అమెరికా వైద్య నిపుణులు ఆంటోనీ ఫౌచీ
దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ యావత్ దేశాలను వణికిస్తోంది. ఈ వేరియంట్‌పై ప్రపంచవ్యాప్తంగా విస్తృతస్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయి. మునుపటి వేరియంట్లతో పోలిస్తే కొత్తరకానికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న విషయం నిజమే అని, అది డెల్టా కన్నా వేగంగా విస్తరిస్తోందని, కానీ డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రమాదకరమైంది ఏమీ కాదు అని అమెరికా అంటువ్యాధుల నిపుణులు, బైడెన్ ముఖ్య వైద్య సలహాదారు ఆంటోనీ ఫౌచీ అన్నారు. ఈ కొత్త వేరియంట్ తీవ్రత గురించి మాట్లాడుతూ, ఇది డెల్టా కన్నా ప్రమాదకరమైంది ఏమీ కాదనన్నారు. దక్షిణాఫ్రికా డేటాను పరిశీలిస్తే, అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య ఎక్కువగా ఉందని, కానీ ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య డెల్టా కన్నా తక్కువగా ఉన్నట్లు చెప్పారు. అయితే దక్షిణాఫ్రికా పరిణామాలను పూర్తిగా అంచనా వేసేందుకు మరికొన్ని వారాల సమయం పడుతుందని ఆంటోనీ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ విస్తరిస్తున్న నేపథ్యంలో.. దాని తీవ్రత తెలుసుకునేందుకు ఇంకా కొంత సమయం పడుతుందన్నారు. ప్రస్తుతం ఈ కొత్త వేరియంట్ 38 దేశాల్లో గుర్తించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ఒమిక్రాన్ మరణాలు ఏమీ లేకున్నా.. ఆ వైరస్ వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో ఉన్న 30 మ్యుటేషన్లు ఆందోళన కలిగిస్తున్నాయి. దీని పుట్టుకపై మాత్రం ఇంకా అస్పష్టత ఉన్నట్లు ఆయన తెలిపారు. రెండు డోసుల టీకాలు తీసుకున్నవాళ్లు అవసరమైతే బూస్టర్ తీసుకోవాలని సూచించారు.