Friday, April 19, 2024
Friday, April 19, 2024

ఐక్యతే మన బలం

రాహుల్‌గాంధీ పిలుపు
విపక్షాలకు అల్పాహార విందు
పార్లమెంటు వరకు ఎంపీల సైకిల్‌ మార్చ్‌
ఇంధన ధరల పెంపునకు నిరసన

న్యూదిల్లీ : ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా ఉమ్మడి వ్యూహంతో ముందుకు సాగితేనే విజయం వరిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. సమష్టిగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఆయన మంగళవారం కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌లో విపక్ష నేతలకు అల్పాహార విందు ఇచ్చారు. ప్రభుత్వంపై మూకుమ్మడి దాడి చేసేలా ఉమ్మడి వ్యూహంపై నేతలతో రాహుల్‌ సమాలోచనలు జరిపారు. ఆయన మాట్లాడుతూ, ‘మీ అందరిని ఆహ్వానించడం వెనుక ఉద్దేశం ప్రతిపక్షాల ఐక్యతే… మన గళం ఎంతలా కలిసిపోతే అంతే శక్తిమంతులం కాగలం. దానిని అణచివేయడం బీజేపీ`ఆర్‌ఎస్‌ఎస్‌లకు అంతే కష్టంగా మారుతుంది. ఐక్యత మూలాల దృష్ట్యా మనం ఏకతాటిపైకి రావాలి’ అని అన్నారు. సమావేశంలో 100 మంది కాంగ్రెస్‌ ఎంపీలు, టీఎంసీ, ఎన్‌సీపీ, శివసేన , డీఎంకే, సీపీఐ, సీపీఎం, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ, జేఎంఎం, జేకేఎన్‌సీ, ఐయూఎంఎల్‌, ఆర్‌ఎస్‌పీ, కేసీఎం, ఎల్‌జేడీ, ఆర్‌ఎస్‌పీ పార్టీల నేతలు పాల్గొన్నారు. మొత్తం 17 ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించగా బీఎస్పీ, ఆప్‌ నేతలు హాజరు కాలేదు. అనంతరం పెరిగిన పెట్రో ధరలకు నిరసనగా ఎంపీలు సైకిళ్లపై పార్లమెంటుకు చేరుకున్నారు. కొందరు నడుచుకుంటూ వెళ్లారు. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో భారీ పెంపుదల ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే అనేక కష్టాల్లో ఉన్న పౌరులపై అదనపు భారం పడుతోంది. తామంతా క్లబ్‌ నుంచి పార్లమెంటు వరకు సైకిల్‌పై వెళితే దాని ప్రభావం కచ్చితంగా ఉంటుంది అని రాహుల్‌ గాంధీ అన్నారు.
పెగాసస్‌, రైతుల సమస్యలు, ఇతర ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల గళాన్ని ప్రభుత్వం వినిపించుకోవడం లేదని, అందుకే తామంతా ఏకం కావాలని నిర్ణయించామని, ఉమ్మడి వ్యూహంతో పార్లమెంటులో వ్యవహరిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img