్సహాయ స్థితిలో ఉన్నారని, ఏప్రిల్‌ నుంచి ఆందోళనకు దిగక తప్పని పరిస్థితి కనిపిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం రాజ్‌భవన్‌కు చేరుకున్న ఉద్యోగ సంఘ నేతలు గవర్నర్‌కు వారి పరిస్థితులు వివరిస్తూ వినతిపత్రం అందజేశారు. అనంతరం సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటవ తేదీన జీతాలు చెల్లించాలనే నిబంధన ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని గవర్నర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఉద్యోగుల ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించి చెల్లింపులు మరింత దారుణంగా ఉన్నాయన్నారు. ఉద్యోగుల అనుమతి లేకుండానే జీపీఎస్‌ను విత్‌ డ్రా చేశారు. దాదాపు 90 వేల మంది ఉద్యోగుల ఖాతాల నుంచి డబ్బులు తీసుకున్నారు. దీనిపై ప్రశ్నిస్తే సాంకేతిక సమస్య వల్ల జరిగిందని చెపుతున్నారు. అలా అయితే వెంటనే సరి చేయాలి కదా… కానీ ఇంకా పరిస్థితి అలాగే ఉంది. ఉద్యోగ సంఘాల నేతలతో ప్రభుత్వం అవమానకరరీతిలో వ్యవహరిస్తోంది. ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు అమలు చేయలేదు. చివరకు ఈ సంక్రాంతికి ఇస్తానని చెప్పిన డీఏ కూడా ఇవ్వలేదు. తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సినవే అడుగుతున్నాం. వారు ఇస్తానన్నవే ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నాం. బహిరంగంగా చేసిన హామీలు నెరవేర్చడం లేదు. ఆర్థిక శాఖ అధికారులు, మంత్రివర్గ ఉపసంఘానికి తమ సమస్యలు అనేకసార్లు వివరించాం. వారు స్పందించకపోవడం వల్లే గత్యంతరం లేని పరిస్థితుల్లో గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని సూర్యనారాయణ వివరించారు. ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై జోక్యం చేసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు. గవర్నర్‌ సానుకూలంగా స్పందించారని, ఆయన కొన్ని అంశాలపై సందేహాలు వ్యక్తం చేశారని చెప్పారు. ఆర్టికల్‌ 309 ప్రకారం ఉద్యోగ వ్యవస్థపై ప్రత్యక్ష సంబంధాలు, అధికారాలు గవర్నర్‌కు ఉంటాయని, అందుకే ఆయనకు ఫిర్యాదు చేశామన్నారు. తమకు న్యాయం చేస్తామని గవర్నరు హామీ ఇచ్చారన్నారు. ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో రాష్ట్ర కౌన్సిల్‌లో నిర్ణయించి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులందర్నీ సమాయత్తం చేస్తామన్నారు. ఉద్యోగ సంఘ నేతలు ఆస్కార్‌రావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img