ప్రపంచాన్ని వణుకు పుట్టిస్తోన్న కొవిడ్`19 మహమ్మారి రోజురోజకు రూపాంతరం చెందుతూ కొత్త వేరియంట్ల రూపంలో పుట్టుకొస్తూనే ఉంది. ఇప్పటికీ అభివృద్ధి చేసిన వాక్సిన్లు, చికిత్త విధానాల పనితీరును సవాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వైరస్ రూపాంతరమైన ఒమిక్రాన్‌తోపాటు ఇతర రూపాంతరాలను కూడా అడ్డుకునే యాంటీబాడీస్‌ను శాస్త్రవేత్తలు గుర్తించారు. తద్వారా ఒమిక్రాన్‌కు మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చే అవకాశంగల ఇతర రూపాంతరాలకు సైతం వ్యాక్సిన్లను డిజైన్ చేయడానికి, యాంటీబాడీ చికిత్సలకు దోహదపడతాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన తాజా అధ్యయనం ‘నేచర్’ జర్నల్‌లో ప్రచురితమైంది. యాంటీబాడీస్‌పై దృష్టి పెడితే, ఈ వైరస్ నిరంతర పరిణామాన్ని అధిగమించేందుకు ఓ మార్గం ఉందని ఈ పరిశోధన వెల్లడిరచిందని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డేవిడ్ వీస్లెర్ పేర్కొన్నారు. స్పైక్ ప్రొటీన్‌ను ఉపయోగించుకుని ఈ వైరస్ మానవుల సెల్స్‌లో ప్రవేశించి, సోకుతుందని తెలిపారు. ఈ స్పైక్ ప్రొటీన్‌లో ఒమైక్రాన్ వేరియంట్‌కు అత్యధికంగా, అసాధారణంగా 37 మ్యుటేషన్స్ ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి సోకడంతోపాటు, అంతకుముందు ఈ ఇన్ఫెక్షన్ సోకినవారికి వేగంగా ఈ వేరియంట్ వ్యాపించడానికిగల కారణాన్ని కొంత వరకు ఈ మార్పులు వివరించగలుగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌లో ఇప్పటి వరకు వచ్చిన రూపాంతరాలు సోకిన రోగుల నుంచి, ఈ వైరస్ గత రూపాంతరాలను ఎదుర్కొనడానికి టీకాలు తీసుకున్నవారి నుంచి, అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత టీకాలు తీసుకున్నవారి నుంచి యాంటీబాడీలను సేకరించి ఈ పరిశోధనలో వినియోగించినట్లు తెలిపారు. గతంలో వచ్చిన వేరియంట్లు సోకినవారి నుంచి సేకరించిన యాంటీబాడీస్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆరు వ్యాక్సిన్లలో ఏదో ఒకదానిని స్వీకరించినవారి నుంచి సేకరించిన యాంటీబాడీస్‌ను కూడా ఈ పరిశోధనలో అధ్యయనం చేసినట్లు వివరించారు. ఒమిక్రాన్‌ను అడ్డుకునే నాలుగు రకాల యాంటీబాడీస్‌ను పరిశోధకులు గుర్తించినట్లు తెలిపారు. మొత్తానికి ఒమిక్రాన్‌ను ఎదుర్కొనడానికి మూడో డోస్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని తెలిపారు.