Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఐదుగురు జడ్జీలకు గ్రీన్‌ సిగ్నల్‌

. కొలీజియం సిఫార్సుకు కేంద్రం సానుకూలం
. రాష్ట్రపతి ఆమోదం కోసం ఫైలు

న్యూదిల్లీ: అత్యున్నత న్యాయస్థానంలో ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసులను మోదీ ప్రభుత్వం ఎట్టకేలకు ఆమోదించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం డిసెంబరు 13న ఈ నియామకాల కోసం సిఫారసు చేసింది. ప్రధానమంత్రి కార్యాలయం ఫిబ్రవరి 2న ఈ సిఫారసులకు ఆమోదం తెలిపింది. అనంతరం వీరి నియామకాల కోసం ఫైలును రాష్ట్రపతి భవన్‌కు పంపించింది. జాతీయ మీడియా తెలిపిన వివరాల ప్రకారం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని కొలీజియం డిసెంబరు 13న సుప్రీంకోర్టులో ఐదుగురు న్యాయమూర్తుల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌ కరోల్‌, మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ పీవీ సంజయ్‌ కుమార్‌, పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అహసనుద్దీన్‌ అమానుల్లా, అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసింది. వారి నియామకాలకు వారంట్స్‌ ఆఫ్‌ అపాయింట్‌మెంట్‌ జారీ అయితే, అందరూ వచ్చేవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. ఇదిలావుండగా, సాధారణంగా ఒక ఫైలు క్లియర్‌ కాకుండా మరొక ఫైలును సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి పంపించదు. కానీ ఈ ఐదుగురు న్యాయమూర్తుల నియామకానికి పంపించిన ఫైలును కేంద్రం క్లియర్‌ చేయకముందే, కొలీజియం మరో ఇద్దరి పేర్లను సిఫారసు చేసింది. ఈ రెండో సిఫారసును జనవరి 31న పంపించింది. అలహాబాద్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌, గుజరాత్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరవింద్‌ కుమార్‌లను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సిఫారసు చేసింది. కొలీజియం వ్యవస్థపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు ఇటీవల విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఉపరాష్ట్రపతి జగ్‌దీప్‌ ధన్కర్‌ కూడా న్యాయవ్యవస్థ తీరుపై ఇటీవల విరుచుకుపడ్డారు. నేషనల్‌ జ్యుడిషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేయడాన్ని ప్రస్తావిస్తూ, పార్లమెంటరీ సార్వభౌమాధికారాన్ని కార్యనిర్వాహక శాఖ కానీ, న్యాయ వ్యవస్థ కానీ నిర్వీర్యం చేయరాదన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img