Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ఓబీసీ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ప్రతిపక్షాల మద్దతు
ఉభయ సభల్లో ఆగని పెగాసస్‌ ప్రకంపనలు

న్యూదిల్లీ : రాష్ట్రాలు సొంతంగా ఓబీసీల జాబితాలను రూపొందించే అధికారాలను పునరుద్ధరించే బిల్లుకు లోక్‌సభ మంగళవారం ఆమోద ముద్ర వేసింది. ఇందుకోసం 127వ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొని ప్రతిపక్షాలు మద్దతు ప్రకటించాయి. పెగాసస్‌ వ్యవహారం, సాగు చట్టాలు తదితర అంశాలపై వాయిదా పడుతూ వచ్చిన లోక్‌సభలో ఓబీసీ సవరణ బిల్లును కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్‌ ప్రతిపాదించారు. రాజ్యాంగం (127వ సవరణ) బిల్లుపై చర్చించారు. ఇది చరిత్రాత్మక శాసనమని, దేశంలోని 671 కులాలకు లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. రాష్ట్రాలు సొంతంగా ఓబీసీల జాబితాలను రూపొందించే అధికారాలను పునరుద్ధరిస్తుందని, వేర్వేరు వర్గాలకు సామాజిక, ఆర్థిక న్యాయం జరుగుతుందని తెలిపారు. రీ`నంబరింగ్‌ తర్వాత దీనిని 105వ రాజ్యాంగ సవరణగా పరిగణించాలని చెప్పారు. కాంగ్రెస్‌ నేత అధిర్‌ రంజన్‌ చౌదరి చర్చను ప్రారంభించారు. తమ పార్టీ ఓబీసీ బిల్లుకు సంపూర్ణంగా మద్దతిస్తోందని తెలిపారు. ఇది కీలకమైన బిల్లు కాబట్టే తాము చర్చలో పాల్గొంటున్నామన్నారు. విపక్షాలే సభను అడ్డుకుంటున్నాయని ప్రభుత్వం చెబుతోందిగానీ ప్రజల వెతలను పట్టించుకోవడం లేదని చెప్పారు. అందుకే వాటిని వెలుగులోకి తెచ్చేందుకు తాము యత్నిస్తున్నామన్నారు. ఓబీసీ జాతీయ కమిషన్‌ 2018లో రాష్ట్రాల హక్కులను తీసుకున్నదని, మీరు చేసిన తప్పునే ఇప్పుడు మళ్లీ సరిదిద్దుతున్నట్లు చెప్పారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో ఈ బిల్లును తెచ్చినట్లు అధిర్‌ ఆరోపించారు. పెగాసస్‌ వ్యవహారంలో చర్చ నుంచి కేంద్రం పారిపోతోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదించాలంటే మూడవ వంతు సభ్యుల మద్దతు అవసరం. పెగాసస్‌ తదితర అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహించాయి. దాంతో సభ వాయిదా పడి తిరిగి సమావేశం కాగా విపక్ష సభ్యులు నినాదాలు అందుకున్నారు. గందరగోళం నడుమ బిల్లులపై చర్చను స్పీకర్‌ ఓం బిర్లా ప్రారంభించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు తమ స్థానంలోకి వెళ్లి కార్యకలాపాల్లో పాల్గొన్నారు. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత మధ్యాహ్నం వరకు వాయిదాలు కొనసాగాయి. ప్రశ్నోత్తరాలప్పుడు ఈ కామర్స్‌ నిబంధనలపై ఒక ప్రశ్నను మాత్రమే సంబంధిత మంత్రి సమాధానం ఇవ్వగలిగారు. విపక్షాల ఆందోళన కారణంగా సభ 15 నిమిషాలు వాయిదా పడిరది. ఇదిలావుంటే చర్చ సమయంలో దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని జేడీయూ నేత లల్లన్‌ సింగ్‌, ఎస్పీ నేత అఖిలేశ్‌ యాదవ్‌, బీఎస్పీ నేత రితేశ్‌ పాండే, డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు డిమాండు చేశారు. రిజర్వేషన్‌లో 50శాతం సీలింగ్‌నకూ ఎంపీలు బాలు, యాదవ్‌ డిమాండు చేశారు. కాగా, ఆర్‌ఎస్పీ నేత ఎన్‌కే ప్రేమ్‌చంద్ర, ఎన్సీపీ నేత సప్రియా సూలే, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, శివసేన ఎంపీలు ఓబీసీ బిల్లుకు మద్దతిచ్చాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img